తెల్లని శాలువా కప్పుకున్న వృద్ధురాలు తమ దగ్గరకు వచ్చిందని, ఆమె మనిషి కాదని ఓ డాక్టర్ చెప్పారు. ఆయన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పాకిస్థాన్‌లోని ఓ ఆసుపత్రిలో తనకు ఎదురైన భయానక ఘటనను ఆ డాక్టర్ వివరించారు. ఆ ఘటన తనతో పాటు సిబ్బందినీ వణికించిందని తెలిపారు. అర్ధరాత్రి సమయంలో ఓ వృద్ధురాలు నర్సులతో కలిసి ఉన్న తన దగ్గరకు వచ్చిందని చెప్పారు. తనకు ఇటీవలే పుట్టిన మనవడిని పరీక్షించాలని ఆమె కోరినట్టు వివరించారు.
తన మనవడికి జ్వరం వచ్చిందని వృద్ధురాలు చెప్పడంతో డాక్టర్ వెంటనే ఆ గదికి వెళ్లాడు. శిశువును పరీక్షించగా, అప్పటికే అతడు శ్వాస తీసుకోవడం ఆపేశాడని గుర్తించారు. వెంటనే చికిత్స అందించడంతో ఆ చిన్నారి గుండె స్పందన మళ్లీ వచ్చిందని తెలిపారు.
ఆ ఘటన తర్వాత చిన్నారి తల్లిదండ్రులను డాక్టర్ పిలిచి, వారి బిడ్డ ప్రాణాలు కాపాడేలా చికిత్స కోసం తీసుకువచ్చిన అమ్మమ్మకు కృతజ్ఞతలు చెప్పాలని డాక్టర్ కోరారు. అప్పుడు ఆ అమ్మమ్మ ఎన్నో ఏళ్ల క్రితమే చనిపోయిందని వారు చెప్పడంతో డాక్టర్, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స‍్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఆసుపత్రుల్లో సాధారణమేనని చాలామంది అన్నారు. మరికొందరు తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను పంచుకున్నారు.
"ఒంటరిగానే స్వర్గానికి ప్రయాణం పూర్తి చేయాలని అమ్మమ్మకి తెలుసు. తన కుటుంబంలో ఇంకెవరూ తనతో రావద్దని ఆమె అనుకుంది. అందుకే ఆ శిశువును కాపాడింది" అని ఓ యూజర్ పేర్కొన్నారు.
"32 ఏళ్లుగా నర్సుగా పని చేస్తున్నాను. నేను చెప్పగలిగే ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. ఆత్మలు నిజంగానే ఉంటాయి. ఆసుపత్రులు అలాంటి అనుభవాలతో నిండి ఉంటాయి" అని మరో వ్యక్తి రాశారు.
ఆ డాక్టర్ అన్నీ అసత్యాలు చెబుతున్నారని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు.


