హర్ముజ్‌ తర్వాత మరో షాక్‌.. హౌతీల సంచలన ప్రకటన | Houthi Blockade Threat: New War Front Opens in Gulf After Hormuz Crisis | Sakshi
Sakshi News home page

హర్ముజ్‌ తర్వాత మరో షాక్‌.. హౌతీల సంచలన ప్రకటన

Jul 21 2026 7:19 AM | Updated on Jul 21 2026 8:46 AM

Houthi Blockade Threat: New War Front Opens in Gulf After Hormuz Crisis

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్నాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఘర్షణ పదో రోజుకు చేరుకున్న వేళ.. యెమెన్‌కు చెందిన ఇరాన్‌ అనుకూల హౌతీ తిరుగుబాటుదారులు చేసిన సంచలన ప్రకటన ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. సౌదీ అరేబియాకు చెందిన వాణిజ్య, ఇంధన నౌకలపై నావికా దిగ్బంధం విధిస్తున్నట్లు హౌతీలు ప్రకటించారు. ఈ పరిణామంతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న గల్ఫ్‌ ప్రాంతంలో మరో కొత్త యుద్ధ ఫ్రంట్‌ తెరుచుకునే ప్రమాదం కనిపిస్తోంది.

సౌదీ నేతృత్వంలోని కూటమి యెమెన్‌పై విధించిన ఆంక్షలు, చర్యలకు ప్రతిస్పందనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హౌతీ సాయుధ విభాగం వెల్లడించింది. సౌదీకి వ్యతిరేకంగా ‘మారిటైమ్‌ ఎంబార్గో’ అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ ప్రకటనతో ప్రపంచ ఇంధన సరఫరా మార్గాలపై మరోసారి తీవ్ర ఆందోళన మొదలైంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన బాబ్‌ ఎల్‌ మండెబ్‌ bab el mandeb జలసంధిపై ప్రభావం పడితే పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది.

ఇప్పటికే హర్ముజ్‌ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ రెండు కీలక సముద్ర మార్గాల్లో అంతరాయం ఏర్పడితే ప్రపంచ చమురు సరఫరాలో భారీ కోత వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

చమురు మార్కెట్లలో కలవరం
హౌతీల ప్రకటన వెలువడిన వెంటనే అంతర్జాతీయ చమురు మార్కెట్లు అప్రమత్తమయ్యాయి. అయితే దౌత్య చర్చలపై ఆశలు ఉండటంతో ధరలు కొంత మేర తగ్గాయి. అయినప్పటికీ.. గల్ఫ్‌ ప్రాంతంలో పరిస్థితులు అదుపు తప్పితే ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచ చమురు ఎగుమతుల్లో కీలక పాత్ర పోషించే సౌదీ అరేబియా రవాణా మార్గాలకు ముప్పు ఏర్పడితే దాని ప్రభావం కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉంది.

ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగింపు
మరోవైపు ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. పదో రోజు కూడా అమెరికా వైమానిక దాడులు జరిపినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ప్రకటించింది. ఇరాన్‌ సైనిక కమాండ్‌ కేంద్రాలు, క్షిపణి ప్రయోగ స్థావరాలు, డ్రోన్‌ కేంద్రాలు, నౌకా సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. తబ్రీజ్‌, చాబహార్‌, బందర్‌ అబ్బాస్‌, ఖెష్మ్‌ దీవి పరిసర ప్రాంతాల్లో అమెరికా దాడుల ప్రభావం కనిపించినట్లు సమాచారం.

ఇరాన్‌ మాత్రం అమెరికా దాడులకు ప్రతీకార చర్యలు కొనసాగిస్తామని ప్రకటిస్తోంది. ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ అమెరికా మిత్ర దేశాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది.

హర్ముజ్‌లో ట్యాంకర్లపై దాడులు
గల్ఫ్‌ ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిన హర్ముజ్‌ జలసంధిలో మరో కలకలం చోటుచేసుకుంది. రెండు చమురు ట్యాంకర్లు పేలిపోయినట్లు ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ ప్రకటించింది. సురక్షితం కాని మార్గంలో ప్రయాణించడంతో ఈ ఘటన జరిగిందని ఇరాన్‌ పేర్కొంది.

అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలను స్వతంత్ర సంస్థలు ధ్రువీకరించలేదు. మరోవైపు ఒమన్‌ తీరంలో ఓ వాణిజ్య నౌకపై గుర్తుతెలియని ఆయుధంతో దాడి జరిగినట్లు బ్రిటన్‌కు చెందిన సముద్ర భద్రతా సంస్థ వెల్లడించింది.

దౌత్య ప్రయత్నాలు.. కానీ తగ్గని ఉద్రిక్తతలు
యుద్ధ వాతావరణం కొనసాగుతున్నప్పటికీ మరోవైపు దౌత్య ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇరాన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎస్కందర్‌ మొమెని పాకిస్థాన్‌కు చేరుకుని చర్చలు ప్రారంభించారు. గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నాలు చేస్తోంది.

అయితే అమెరికా మాత్రం ప్రస్తుతం దౌత్యం కంటే సైనిక చర్యలకే ప్రాధాన్యం ఇస్తోంది. ఇరాన్‌ దాడుల్లో మరణించిన అమెరికా సైనికులకు ప్రతీకారం తీర్చుకుంటామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు.

గల్ఫ్‌ దేశాల్లో భయం
ఇరాన్‌-అమెరికా ఘర్షణ ప్రభావం గల్ఫ్‌ దేశాలపై కూడా పడుతోంది. కువైట్‌, బహ్రెయిన్‌, ఖతార్‌ వంటి దేశాలు అప్రమత్తమయ్యాయి. తమపై జరిగిన దాడులపై ఖతార్‌ ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. నష్టపరిహారం కోరుతూ చర్యలు తీసుకుంటోంది.

ఇప్పటికే హర్ముజ్‌ జలసంధి.. ఇప్పుడు బాబ్‌ ఎల్‌ మండెబ్‌ మార్గంపై కూడా ముప్పు ఏర్పడటంతో ప్రపంచ దేశాల దృష్టి మొత్తం మధ్యప్రాచ్యంపై పడింది. అమెరికా-ఇరాన్‌ మధ్య ఘర్షణ మరింత విస్తరిస్తే.. అది కేవలం ప్రాంతీయ యుద్ధంగానే కాకుండా ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement