అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం రద్దు కావడంతో పశ్చిమాసియాలో మళ్లీ పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. జోర్డాన్‌లో శుక్రవారం ఇరాన్ జరిపిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ల దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మరణించారు. ఈ విషయాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికారికంగా ధ్రువీకరించింది.
మరో సైనికుడు ప్రస్తుతం గల్లంతైనట్లు సెంట్రల్ కమాండ్ తెలిపింది. దీంతో ఈ యుద్దంలో ఇప్పటివరకు మరణించిన అమెరికా సైనికుల సంఖ్య 16కు చేరింది. అంతేకాకుండా 430 మందికి పైగా గాయపడ్డారు. కాగా ఇరాన్ తాజా దాడుల్లో గాయపడిన నలుగురు అమెరికా సైనికులను జోర్డాన్‌లోని ఆసుపత్రికి తరలిచారు. వారు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు.
ఇరాన్ సుప్రీం లీడర్ హెచ్చరిక..
మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌పై దాడులను ఇలాగే కొనసాగిస్తే అమెరికాకు తగిన గుణపాఠం చెబుతామని ఎక్స్ వేదికగా ఖమేనీ పేర్కొన్నారు. కాగా ఇరాన్‌పై అమెరికా తమ దాడులను కొనసాగిస్తోంది.
శనివారం తెల్లవారుజామున అమెరికా సైన్యం ఇరాన్‌లోని నిఘా కేంద్రాలు, సైనిక లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, ఆయుధ నిల్వలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఇది వరుసగా ఏడో రోజు కావడం గమనార్హం. దీనికి ప్రతికారంగా ఇరాన్.. వైట్, ఇరాక్, బహ్రెయిన్, జోర్డాన్, సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఎటాక్ చేస్తోంది.


