జీఎస్టీలోకి పెట్రోల్‌ కలేనా? | One Nation, One Tax Debate, Know Reason Behind Why Petrol And Diesel Are Still Outside GST, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

జీఎస్టీలోకి పెట్రోల్‌ కలేనా?

Jul 23 2026 4:31 AM | Updated on Jul 23 2026 11:27 AM

Why is fuel an exception in the One Nation One Tax regime

ఒకే దేశం–ఒకే పన్ను విధానంలోఇంధనానికి మాత్రం మినహాయింపు ఎందుకు? 

పెట్రో ధరల్లో సగానికిపైగా పన్నుల వడ్డనే.. 

ఇంధన మంట వెనుక ప్రభుత్వాల పన్నుల మాయాజాలం 

ఆదాయ వేటలో సామాన్యుడిపై నిలువు దోపిడీ

సాక్షి, హైదరాబాద్‌: ఒకే దేశం–ఒకే పన్ను అంటూ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థను తెచ్చి ఏళ్లు గడుస్తున్నా సామాన్యుడి నిత్యావసరాలైన పెట్రోల్, డీజిల్‌కు మాత్రం ఆ మోక్షం కలగడం లేదు. తాజాగా రోజువారీ సవరణలో భాగంగా ఆదివారం నాలుగు పైసలు పెరగడంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 112.85కి చేరగా డీజిల్‌ ధర మాత్రం రూ. 100.94 వద్దనే స్థిరంగా ఉంది. రోజువారీ ధరల పెంపు సామాన్యుడి జేబులకు చిల్లు పెడుతోంది. అయితే వినియోగదారుడు బంకులో చెల్లించే ధరలో ముడిచమురు ఖరీదు, శుద్ధి వ్యయం కలిపినా సగం కంటే తక్కువేనన్న విషయం విస్మయానికి గురిచేస్తోంది. 

ఇంధనాన్ని జీఎస్టీ పరిధిలోకి తెస్తే లీటర్‌ పెట్రో ధరలు సగం వరకు తగ్గుతాయని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ ఖజానాలు నింపుకోవడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు ససేమిరా అంటున్నాయి. ఇంధనానికి జీఎస్టీ వర్తింపజేస్తే అంతర్జాతీయ ముడి చమురు ధరల హెచ్చుతగ్గులను బట్టి చూసినా లీటర్‌ పెట్రోల్‌ రూ. 75 నుంచి రూ. 81 మధ్యే లభించనుంది. దీనివల్ల సాసామాన్యుడికి లీటర్‌పై దాదాపు రూ. 30 వరకు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. 

లీటర్‌ ముడిచమురు అసలు ధర ఎంతంటే.. 
గ్లోబల్‌ మార్కెట్‌లో ముడిచమురు ధరలను బ్యారెల్‌ (సుమారు 159 లీటర్లు) ప్రాతిపదికన చమురు సంస్థలు కొనుగోలు చేస్తాయి. ప్రస్తుతం అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర సుమారు 105 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 9,800) పలుకుతోంది. దీన్ని లీటర్‌వారీగా విభజించి దేశానికి దిగుమతి చేసుకునే సగటు ధరను గణిస్తే ఒక లీటర్‌ ముడిచమురు అసలు ధర పెట్రోల్‌పై రూ. 55.42, డీజిల్‌కు రూ. 55.26 మాత్రమే పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌ హెచ్చుతగ్గులు, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆధారంగా చమురు కంపెనీలు ఈ ధరను ప్రతిరోజూ సవరిస్తుంటాయి.  

రిఫైనరీల నుంచి బంకుల వరకు చేరాక.. 
ఓడరేవులకు చేరిన ముడిచమురును ప్రభుత్వరంగ చమురు సంస్థలైన ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌ తమ రిఫైనరీల్లో శుద్ధి చేస్తాయి. ముడిచమురు నుంచి పెట్రోల్, డీజిల్‌ను వేరు చేయడానికి అయ్యే శుద్ధి చార్జీలు, కంపెనీల వ్యయం, మార్కెటింగ్‌ ఖర్చులు, వివిధ ప్రాంతాల్లోని పెట్రోల్‌ బంకులకు చేరవేయడానికి అయ్యే రవాణా ఖర్చులన్నీ కలిపి లీటర్‌పై అదనంగా రూ. 4.30 నుంచి రూ. 4.35 వరకు మాత్రమే అవుతాయి. శుద్ధి, రవాణా ఖర్చులను ముడిచమురు ధరకు కలిపిన తర్వాతే చమురు సంస్థలు ఇంధనాన్ని డీలర్లకు (బంకులకు) విక్రయిస్తాయి.  

కేంద్ర, రాష్ట్రాల డబుల్‌ వడ్డన 
ఆయిల్‌ కంపెనీలు బంకులకు విక్రయించే ధరపై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లీటర్‌ పెట్రోల్‌పై రూ. 19.90, డీజిల్‌పై రూ. 15.80 చొప్పున ఎక్సైజ్‌ డ్యూటీ వసూలు చేస్తోంది. దీనికితోడు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌పై దేశంలోనే అత్యధికంగా 35.20% వ్యాట్, డీజిల్‌పై 27% వ్యాట్‌ పన్ను విధిస్తోంది. ఇంధనం అసలు ధర, కేంద్ర పన్ను, డీలర్‌ కమీషన్‌ అన్నీ కలిపిన మొత్తంపై రాష్ట్ర ప్రభుత్వం ఈ భారీ శాతాన్ని లెక్కిస్తోంది. దీనికి అదనంగా లీటర్‌ పెట్రోల్‌పై సగటున రూ. 3.82, డీజిల్‌పై రూ. 2.58 డీలర్‌ కమీషన్‌ను కూడా వినియోగదారుడే భరిస్తున్నాడు. ఫలితంగా పన్నులపై పన్నులు పడి సామాన్యుడిపై మోయలేని భారం పడుతోంది.  

జీఎస్టీలోకి ఇంధనంపై ప్రభుత్వాల ససేమిరా.. 
ఇంధనానికి జీఎస్టీ వర్తిస్తే సామాన్యుడికి భారీ ఉపశమనం లభిస్తుందని తెలిసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకించడం వెనుక పెద్ద ఆదాయ వ్యూహం దాగి ఉన్నట్లు కనిపిస్తోంది. కేంద్రం వసూలు చేసే ఎక్సైజ్‌ డ్యూటీలో ఎక్కువ భాగం సెస్‌ రూపంలోనే ఉంటుంది. ఈ సెస్‌ ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం కేంద్రానికి లేదు. అదే జీఎస్టీ పరిధిలోకి వస్తే ఈ ఆదాయాన్ని 50:50 నిష్పత్తిలో రాష్ట్రాలకు సమానంగా ఇవ్వాల్సి వస్తుంది. మరోవైపు రాష్ట్రాలకు మద్యం, ఇంధనమే ప్రధాన ఆదాయ వనరులుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం పెట్రోల్‌పై వస్తున్న 35.20% వ్యాట్‌తో పోలిస్తే గరిష్ట జీఎస్టీ 28% వేసినా రాష్ట్రానికి లభించేది 14% మాత్రమే. 

దీనివల్ల తమ ఖజానాలకు రూ. వేల కోట్ల మేర గండిపడే అవకాశం ఉండటంతో ఆర్థిక స్వయంప్రతిపత్తి దెబ్బతింటుందని రాష్ట్రాలు భయపడుతున్నాయి. ఫలితంగా ముడిచమురు అసలు ధర కంటే పన్నుల రూపంలోనే లీటర్‌ పెట్రోల్‌పై రూ. 49.22, డీజిల్‌పై రూ. 38.80 వసూలు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడిని పన్నుల చక్రబంధంలో బంధించాయి. జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశాల్లో ఇంధన ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆదాయ నష్టాన్ని సాకుగా చూపుతూ కాలయాపన చేస్తుండటం, ఖజానా నింపుకోవడం కోసం సామాన్య వినియోగదారుడిని నిలువు దోపిడీకి గురిచేస్తుండటం గమనార్హం.  

జీఎస్టీ పరిధిలోకి వస్తే.. 
ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే ప్రస్తుతం ఉన్న కేంద్ర ఎక్సైజ్‌ డ్యూటీ, రాష్ట్ర వ్యాట్‌ పన్నులు రద్దవుతాయి. పన్నులు లేకుండా ముడిచమురు, శుద్ధి, రవాణా, డీలర్‌ కమీషన్‌ అన్నీ కలిపిన పెట్రోల్‌ అసలు ధర రూ. 63.59 మించదు. దీనిపై జీఎస్టీలోనే అత్యధిక పన్ను స్లాబ్‌ 28% విధిస్తే (కేంద్రానికి 14%, రాష్ట్రానికి 14% సమానంగా) పన్ను రూ. 17.80 అవుతుంది. అప్పుడు లీటర్‌ పెట్రోల్‌ రూ. 81.39కే లభిస్తుంది. ఒకవేళ జీఎస్టీ నిబంధనల ప్రకారం డీలర్‌ కమీషన్‌ను మినహాయించి కేవలం ఇంధన బేస్‌ ధర (రూ. 59.77)పైనే పన్ను లెక్కిస్తే ధర మరింత తగ్గుతుంది. అంతేకాకుండా పెట్రోల్‌ నిత్యావసర వస్తువు కాబట్టి జీఎస్టీ కౌన్సిల్‌ దీన్ని ఒకవేళ 18% స్లాబ్‌లోకి తెస్తే పన్ను రూ. 11.45కి తగ్గి లీటర్‌ పెట్రోల్‌ రూ. 75.04కే అందుబాటులోకి వస్తుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement