బాలుడి తలనరికిన ముగ్గురు బాలురు  | Three minors detained for murder of 10-year-old friend in rajstan jaipur | Sakshi
Sakshi News home page

బాలుడి తలనరికిన ముగ్గురు బాలురు 

Jun 29 2026 5:21 AM | Updated on Jun 29 2026 5:21 AM

Three minors detained for murder of 10-year-old friend in rajstan jaipur

జైపూర్‌: తన సోదరిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని కక్ష గట్టాడు. మరో ఇద్దరితో కలిసి అతడిని చంపేందుకు ప్లాన్‌ వేశాడు. అంతా కలిసి అతడిని నమ్మించి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. గొంతు పిసికి చంపేశారు. అంతటితో ఆగక, కత్తితో తల నరికారు..! రాజస్తాన్‌ రాజధాని జైపూర్‌లో ఈ దారుణం వెలుగు చూసింది. అయితే, వీరంతా యువకులు కాదు.. నేరగాళ్లు అంతకంటే కాదు..! హతుడు, హత్యకు పాల్పడిన వారంతా 12 ఏళ్ల లోపు బాలలు కావడం మరింత విషాదం.

 చిన్న వయస్సులోనే నేర ప్రవృత్తి నేడు ఏ స్థాయిలో పెరిగిపోతోందో చెప్పే తాజా ఉదంతమిది..! జైపూర్‌కు చెందిన 10 ఏళ్ల బాలుడు ఈ నెల 14వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. ముహానా ప్రాంత పోలీసులు నీళ్ల ట్యాంక్‌ పక్కనున్న మురుగు కాల్వలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. కొద్ది దూరంలో నరికివేసిన అతడి తల కనిపించింది. దర్యాప్తులో పోలీసులు నివ్వెరపోయే విషయాలు వెలుగు చూశాయి. 

అదే ప్రాంతానికే చెందిన మరో బాలుడి సోదరి గురించి తప్పుగా మాట్లాడటమే ఈ దారుణానికి కారణంగా తేలిందని డీసీపీ రాజర్షి రాజ్‌ చెప్పారు. ‘ఈ విషయంలో ఇద్దరూ కొట్లాడుకున్నారు. అనంతరం, ప్లాన్‌ ప్రకారం మరో ఇద్దరితో కలిసి అతడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, ఉరి వేసి చంపారు. ఆపై కత్తితో తల నరికారు. ఏమీ తెలియనట్లు వెళ్లిపోయారు’అని ఆయన చెప్పారు. నిందితులంతా ఒకే ప్రాంతంలో ఉండే 11, 12 ఏళ్ల బాలలేనన్నారు. ముగ్గురినీ నిర్బంధంలోకి తీసుకుని, జువెనైల్‌ చట్టం ప్రకారం చర్యలు ప్రారంభించినట్లు డీసీపీ వివరించారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement