చిన్నదని వదిలేస్తే... పెద్ద సమస్య కావచ్చు! | Signs And Symptoms Of Certain Sleep Related Issues In Children, When Parents Should Be Concerned | Sakshi
Sakshi News home page

చిన్నదని వదిలేస్తే... పెద్ద సమస్య కావచ్చు!

Jul 19 2026 8:21 AM | Updated on Jul 19 2026 12:20 PM

Signs And Symptoms Of Certain Sleep Related Issues In Children

సందేహం

మా ఐదేళ్ల బాబు రాత్రంతా నోరు తెరిచే నిద్రపోతాడు. గురక కూడా బాగా పెడుతున్నాడు. చిన్నపిల్లలకు ఇది సహజమే అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆందోళనగా ఉంది. – కీర్తి, నంద్యాల

పిల్లల్లో తరచు గురక పెట్టడం, నోరు తెరిచి నిద్రపోవడం సాధారణం కాదు. ఇవి శ్వాస మార్గంలో ఉన్న సమస్యకు సంకేతాలు కావచ్చు.
ఈ సమస్య ఎందుకు వస్తుంది?
సాధారణంగా మనం ముక్కు ద్వారానే శ్వాస తీసుకుంటాం. ముక్కు గాలిని శుభ్రపరచి, తేమను కలిపి, సరైన ఉష్ణోగ్రతకు మార్చి ఊపిరితిత్తులకు పంపుతుంది. కానీ ముక్కు మూసుకుపోయినప్పుడు పిల్లలు నోటి ద్వారా శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి.

1. అలర్జీ: దుమ్ము, ధూళి, పొగ, కాలుష్యం, డస్ట్‌మైట్స్‌ లేదా పెంపుడు జంతువుల వెంట్రుకల వల్ల ముక్కులో వాపు ఏర్పడి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.
2. అడినాయిడ్స్‌ పెరగడం: ముక్కు వెనుక భాగంలో ఉండే అడినాయిడ్స్‌ అనే కణజాలం చిన్నపిల్లల్లో ఇన్‌ ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. అయితే తరచు ఇన్‌ ఫెక్షన్లు లేదా అలర్జీల కారణంగా ఇవి పెద్దవై గాలి వెళ్లే మార్గాన్ని ఇరుకుగా చేస్తాయి. దీంతో పిల్లలు నోటి ద్వారానే శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. గాలి వెళ్లే మార్గం ఇరుకుగా మారినప్పుడు గాలి ప్రవాహం వల్ల కంపనం ఏర్పడి గురక వస్తుంది. అందువల్ల గురక అనేది కేవలం శబ్దం మాత్రమే కాదు, శ్వాసకు ఆటంకం ఏర్పడుతోందని శరీరం ఇస్తున్న హెచ్చరిక.

నిర్లక్ష్యం చేయకండి...
కొంతమంది పిల్లల్లో గురకతో పాటు నిద్రలో కొద్ది క్షణాలు శ్వాస కూడా ఆగిపోవచ్చు. దీనివల్ల మెదడుకు సరిపడా ఆక్సిజన్‌  అందక, దీర్ఘకాలంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదయం అలసటగా లేవడం, చదువుపై ఏకాగ్రత తగ్గడం, చిరాకు, అతి చురుకుదనం, ఎదుగుదల మందగించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఎప్పుడూ నోటి ద్వారానే శ్వాస తీసుకునే పిల్లల్లో దవడ, పళ్ల అమరిక, ముఖ ఆకృతిలో కూడా మార్పులు రావచ్చు.

ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?
మీ బిడ్డ గురకను లేదా నోరు తెరిచి నిద్రపోవడాన్ని కేవలం ఒక అలవాటుగా భావించకండి. ప్రతిరోజూ నోరు తెరిచి నిద్రపోవడం, వారానికి మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు గురక పెట్టడం, నిద్రలో శ్వాస ఆగినట్లు కనిపించడం, పగటిపూట ఎక్కువ నిద్రమత్తుగా ఉండడం, తరచూ చెవి ఇన్‌ ఫెక్షన్లు రావడం, ముక్కు ఎప్పుడూ మూసుకుపోవడం లేదా ఎప్పుడూ నోటి ద్వారానే శ్వాస తీసుకోవడం వంటి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా పిల్లల వైద్యుడిని లేదా ముక్కు–చెవి–గొంతు నిపుణుడిని సంప్రదించాలి. 

శస్త్రచికిత్స అవసరమా?
అసలు అవసరం లేదు. ఇది చాలా పెద్ద అపోహ. చాలామంది పిల్లల్లో అలర్జీని నియంత్రించడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది. అవసరాన్ని బట్టి సెలైన్‌  నాసల్‌ డ్రాప్స్, నాసల్‌ స్ప్రేలు, అలర్జీ మందులు సూచిస్తారు. అలాగే దుమ్ము, పొగ, సిగరెట్‌ పొగ వంటి వాటికి పిల్లలను దూరంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం. అయితే నిద్రలో శ్వాస ఆగిపోవడం, వినికిడి తగ్గడం, చెవిలో పదేపదే ద్రవం చేరడం లేదా మందులతో ప్రయోజనం లేకపోతే అడినాయిడ్స్‌ను తొలగించే శస్త్రచికిత్స అవసరం కావచ్చు.

తల్లిదండ్రులకు సూచనలు

  • గురకను చిన్న విషయంగా తీసుకోవద్దు.

  • నోటి ద్వారా శ్వాస తీసుకోవడం ఒక అలవాటు కాదు, అది ఒక లక్షణం.

  • తరచూ జలుబు లేదా ముక్కు మూసుకుపోవడం ఉంటే అలర్జీ ఉందేమో పరీక్ష చేయించండి.

  • పిల్లలకు ప్రశాంతమైన నిద్ర వాతావరణాన్ని కల్పించండి. నిద్రకు ముందు మొబైల్, ట్యాబ్‌ లేదా ఇతర స్క్రీన్‌ ల వినియోగాన్ని తగ్గించండి.

  • సమస్య కొనసాగితే పిల్లల వైద్యుడు లేదా ముక్కు–చెవి–గొంతు నిపుణుడిని ఆలస్యం చేయకుండా సంప్రదించండి.

  • పిల్లల నవ్వు, చదువు, ఎదుగుదల ఎంత ముఖ్యమో; వారి నిద్ర కూడా అంతే ముఖ్యం.

  • గురక అనేది నిద్రలో వచ్చే శబ్దం మాత్రమే కాదు, పిల్లల ఆరోగ్యం గురించి శరీరం పంపించే ఒక ముఖ్యమైన హెచ్చరిక.

  • సరైన సమయంలో కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే పిల్లల నిద్ర, ఎదుగుదల, ఏకాగ్రత, మొత్తం ఆరోగ్యం మెరుగుపడతాయి. మంచి నిద్రే ఆరోగ్యకరమైన ఎదుగుదలకు మొదటి మెట్టు.
    - డా. కె. పవన్‌ కుమార్‌, సీనియర్‌ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్‌ అలర్జిస్ట్, ప్రొఫెసర్‌ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement