ఏడాదిలో 70 వేల ఉద్యోగాలిచ్చాం | CM Revanth Reddy Fires On BRS | Sakshi
Sakshi News home page

ఏడాదిలో 70 వేల ఉద్యోగాలిచ్చాం

Jul 19 2026 1:50 AM | Updated on Jul 19 2026 1:50 AM

CM Revanth Reddy Fires On BRS

మీరు పదేళ్లలో నోటిఫికేషన్లు వేయడం తప్ప ఉద్యోగాలు భర్తీ చేయలేదు  

తెలంగాణ తులసి వనంలో గంజాయి మొక్క మొలకెత్తనివ్వం  

అందెశ్రీ పాటను వినిపించకుండా కుట్రలు చేశారు 

మీకు గతమే.. భవిష్యత్తు లేదు.. 

బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్‌ 

అందెశ్రీ తనకు ఆత్మబంధువని, తమ ప్రభుత్వం ఆయన స్ఫూర్తితో పనిచేస్తోందని వెల్లడి  

అందెశ్రీ స్మృతివనం భూమి పూజలో ముఖ్యమంత్రి

ఘట్‌కేసర్‌: తన పాట కోట్లాది తెలంగాణ ప్రజల కోసం తప్ప, గడీల దొరల కోసం కాదని ప్రత్యేక తెలంగాణ ఉద్యమ రథసార«థి, ప్రజా కవి డాక్టర్‌ అందెశ్రీ నిటారుగా నిలబడ్డారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. మనందరం దండు కట్టి విషసర్పాలను తుదముట్టించాలన్న ఆయన మాటలు గుర్తుకొస్తున్నాయన్నారు. గత పదేళ్ల పాలనలో ఆయన పాట వినిపించకుండా కుట్రలు చేశారని, పెన్నులపై మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయని రేవంత్‌ పేర్కొన్నారు. అందెశ్రీ 65 జయంతిని పురస్కరించుకొని మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ ఓఆర్‌ఆర్‌ వద్ద అందెశ్రీ స్మృతివనం పనులకు శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి రేవంత్‌ భూమి పూజ చేసి పునాది రాయి వేశారు.

అనంతరం జరిగిన సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘మేం నోటిఫికేషన్లు ఇచ్చినం, రేవంత్‌రెడ్డి భర్తీ చేశారని సిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. పేపర్‌ లీకేజీలతో వందల కోట్లు సంపాదించావు కానీ ఉద్యోగాల కోసం ఏనాడు ఆలోచించలేదు. మీరు నిరుద్యోగులను ఏనాడూ మానవీయ కోణంలో చూడలేదు. మేం అధికారంలోకి వచ్చాక అడ్డంకులు తొలగించి ఉద్యోగాలు భర్తీ చేశాం. పదేళ్లలో నోటిఫికేషన్లు వేయడం తప్ప ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదు. ఏడాదిలో మేం 79 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. ఎల్బీస్టేడియం, శిల్పాకళా వేదికగా తల్లితండ్రుల ముందు వారి బిడ్డలకు ఉద్యోగ నియామక పత్రాలు అందించి వారి కళ్లల్లో ఆనందం నింపాం’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.  

ప్రజలు ఆనాడే నిర్ణయించుకున్నారు... 
‘ఎప్పుడైతే అందెశ్రీ గళాన్ని బంధించాలనుకున్నారో, గద్దరన్నను అవమానించారో అనాడే గడీల పాలనకు శాశ్వతంగా పాతరేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. మేక తోలు కప్పుకున్న తోడేలు ఇవాళ మాట్లాడుతోంది. ఇవాళ తోడేళ్ల గుంపును ప్రశ్నిస్తున్నా.. ఆనాడు కవితను, వినోద్‌రావును ప్రజలు తిరస్కరిస్తే ఆద్యోగాలిచ్చినవు, తెలంగాణ బిడ్డల ఉద్యోగాల కోసం ఒక్కనాడైనా ఆలోచించావా. మీరు శ్రీమంతులు ఎలా అయ్యారు, తెలంగాణ ఎందుకు అప్పుల పాలైందో చెప్పండి. గజ్వేల్‌లో మిమ్మల్ని మా యువత రాజకీయ సమాధి చేస్తుంది’ అని రేవంత్‌ అన్నారు. ప్రజా ప్రభుత్వం ఎందుకు పోవాలి, మీ కుటుంబం దోచుకోవడానికా, కుటుంబ పదవుల కోసమా అని ప్రశ్నించారు. 2034 వరకు ప్రజా ప్రభుత్వమే ఉంటుందని, ఇదే భవిషత్తు, ఇదే చరిత్ర,. మీకు గతమే తప్ప భవిష్యత్తు లేదన్నారు.  

తెలంగాణ మీకు ఏం తక్కువే చేసింది... 
‘తెలంగాణ సమాజం మీకు ఏం తక్కువ చేసింది.. దుబాయ్‌ పాస్‌పోర్ట్‌ బ్రోకర్‌ను ముఖ్యమంత్రిని చేసింది. అమెరికాలో బాత్రూంలు కడిగినోడిని, రబ్బరు చెప్పులేసుకొని తిరిగి, సోడా పోసినోళ్లను మంత్రులను చేసింది. నేను ఉన్నంత కాలం తెలంగాణ తెలసి వనంలో గంజాయి మొక్కను మొలకెత్తనివ్వను. మాకు అందెశ్రీ, గద్దర్, సోనియా గాంధీ స్పూర్తి, మీకు నిజాం, ఖాసిం రిజ్వా స్ఫూర్తి. నీకు, మాకు పోలికేంటి. మీ దోపిడీని ప్రజలు ఇంకా మరిచిపోలేదు. తెలంగాణ సమాజం గమనిస్తోంది. నిజాంను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ గడ్డకు ఉంది. తెలంగాణ ప్రజల చైతన్యం ముందు మీరెంత. 

తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తెలంగాణను ఎవరూ చెరబట్టలేరని, చెరబట్టాలని చూస్తే అందెశ్రీ పాటగా తిరిగొస్తారన్నారు. తమ ప్రభుత్వం ఆయన స్ఫూర్తితో పని చేస్తోందన్నారు. నిరుద్యోగులు మాయగాళ్ల మాయలో పడొద్దని, తమ ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుందని చెప్పారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను, చాకలి ఐలమ్మ మనుమరాలిని మహిళా కమిషన్‌ సభ్యులుగా, ప్రొఫెసర్‌ కోదండారాంను ఎమ్మెల్సీగా నియమించామన్నారు. 9 మంది కవులను సన్మానించి కోటి రూపాయల నగదు బహుమతిచ్చి గౌరవించామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

కుటుంబపెద్దగా భావించా.. 
అందెశ్రీ ఆత్మగౌరంతో ఏనాడూ దొరల గడప తొక్కలేదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రతి బడి, గడపలో ఆయన పాట వినిపిస్తోందన్నారు. అందెశ్రీకి ప్రజా ప్రభుత్వం అపూర్వ గౌరవం ఇచ్చిందని రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘అందె శ్రీ నాకు ఆత్మబంధువు.., కుటుంబ పెద్దగా భావించాను. నిరాశ, నిస్పృలకు లోనైనప్పుడు, ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడడానికి ఆయనే స్ఫూర్తి. ఆయన పాటలు తూటాలై, మరఫిరంగులై గడీలను బద్ధలు కొట్టాయి. ఇటుకపై ఇటుక పేర్చినట్లు అక్షరాలపై అక్షరాలు పేర్చి ఉద్యమ గీతాలు రాసి ప్రజల్లో చైతన్యం నింపారు. ఆయన రాసిన జయజయహే తెలంగాణ గీతం రాష్ట్ర గీతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో చైతన్యం నింపింది’ అని సీఎం అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement