రణరంగం... | Tension in Bahadurguda Over Bullet Train Land Acquisition | Sakshi
Sakshi News home page

రణరంగం...

Jul 19 2026 1:42 AM | Updated on Jul 19 2026 1:42 AM

Tension in Bahadurguda Over Bullet Train Land Acquisition

పోలీసులపై కుర్చిలు విసురుతున్న రైతులు, (ఇన్‌సెట్‌లో) చేవెళ్ల డీసీపీ యోగేష్‌ గౌతమ్‌ కళ్లలో కారం పడటంతో సపర్యలు చేస్తున్న సిబ్బంది

బహదూర్‌గూడలో భూస్వాధీనం ఉద్రిక్తం

బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు కోసం 650 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాదీన క్రమంలో తీవ్ర ఉద్రిక్తత 

ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూముల్ని ఇవ్వబోమన్న కొందరు రైతులు 

పరిహారం ఇచ్చేదాకా స్వాదీన ప్రక్రియను అంగీకరించబోమన్న మరికొందరు 

ఖాళీ చేయించేందుకు వచ్చిన పోలీసులపై రాళ్లు రువ్వి, కారం చల్లిన మహిళా రైతులు 

పోలీసులతో వాగ్వాదం క్రమంలో గుండెపోటుతో కుప్పకూలిన ఓ రైతు.. ఆస్పత్రికి తరలింపు 

చివరకు 9 మంది మహిళా రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 

భారీ పోలీసు బందోబస్తు మధ్య భూముల చుట్టూ ఫెన్సింగ్‌ వేసిన హైడ్రా 

బాధిత రైతులకు గ్రామంలోనే 500 గజాల చొప్పున లేఅవుట్‌ వేస్తామన్న అధికారులు

సాక్షి, రంగారెడ్డి జిల్లా/శంషాబాద్‌: ప్రతిపాదిత హైదరాబాద్‌–అమరావతి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు కోసం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం బహదూర్‌గూడలో ఆక్రమణలకు గురైన 650 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనానికి అధికారులు శనివారం చేపట్టిన కసరత్తు రణరంగాన్ని తలపించింది. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములను ఇవ్వబోమని కొందరు.. తమకు నష్టపరిహారం ఇచ్చేదాకా భూముల స్వాదీనాన్ని అంగీకరించబోమంటూ మరికొందరు రైతులు తేల్చిచెప్పడం.. 9 రోజులుగా దీక్ష చేస్తున్న రైతులను అక్కడి నుంచి తరలించేందుకు వచ్చిన పోలీసులపై మహిళలు రాళ్లు రువ్వి, కళ్లలో కారంపొడి చల్లడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. 

బుల్లెట్‌ రైలుకు భూముల కేటాయింపుతో.. 
బహదూర్‌గూడలోని సర్వే నంబర్‌ 28, 62లలో ఉన్న 650 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వం ఇటీవల బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు కోసం కేటాయించింది. అయితే స్థానికంగా ఉన్న కొందరు రైతులు, రియల్టర్లు ఏళ్లుగా ఈ భూముల్లో కబ్జాలో ఉన్నారు. నష్టపరిహారం తేల్చకుండా, తమ భూములను ఇచ్చే ప్రసక్తే లేదని వారు తేల్చిచెప్పడంతో శనివారం తెల్లవారుజామున 1,300 మందికిపైగా రెవెన్యూ, హైడ్రా, పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకొని బహుదూర్‌గూడ, లక్ష్మీతండాలను నిర్భందించారు. ఆక్రమణలకు గురైన 650 ఎకరాలను స్వాదీనం చేసుకొని చుట్టూ ఫెన్సింగ్‌ చేపట్టారు. ఈ భూముల్లో వెలసిన కొన్ని అక్రమ కట్టడాలను కూల్చేశారు. కొన్ని ఫాంహౌస్‌లలో ఉన్న వారిని ఖాళీ చేయించారు. 

రైతులను వారు సాగు చేస్తున్న భూముల్లోకి వెళ్లనీయకుండా అన్ని దారులూ మూసేశారు. దీంతో కొందరు మహిళా రైతులు అక్కడికి చేరుకొని పరిహారం తేల్చకుండా ఏళ్లుగా తమ ఆదీనంలో ఉన్న భూములను ఎలా స్వాదీనం చేసుకుంటారని అధికారులను నిలదీశారు. ఇది ప్రభుత్వ భూమి అని అధికారులు స్పష్టం చేసినా వినిపించుకోకుండా ఆర్‌డీఓ శ్రీధర్‌తో వాగ్వాదానికి దిగారు. నక్ష ప్రకారం సర్వే నంబర్‌ ఒకటి నుంచి 101 వరకు ఉండాల్సిన భూములు.. కేవలం సర్వే నంబర్‌ 76 వరకు ఎందుకున్నాయని నిలదీశారు. ఈ క్రమంలో నర్సింహ అనే రైతు గుండెపోటుతో కుప్పకూలగా పోలీసులు వెంటనే సీపీఆర్‌ చేసి ఆ తర్వాత ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. 

సాయంత్రానికి నిరసన దీక్షలో ఉన్న మహిళా రైతులు, వారికి సంఘీభావం తెలిపేందుకు వచ్చి న బీజేపీ నేతలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించేందుకు యతి్నంచారు. ఈ పరిణామంతో రైతులు మరింత ఆగ్రహించారు. కొందరు మహిళా రైతులు పోలీసులపై రాళ్లు రువ్వి, కారం పొడి చల్లారు. దీంతో ఎస్సై వనజ, చేవెళ్ల డీసీపీ యోగేష్‌ గౌతం, శంషాబాద్‌ సీఐ నరేందర్‌ సహా మరికొందరి కళ్లలో కారం పడటంతో మంటకు అల్లాడిపోయారు. వారిని ఇతర పోలీసులు చికిత్స కోసం 108లో సమీప ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఏడుగురు మహిళా రైతులను అదుపులోకి తీసుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అర్ధరాత్రి కూడా ఫెన్సింగ్‌ పనులు కొనసాగిస్తున్నారు. ఆందోళనకారుల దీక్ష కూడా అలాగే కొనసాగుతోంది. 

భూములివ్వం.. 
చావనైనా చస్తాం.. భూములు మాత్రం ఇవ్వం. ఏళ్ల తరబడి భూమినే నమ్ముకొని బతుకుతున్నాం. సర్కారు మమ్మల్ని ముంచితే వాళ్లే మునిగిపోతారు. 
– లలిత, మహిళా రైతు బహదూర్‌గూడ  

పట్టాలివ్వకపోగా గుంజుకుంటారా? 
దశాబ్దాలుగా సాగు చేస్తున్నాం. అన్ని ప్రభుత్వాలకు పట్టాలు ఇవాలని మొరపెట్టుకున్నాం. ఇప్పుడేమో బుల్లెట్‌ రైలు కోసం భూములు గుంజుకుంటున్నరు. అధికారులు చెబుతున్నట్లు ఎకరం భూమికి 500 గజాలు ఇస్తే నష్టపోతాం. – కుమార్, రెండెకరాల రైతు బహదూర్‌గూడ 

మా ప్రశ్నలకు బదులేది? 
గ్రామ నక్ష ప్రకారం సర్వే నంబర్‌ 1 నుంచి 101 వరకు ఎందుకు స్పష్టం చేస్తలేరు. గతంలో ఉన్న రికార్డులు కాదని అధికారులు ఇప్పుడు వేరే చెబుతున్నరు. మేము పొలం చేసి బతికేటోళ్లం. భూమిని గుంజుకుంటే మా పరిస్థితి ఏమిటి? – రమేష్ , రైతు లక్ష్మీతండా  

రైతులకు న్యాయం చేస్తాం 
భూమి కోల్పోతున్న రైతులకు ఎకరానికి 500 గజాల చొప్పున హెచ్‌ఎండీఏ అనుమతితో కూడిన లేఅవుట్‌ను ఇక్కడే ఏర్పాటు చేసి ఇచ్చేందుకు ప్రతిపాదనలున్నాయి. 650 ఎకరాల్లో స్థానిక రైతులు కాకుండా బయటి వారికి 400 ఎకరాలు ఉన్నట్లు మాకు సమాచారం ఉంది. ముందుగా వాటిని స్వా«దీనం చేసుకుంటాం. ఇప్పటికిప్పుడే రైతుల పంటలకు నష్టం కలిగించం.  – శ్రీధర్, రాజేంద్రనగర్‌ ఆర్‌డీఓ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement