ప్రతికూల వాతావరణ సూచన దృష్ట్యా ఈ నెల 19వ తేదీ నుంచి అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు శనివారం ప్రకటించారు. జూలై 19 నుండి జూలై 23 వరకు ప్రాంతంలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాశ్మీర్ డివిజనల్ కమిషనర్ అన్షుల్ గార్గ్ తెలిపారు.
పహల్గాం, బల్తాల్ మార్గాల ద్వా రా సాగే అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆదివారం నుంచి బల్తాల్, నున్వాన్/చందన్‌వారీ బేస్ క్యాంపుల నుంచి యాత్రికులు ముందుకు వెళ్లడానికి అనుమతించబోమన్నారు.
అదేవిధంగా జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి బేస్ క్యాంపులకు వెళ్లే ఎలాంటి అమర్‌నాథ్ యాత్రికుల కాన్వాయ్‌లను అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ పుణ్యయాత్రలో ఇప్పటివరకు 3.76 లక్షలకు పైగా భక్తులు అమర్‌నాథ్ మంచు లింగాన్ని దర్శించుకున్నారు. మొత్తంగా ఈ యాత్ర 57 రోజుల పాటు సాగనుంది. మరోవైపు ఈ హెచ్చరికల నేపథ్యంలో వైష్ణోదేవి యాత్రను కూడా అధికారులు నిలిపివేశారు.


