బతుకమ్మ, దసరాకు 7 వేల ప్రత్యేక బస్సులు | TSRTC Special Bus Services for Bathukamma & Dussehra Festivals | 7754 Buses and Advanced Booking | Sakshi
Sakshi News home page

బతుకమ్మ, దసరాకు 7 వేల ప్రత్యేక బస్సులు

Sep 18 2025 4:34 PM | Updated on Sep 18 2025 5:05 PM

TGSRTC arranged seven thousand buses for dussehra festival

సాక్షి, హైదరాబాద్‌: బతుకమ్మ, దసరా సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏడువేల పైచీలుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని సంస్థ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. ఈ పండుగ‌ల‌కు రాష్ట్రవ్యాప్తంగా 7754 స్పెష‌ల్ బ‌స్సుల‌ను నడిపేందుకు సిద్ధం కాగా.. అందులో 377 స్పెష‌ల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. 

 ఈ నెల 20 నుంచి అక్టోబ‌ర్ 2 వరకు ప్ర‌త్యేక బ‌స్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.  సద్దుల బ‌తుకమ్మ ఈ నెల 30న‌, దసరా అక్టోబ‌ర్ 2న ఉన్నందున.. ఈ నెల 27 నుంచే సొంతూళ్ల‌కు ప్ర‌యాణికుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశ‌ముండ‌టంతో ఆ మేర‌కు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచ‌నుంది. అలాగే, తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6వ తేదిల్లోనూ రద్దీకి అనుగుణంగా బస్సులను సంస్థ ఏర్పాటు చేయనుంది.

ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మాట్లాడుతూ .. బ‌తుకమ్మ‌, ద‌స‌రా పండుగ‌ల దృష్ట్యా ప్ర‌జ‌ల‌కు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి సంస్థ సంసిద్ధంగా ఉంది. గ‌త ద‌స‌రా కంటే ఈ సారి అద‌నంగా 617 ప్ర‌త్యేక బ‌స్సులను ఏర్పాటు చేశాం. ర‌ద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంప్‌లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాం.  ముఖ్యంగా ఎల్బీన‌గ‌ర్, ఉప్ప‌ల్, ఆరాంఘ‌ర్, కేపీహెచ్‌బీ, సంతోష్ నగర్, త‌దిత‌ర ప్రాంతాల్లో ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం షామియానాలు, కూర్చీలు, తాగునీరు, తదితర మౌలిక సదుపాయాలతో పాటు ప‌బ్లిక్ అడ్ర‌స్ సిస్టంను ఏర్పాటు చేయాలని క్షేత్ర‌స్థాయి అధికారుల‌కు ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశాం. ప్రతి రద్దీ ప్రాంతం వద్ద పర్యవేక్షణ అధికారులను నియమిస్తున్నాం. ప్రయాణికుల రద్దీని బట్టి వారు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతారు. పోలీస్, ర‌వాణా, మున్సిపల్ శాఖల అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాల‌కు చేర్చడమే లక్ష్యంగా సంస్థ అన్ని చర్యలు తీసుకుంటోంది.” అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement