రష్యాలో శనివారం తెల్లవారుజామున ఉక్రెయిన్ చేపట్టిన డ్రోన్ దాడుల్లో ఏడుగురు మృతిచెందారు. మరో 51 మంది గాయపడ్డారు. గోదాములు, చమురు నిల్వ కేంద్రం, ఓ నివాస భవనంపై ఈ దాడులు జరిగాయి. పలు ప్రాంతాల్లో వందల సంఖ్యలో డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుందని రష్యా అధికారులు తెలిపారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. మాస్కో, టాంబోవ్ ప్రాంతాల్లోని రెండు కీలక లాజిస్టిక్ కేంద్రాలపై దాడులు చేపట్టినట్టు తెలిపారు. "డ్రోన్లు, నావిగేషన్ పరికరాల తయారీకి ఆంక్షలు ఎదుర్కొంటున్న విడిభాగాలను సరఫరా చేసేందుకు ఈ కేంద్రాలను ఉపయోగిస్తున్నారు. ఓ చమురు కేంద్రంపై కూడా దాడి చేశాం" అని టెలిగ్రామ్‌లో పేర్కొన్నారు. అజోవ్ సముద్రం, రష్యా ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రత్యేక ఆపరేషన్ దళాలు లక్ష్యాలపై దాడులు చేశాయని చెప్పారు.
రష్యా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రష్యాలో అతిపెద్ద ఆన్‌లైన్ రిటైల్ సంస్థ వైల్డ్‌బెరీస్‌కు చెందిన రెండు భారీ గోదాములపై గత రాత్రి దాడులు జరిగాయి. వైల్డ్‌బెరీస్ అంటే రష్యాలో ప్రముఖ ఆన్‌లైన్ వస్తువుల విక్రయ సంస్థ. ఒకటి ఉక్రెయిన్ సరిహద్దు నుంచి దాదాపు 360 కిలోమీటర్ల దూరంలో ఉన్న టాంబోవ్ ప్రాంతంలోని కోటోవ్‌స్క్‌లో ఉంది. ఇంకొకటి మాస్కోకు తూర్పున దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలెక్ట్రోస్టాల్‌లో ఉంది.
మృతులంతా విధుల్లో ఉన్న కార్మికులే..
టాంబోవ్ ప్రాంత గవర్నర్ యెవ్గెనీ పెర్విషోవ్ మాట్లాడుతూ.. కోటోవ్‌స్క్ గోదాంలో రాత్రి విధుల్లో ఉన్న ఏడుగురు కార్మికులు మరణించారని, మరో 25 మంది గాయపడ్డారని తెలిపారు. మాస్కో ప్రాంత గవర్నర్ ఆండ్రే వొరోబ్యోవ్ మాట్లాడుతూ.. ఎలెక్ట్రోస్టాల్‌లో 24 మంది గాయపడ్డారని చెప్పారు. ఎలెక్ట్రోస్టాల్‌కు ఉత్తరాన ఉన్న నొగిన్‌స్క్‌లో ఉక్రెయిన్ డ్రోన్ దాడి తర్వాత చమురు నిల్వ కేంద్రానికి మంటలు అంటుకున్నాయని, అక్కడ మరో ఇద్దరు గాయపడ్డారని తెలిపారు. ముందు జాగ్రత్తగా సమీపంలోని ప్రసూతి ఆసుపత్రి, ఓ నివాస భవనాన్ని ఖాళీ చేయించారు.
మాస్కోకు తూర్పున దాదాపు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్లాదిమిర్‌లో ఉక్రెయిన్ డ్రోన్ ఓ నివాస భవనాన్ని ఢీకొనడంతో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుందని గవర్నర్ అలెగ్జాండర్ అవ్దేయేవ్ తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదని చెప్పారు.
రష్యా రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. 19 రష్యా ప్రాంతాలు, క్రిమియా, అజోవ్ సముద్రం, నల్ల సముద్రం ప్రాంతాలపై వచ్చిన 379 ఉక్రెయిన్ డ్రోన్లను రాత్రి సమయంలో వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుంది.
రాత్రి జరిగిన ఈ దాడుల్లో టాంబోవ్, మాస్కో ప్రాంతాల్లో ప్రాణనష్టం చోటుచేసుకుంది. గోదాములు, చమురు నిల్వ కేంద్రం వంటి కీలక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వ్లాదిమిర్‌లోని ఓ నివాస భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. రష్యా సైనిక సరఫరాలకు అనుబంధంగా ఉన్న కేంద్రాలనే లక్ష్యంగా చేసుకున్నామని ఉక్రెయిన్ తెలిపింది. ఉక్రెయిన్ పెద్ద ఎత్తున దాడులు చేయడంతో నెక్ట్స్ రష్యా ఏం చేస్తుందోనన్న ఆందోళన నెలకొంది.


