శ్రీనగర్: జమ్ముకశ్మీర్ ఆరోగ్య శాఖలో ఊహించని పరిణామం తీవ్ర కలకలం రేపింది. అధికారిక కార్యక్రమానికి సంబంధించిన ఒక కరపత్రంలో పొరుగు దేశానికి సంబంధించిన నినాదం కనిపించడం అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక అనధికారిక పోలియో నినాద పత్రంపై జమ్ముకశ్మీర్ ఆరోగ్య శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ‘పోలియో ఫ్రీ పాకిస్తాన్’ అనే నినాదంతో కూడిన ఈ వివాదాస్పద కరపత్రం ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించడంతో, ఉన్నతాధికారులు దీనిని తీవ్రంగా పరిగణించి అత్యవసర విచారణకు ఆదేశించారు.
రాజౌరి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్-2026కు సంబంధించిన ఒక ప్రకటన సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా షేర్ అవ్వడాన్ని గుర్తించారు. ఈ కరపత్రం బ్లాక్ మెడికల్ ఆఫీసర్ (బీఎంఓ) కార్యాలయం ద్వారా అధికారికంగా ప్రచురించినట్లు ఉంది. దీనిపై తీవ్రంగా స్పందించిన రాజౌరి సీఎమ్‌ఓ, సదరు బ్లాక్ మెడికల్ ఆఫీసర్‌కు తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ షోకాజ్ నోటీసు జారీ చేశారు. కేవలం 24 గంటల వ్యవధిలో దీనిపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
ఈ కరపత్రాన్ని పరిశీలించిన అధికారులకు అందులో నేషనల్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ లోగోతో పాటు ‘పోలియో ఫ్రీ పాకిస్తాన్’ అనే టెక్స్ట్ కనిపించింది. ఈ లోగో లేదా నినాదానికి జమ్ముకశ్మీర్ ఆరోగ్య సంరక్షణ, వైద్య విద్యా విభాగంతో కానీ, లేదా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కానీ ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ పత్రంలో సదరు బ్లాక్ మెడికల్ ఆఫీసర్ పేరు, అధికారిక హోదా స్పష్టంగా ముద్రించి ఉండటం గమనార్హం.
ఇది కూడా చదవండి: ముంబై ఘటన: జింక్ ఫాస్ఫైడ్ అంత ప్రమాదకరమా?


