ప్రతి సెకను ఇక పక్కా.. | Latest technology from indigenous companies No chance for network delays | Sakshi
Sakshi News home page

ప్రతి సెకను ఇక పక్కా..

Jul 23 2026 4:21 AM | Updated on Jul 23 2026 5:57 AM

Latest technology from indigenous companies No chance for network delays

నానో సెకను కూడాకచ్చితంగా లెక్క 

వైట్‌ రాబిట్‌ నెట్‌వర్క్‌తోఒకే దేశం.. ఒకే కాలం 

స్వదేశీ సంస్థల సరికొత్త సాంకేతికత.. నెట్‌వర్క్‌ఆలస్యానికి నో చాన్స్‌  

భారత కాలమానానికి ఇదొక రక్షణ కవచం

బెంగళూరు వేదికగా విజయవంతమైన ప్రయోగం 

ఆధునిక డిజిటల్‌ యుగంలో ప్రతి సెకను కూడా ఎంతో విలువైనది. మనం మొబైల్‌ ఫోన్‌ ద్వారా చేసే నగదు బదిలీలు, ఫోన్‌ కాల్స్, విద్యుత్‌ సరఫరా వ్యవస్థల పర్యవేక్షణ, ఉపగ్రహ సమాచార మార్పిడి వంటి రంగాలన్నింటికీ కచ్చితమైన సమయం అత్యంత ముఖ్యం. అయితే మన దేశంలో ఇలాంటి కీలక వ్యవస్థలన్నీ ఇప్పటివరకు అమెరికాకు చెందిన అంతరిక్ష ఉపగ్రహ ఆధారిత వ్యవస్థలపైనే ఆధారపడి నడుస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో విదేశీ సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గించి భారతదేశానికి డిజిటల్‌ సార్వభౌమాధికారం, స్వయం ప్రతిపత్తిని చేకూర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక అడుగు వేసింది. ’ఒకే దేశం, ఒకే కాలం’ అనే అద్భుతమైన సంకల్పంతో సరికొత్త ’వైట్‌ రాబిట్‌’ సాంకేతిక ఆధారిత నెట్‌వర్క్‌ను బెంగళూరులోని ప్రాంతీయ ప్రమాణాల ప్రయోగశాలలో ప్రారంభించింది.    

ఏమిటీ వైట్‌ రాబిట్‌ సాంకేతికత..?
గతంలో కంప్యూటర్లు, సర్వర్లలో సమయాన్ని సరి చేయడానికి సాధారణ ఇంటర్నెట్‌ ప్రోటోకాల్స్‌ వాడేవారు. కానీ ఆయా ప్రోటోకాల్స్‌ను ఎంత పకడ్బందీగా పాటించినా వాటిలో మిల్లీసెకన్ల (సెకనులో వెయ్యో వంతు) తేడా వచ్చేది. వైట్‌ రాబిట్‌ సాంకేతికత ఈ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తుంది. యూరప్‌ అణు పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు మొదటగా ఈ సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. 

ఇది ఆప్టికల్‌ ఫైబర్‌ సహాయంతో నడిచే ఒక అత్యంత కచ్చితమైన నెట్‌వర్క్‌ ప్రోటోకాల్‌. దీని ద్వారా అనుసంధానించిన గడియారాలు ఒక నానో సెకను (సెకనులో వంద కోట్ల వంతు) కంటే తక్కువ తేడాతో కచ్చితమైన సమయాన్ని చూపిస్తాయి. సాధారణంగా సమాచార ప్రసారంలో నెట్‌వర్క్‌ ఆలస్యం కావడం వల్ల సమయం మారే అవకాశం ఉంటుంది. కానీ వైట్‌ రాబిట్‌ సాంకేతికత ఆ ఆలస్యాన్ని ఎప్పటికప్పుడు స్వయంచాలకంగా సరిచేస్తూ అన్ని ప్రాంతాల్లోని పరికరాలు ఒకే అత్యున్నత కచ్చితమైన సమయంతో నడిచేలా చూస్తుంది.  

సమష్టి కృషితో సాధించిన విజయం.. 
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో నేషనల్‌ ఫిజికల్‌ ల్యా»ొరేటరీ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌), సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) వంటి అగ్రగామి సంస్థలు సమష్టిగా కృషి చేసి ఈ స్వదేశీ వ్యవస్థను అభివృద్ధి చేశాయి. బెంగళూరు ప్రయోగశాల నుండి చెన్నైలోని జాతీయ స్టాక్‌ ఎక్స్చేంజ్ కేంద్రానికి ఈ సురక్షిత కాల ప్రసారాన్ని విజయవంతంగా పరీక్షించారు. 

భారత్‌ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థగా వేగంగా విస్తరిస్తున్న తరుణంలో నమ్మకమైన ఇంటర్నెట్‌ ఎంత ముఖ్యమో సురక్షితమైన కాలపాలన అంతకంటే ముఖ్యం. అభివృద్ధి చెందిన భారతదేశ విజన్‌ దిశగా, డిజిటల్‌ మౌలిక సదుపాయాలలో స్వయం సమృద్ధిని సాధించడంలో ఈ ’వైట్‌ రాబిట్‌’ సాంకేతికత ఒక మైలురాయిగా నిలుస్తుంది. దేశంలోని అన్ని వ్యవస్థలు, కంప్యూటర్లు, ప్రభుత్వ రంగాలు ఒకే రకమైన కచ్చితమైన సమయాన్ని పాటించేలా చూసే అధికారిక విధానాన్నే కాలపాలన అంటారు. 

దేశీయ కాలమానానికి భద్రతా కవచం.. 
ప్రస్తుతం బ్యాంకింగ్, రక్షణ రంగాలు విదేశీ ఉపగ్రహ సంకేతాల ద్వారా సమయాన్ని పొందుతున్నాయి. వీటికి సైబర్‌ దాడులు జరగడం, సంకేతాలను తారుమారు చేయడం లేదా జామింగ్‌ వంటి ముప్పులు పొంచి ఉన్నాయి. ఒకవేళ ఈ విదేశీ వ్యవస్థలు నిలిచిపోతే మన దేశ డిజిటల్‌ వ్యవస్థ మొత్తం కుప్పకూలే ప్రమాదం ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఈ వైట్‌ రాబిట్‌ ఆధారిత భూతల నెట్‌వర్క్‌ రూపుదిద్దుకుంది. ఇది భారతదేశ అధికారిక కాల పరిశోధన ప్రయోగశాలల నుండి నేరుగా భారతీయ ప్రమాణ కాలాన్ని సురక్షితంగా సరఫరా చేస్తుంది. దీనివల్ల బాహ్య శక్తులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

కచ్చితమైన కాలముద్రలు..
సాధారణంగా ఒక డిజిటల్‌ నెట్‌వర్క్‌లో ఏదైనాఒక సంఘటన లేదా లావాదేవీ జరిగినప్పుడు అది జరిగిన రోజు, గంట, నిమిషం, సెకను, సెకనులో వంద కోటో వంతు (నానో సెకను) సమయాన్ని కూడా డిజిటల్‌గా రికార్డు చేయడాన్ని ’కచ్చితమైన కాలముద్ర’ అంటారు.  

లావాదేవీలకు ఆధారం: ఆన్‌లైన్‌లో ఎవరికైనా డబ్బులు పంపినప్పుడు, ఆ డబ్బు ఏ కచ్చితమైన సమయానికి ఖాతా నుండి కట్‌ అయింది, అవతలి వారికి చేరిందీ లేనిదీ ఈ కాలముద్ర ద్వారానే తెలుస్తుంది. ఒకవేళ లావాదేవీ విఫలమైతే సమస్యను పరిష్కరించడానికి ఇది ప్రధాన ఆధారంగా నిలుస్తుంది. 

సైబర్‌ మోసాల నిరోధం: ఒకే బ్యాంక్‌ ఖాతా లేదా క్రెడిట్‌ కార్డ్‌ ఉపయోగించి ఒకే నిమిషంలో రెండు వేర్వేరు నగరాల్లో లావాదేవీలు జరిగితే, కాలముద్రల సహాయంతో భద్రతా వ్యవస్థలు ఆ మోసాన్ని వెంటనే గుర్తించి ఖాతాను నిలిపివేస్తాయి. 

స్టాక్‌ మార్కెట్‌ వ్యాపారం: స్టాక్‌ మార్కెట్లో షేర్ల ధరలు వేగంతో మారిపోతుంటాయి. ఒక షేరును ఎవరు ముందు కొన్నారనేది మైక్రోసెకన్లు, నానోసెకన్ల కాలముద్రల ఆధారంగానే నిర్ణయిస్తారు. ఇది ట్రేడింగ్‌లో పారదర్శకతను పెంచుతుంది. 

డిజిటల్‌ రికార్డుల భద్రత: కంపెనీలు, ప్రభుత్వాలు, బ్యాంకులు తమ డిజిటల్‌ ఫైళ్లలో ఎవరు, ఎప్పుడు, ఏ మార్పులు చేశారో తెలుసుకోవడానికి ఈ కాలముద్రలు ఉపయోగపడతాయి. ఇది వ్యవస్థలో అవకతవకలు జరగకుండా చూస్తుంది. 

రక్షణ, కమ్యూనికేషన్‌ రంగాలు: ఉపగ్రహాలు, రక్షణ వ్యవస్థలు, మొబైల్‌ నెట్‌వర్క్‌లు (5జీ వంటివి) సరిగ్గా పనిచేయడానికి అన్ని పరికరాలు ఒకే కచ్చితమైన సమయాన్ని కలిగి ఉండాలి. చిన్న సమయ తేడా ఉన్నా సమాచార ప్రసారం నిలిచిపోయే ప్రమాదం ఉంది.

 – సాక్షి, హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement