మార్కెట్‌ తడబడ్డా... ఐపీఓలు అదుర్స్‌ | India IPO Market Heats Up Again | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ తడబడ్డా... ఐపీఓలు అదుర్స్‌

Jul 20 2026 4:22 AM | Updated on Jul 20 2026 4:22 AM

India IPO Market Heats Up Again

మార్చి తరువాత వచ్చిన ఆరింట్లో ఐదు పాస్‌

మూడు నెలల్లోనే 40 శాతానికి పైగా లాభాలిచ్చిన 3 కంపెనీలు

వాటిలో హెక్సగాన్, సాయి పేరెంటరల్స్‌ రెండూ ఫార్మావే  

ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా–ఇజ్రాయెల్‌ కలిసి ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులు మొదలుపెట్టేంత వరకూ భారత మార్కెట్లు బాగానే ఉన్నాయి. పైపెచ్చు జీవితకాల గరిష్ట స్థాయిలకు అటూఇటుగా ఉన్నాయి. బుల్‌ మార్కెట్‌ మంచి జోరుమీద ఉండటంతో అప్పటిదాకా వచ్చిన ఐపీఓలకు ఏకంగా 100 రెట్లు, 200 రెట్లు స్థాయిలో స్పందన వచ్చింది. రిటైల్‌ విభాగంలో అయితే ఏ ఐపీఓకైనా 100 రెట్లకు తక్కువ స్పందన రాలేదంటే అతిశయోక్తి కాదు. 

వాస్తవానికి అలాంటి స్పందన వచ్చిన ఐపీఓలు కూడా కొన్ని పేలవంగా లిస్టయి ఇన్వెస్టర్లకు నష్టాలు మిగిల్చాయి. కాకపోతే ఇరాన్‌పై దాడులు మొదలయ్యాక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మార్కెట్లు కిందపడ్డాయి. కంపెనీలు ఐపీఓలకు రావటానికే ఇష్టపడలేదు. కొన్ని కంపెనీలు అప్పటికే ప్రక్రియ మొత్తం పూర్తిచేసుకుని ఉండటంతో పబ్లిక్‌ ఇష్యూకు రాక తప్పలేదు. కాకపోతే వాటికి రిటైలర్ల నుంచి వచ్చిన స్పందన నామమాత్రమే.

 రిటైల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా పూర్తిగా సబ్ర్‌స్కయిబ్‌ కూడా కాలేదంటే పరిస్థితి ఎలా మారిపోయిందో తెలుసుకోవచ్చు. విచిత్రమేంటో తెలుసా? అప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చిన 6 ఐపీఓల్లో ఒక్కటి తప్ప మిగిలినవన్నీ లాభాలే ఇచ్చాయి. కొన్నయితే ఈ నాలుగు నెలల్లోనే 40–50 శాతానికి పైగా పెరిగాయి. 

వీటిలో కొన్ని షేర్లయితే లిస్టింగ్‌ నాడు పెద్దగా లాభాలివ్వకపోయినా... ఆ తరవాత క్రమంగా పెరుగుతూ చక్కటి లాభాలిచ్చాయి. దీనర్థం ఒక్కటే... సబ్ స్క్రిప్షన్  తక్కువయినంత మాత్రాన, లిస్టింగ్‌ లాభాలు రానంత మాత్రాన ఆ షేర్లు రాణించవని కాదు. మెల్లగా ముందుకెళుతూ అద్భుతమైన రాబడినిస్తాయనేది ఈ షేర్లు చెబుతున్న వాస్తవం. 

ఆ వివరాలే ఈ ‘సాక్షి వెల్త్‌’ స్టోరీ...
ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతలు, వడ్డీ రేట్లపై సందేహాలు... ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ఈ ఏడాది ‘మెయిన్‌ బోర్డు’ ఐపీఓ మార్కెట్‌ అద్భుతమైన నిలకడ చూపించింది. మార్చి–2026 తరువాత మార్కెట్లోకి వచ్చిన ఆరు ప్రధాన ఐపీఓల్లో ఐదు ఇప్పటికీ ఇష్యూ ధర కంటే ఎగువన ట్రేడవుతుండగా... ఒక్క అమీర్‌ చంద్‌ జగదీశ్‌ కుమార్‌ ఎక్స్‌పోర్ట్స్‌’ మాత్రమే ఇష్యూ ధర కంటే దిగువన 
కొనసాగుతోంది.

ఈ మూడూ... 40 శాతానికిపైనే 
ఇప్పటివరకు అత్యధిక రాబడినిచ్చిన ఐపీఓగా హెక్సగాన్‌ న్యూట్రిషన్‌ నిలిచింది. ఇష్యూ ధరతో పోలిస్తే దాదాపు 55 శాతం లాభాన్ని అందించింది. ఆ తర్వాత పవరికా (44 శాతం), సాయి పేరెంటరల్స్‌ (42 శాతం) టాప్‌–2, 3, స్థానాల్లో నిలిచాయి. ఏప్రిల్‌ తరువాత లిస్టయి ఈ మూడు షేర్లూ మూడు 40 శాతానికి పైగా లాభాలివ్వటం గమనార్హం. వీటిలో సాయి పేరెంటరల్స్‌ హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ కావటం విశేషం. 

లిస్టయిన తరువాత కంపెనీ వెలువరించిన 2025 క్యూ4 ఫలితాలు అంచనాలకు మించి ఉండటంతో ఒకస్థాయిలో షేరు ధర రూ.600 కూడా దాటింది. అత్యధిక లాభాలు అందించిన హెక్సగాన్‌ కూడా ఫార్మా కంపెనీయే కాగా... పవరికా మొదట్లో తడబడినా ఆ తరువాత డేటాసెంటర్ల బూమ్‌తో ఒక్క నెలలోనే 50 శాతానికిపైగా పెరగటం గమనార్హం. ఒబెరాయ్‌ల కుటుంబానికి చెందిన ఈ కంపెనీ పవన విద్యుదుత్పత్తితో పాటు డేటా సెంటర్లకు భారీ స్థాయి జనరేటర్లను సమకూర్చే వ్యాపారంలో ఉంది.  

సబ్ స్క్రిప్షన్  ఎక్కువైతే... లాభాలూ ఎక్కువేనా?
ఈ ఐపీఓలు మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాయి. పవరికాకు కేవలం 1.45 రెట్లు మాత్రమే సబ్ స్క్రిప్షన్  లభించింది. అయినప్పటికీ అది 44 శాతం రాబడితో అగ్రగాముల్లో ఒకటిగా నిలిచింది. మరోవైపు నాక్‌ ప్యాకేజింగ్‌కు 87 రెట్లు, హెక్సాగాన్‌కు 54 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ వచ్చింది. కాకపోతే వీటి రాబడులు మాత్రం ఒకేలా లేవు. అమీర్‌ చంద్‌ జగదీశ్‌కుమార్‌ ఎక్స్‌పోర్ట్స్‌’కు పవరికా కంటే ఎక్కువ సబ్‌స్క్రిప్షన్‌ వచ్చినా ఇప్పటికీ ఇష్యూ ధర కంటే దిగువనే ట్రేడవుతోంది. అంటే సబ్ స్క్రిప్షన్  సంఖ్య మాత్రమే షేర్ల రాబడులను నిర్ణయించదని ఈ ఐపీఓలు స్పష్టం చేశాయి.

ఈ ఐపీఓలు చెప్పిన పాఠాలివీ..
→ లిస్టింగ్‌ రోజున వచ్చే హైప్‌ శాశ్వతం కాదు.  
→ భారీ సబ్ స్క్రిప్షన్  అంటే భారీ లాభాలు అన్న గ్యారంటీ లేదు.  
→ చివరికి కంపెనీ వ్యాపార నాణ్యత, వృద్ధి, మార్కెట్‌ నమ్మకమే పెట్టుబడిదారుల సంపదను నిర్ణయిస్తాయి.  



మంథా రమణమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement