టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో శాంతి చర్చలు జరుపుతున్న సమయంలో ఇరాన్ ప్రతినిధులు తీవ్ర ప్రమాద పరిస్థితుల్లో పనిచేశారని ఆయన వెల్లడించారు. మేము ఎప్పుడు చనిపోతామో.. మాపై బాంబులు ఎప్పుడు వేస్తారోననే భయంతో వణికిపోయినట్టు చెప్పుకొచ్చారు.
ఇరాన్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరాఘ్చి మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్య ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్‌తో జరిగిన సంభాషణను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన.. ‘చర్చలు జరుగుతున్న సమయంలో ఏ క్షణంలోనైనా సమావేశంపై బాంబు దాడి జరగొచ్చనే భయం ఉండేది. కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇది చివరి సంభాషణ కావచ్చేమో అన్న ఆలోచన వచ్చేది’ అని తెలిపారు.
అనంతరం.. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి వస్తున్న ఒత్తిళ్లకు ఇరాన్ తలొగ్గలేదని ఆయన స్పష్టం చేశారు. అణు కార్యక్రమంలో యురేనియం ఎన్‌రిచ్‌మెంట్‌ను పూర్తిగా నిలిపివేయాలన్న డిమాండ్‌ను అంగీకరించలేదని, తమ హక్కుల విషయంలో వెనక్కి తగ్గబోమని పేర్కొన్నారు. ‘చర్చలు జరపాలి.. బెదిరింపులు లేదా ప్రలోభాలతో మమ్మల్ని మార్చలేరు’ అని అరాఘ్చి వ్యాఖ్యానించారు. చర్చల ద్వారా తమ లక్ష్యాలను సాధించలేమని భావించిన తర్వాతే అమెరికా యుద్ధ మార్గాన్ని ఎంచుకుందని ఆయన ఆరోపించారు. అమెరికా సైనిక ఒత్తిడితో ఇరాన్‌ను లొంగదీయవచ్చన్న వాదనలను కూడా అరాఘ్చి ఖండించారు. ‘ఇరాన్ వెనిజులా కాదు. ఒక నాయకుడిని తొలగిస్తే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోదు. ఇరాన్‌లో అధికార వ్యవస్థ అనేక స్థాయిల్లో పనిచేస్తుంది’ అని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా, అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్‌పై వరుసగా తొమ్మిదో రోజు వైమానిక దాడులు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులకు ఉపయోగిస్తున్న ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే తమ లక్ష్యమని అమెరికా తెలిపింది. మరోవైపు ఇరాన్ మీడియా ప్రకారం.. తబ్రిజ్, చాబహార్, కొనారక్, బందర్ మహ్‌షహర్ తదితర ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్లు సమాచారం వెలువడింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కూడా సిరియాలోని అల్-తన్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా ప్రత్యేక ఆపరేషన్స్ కేంద్రంపై దాడి చేసినట్లు ప్రకటించింది.


