భారత్‌పై మొబైల్‌ మాల్‌వేర్‌ దాడులు | Mobile malware attacks on India | Sakshi
Sakshi News home page

భారత్‌పై మొబైల్‌ మాల్‌వేర్‌ దాడులు

Feb 1 2026 5:23 AM | Updated on Feb 1 2026 5:23 AM

Mobile malware attacks on India

బాధిత దేశాల్లో ముందంజలో మనదేశం 

యాప్‌ స్టోర్లలో హానికరమైన సాఫ్ట్‌వేర్‌ 

ఐటీ సెక్యూరిటీ సంస్థ జీస్కేలర్‌ వెల్లడి

ఇంటర్నెట్‌ వాడకం పెరిగే కొద్దీ మొబైల్‌ మాల్‌వేర్‌ దాడులు ప్రపంచవ్యాప్తంగా అధికం అవుతున్నాయి. సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కస్టమర్ల మొబైల్స్‌లోకి హానికరమైన సాఫ్ట్‌వేర్‌ (మాల్‌వేర్‌) ద్వారా చొరబడేందుకు కొత్త పంథాను అందిపుచ్చుకుంటున్నారు. మొబైల్‌ మాల్‌వేర్‌ దాడులకు గురైన దేశాల్లో మరోసారి భారత్‌ అగ్రశ్రేణి కేంద్రంగా అవతరించింది. 

డిజిటలైజేషన్‌ దిశగా దూసుకెళ్తున్న భారత మార్కెట్లో స్మార్ట్‌ఫోన్స్, ఇంటర్నెట్‌ ఆధారిత పరికరాలు, కీలకమైన మౌలిక సదుపాయాలను సైబర్‌ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారని అమెరికాకు చెందిన ఐటీ సెక్యూరిటీ సంస్థ జీస్కేలర్‌ చెబుతోంది. 

మొబైల్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, ఆపరేషనల్‌ టెక్నాలజీ విభాగాల్లో మాల్‌వేర్‌ దాడులపై కంపెనీ రూపొందించిన థ్రెట్‌ల్యాబ్జ్‌–2025 థ్రెట్‌ రిపోర్ట్‌ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా జరిగిన మొబైల్‌ మాల్‌వేర్‌ దాడుల్లో 26 శాతం వాటాతో భారత్‌ మొదటిస్థానంలో ఉంది.   – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

లక్ష్యం ఆర్థిక లాభం..
అంతర్జాతీయంగా సైబర్‌ నేరగాళ్లకు మన దేశం అతిపెద్ద లక్ష్యంగా మారింది. మొబైల్‌ యాప్స్, డిజిటల్‌ చెల్లింపులు, రోజువారీ జీవితంలో ఇంటర్నెట్‌తో కనెక్ట్‌ అయిన పరికరాల వినియోగం పెరగడం వల్ల భారత్‌లో మొబైల్‌ మాల్‌వేర్‌ అటాక్స్‌ ఏడాదిలో 38 శాతం అధికమయ్యాయి. మొబైల్‌ మాల్‌వేర్‌ దాడుల ప్రధాన లక్ష్యం పాస్‌వర్డ్స్, బ్యాంకింగ్‌ సమాచారాన్ని దొంగిలించడం. తద్వారా ఆర్థిక లాభం పొందడం. 

అలాగే కంపెనీల సేవలకు అంతరాయం కలిగించి డబ్బు డిమాండ్‌ చేయడం. బ్యాంక్‌ ఖాతా నిలిచిపోతుందనో, పాయింట్స్‌ రిడీమ్, ఆధార్‌ అప్‌డేట్, తరచూ వాడుతున్న యాప్‌ అప్‌డేట్‌ పేరుతో మొబైల్‌ యూజర్లను సైబర్‌ నేరస్తులు వలలో వేసుకుంటున్నారు.  

యాప్‌ స్టోర్లలోకి మాల్‌వేర్‌..
యాప్‌ స్టోర్లలోకి హానికరమైన యాప్స్‌ చొరబడుతుండటం ఆందోళన కలిగించే అంశం. గూగుల్‌ ప్లే స్టోర్‌లో 239 హానికర ఆండ్రాయిడ్‌ యాప్స్‌ను జీస్కేలర్‌ పరిశోధకులు గుర్తించారు. ఈ యాప్స్‌ ఇప్పటికే 4.2 కోట్లకుపైగా డౌన్‌లోడ్స్‌ నమోదయ్యాయి. ఈ యాప్స్‌లో చాలా వరకు ఉత్పాదకత మెరుగుపరిచే సాధనాలుగా తప్పుదోవ పట్టిస్తున్నాయి. 

ఆండ్రాయిడ్‌ మాల్‌వేర్‌ కార్యకలాపాలు 2024తో పోలిస్తే గత సంవత్సరంలో 67 శాతం పెరిగాయి. స్పైవేర్, బ్యాంకింగ్‌ మాల్‌వేర్‌ కీలక ముప్పుగా పరిణమించాయి. ఐఓటీ డివైస్‌ల విషయానికివస్తే రూటర్స్‌ 75% దాడులకు గురయ్యాయి. మొబైల్‌ మాల్‌వేర్‌ బాధిత టాప్‌–10 దేశాల్లో భారత్, యూఎస్, కెనడా, మెక్సికో, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, ఇజ్రాయిల్, యూకే, యూఏఈ, ఇటలీ ఉన్నాయి.  

టాప్‌–4లో భారత్‌..
భారత్‌లో రిటైల్, హోల్‌సేల్‌ వ్యాపారులు, సంస్థలను సైబర్‌ నేరగాళ్లు ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. మొత్తం మాల్‌వేర్‌ దాడుల్లో వీటి వాటా 38% ఉంది. హాస్పిటాలిటీ, రెస్టారెంట్స్‌ వాటా 31% ఉంది. తయారీ, ఇంధన సంబంధిత రంగాలను కూడా సైబర్‌ నేరగాళ్లు వదలడం లేదు. 

ఈ పరిశ్రమలు కనెక్టెడ్‌ వ్యవస్థలు, ఐఓటీ పరికరాలపై ఎక్కువగా ఆధారపడతాయి. అధిక నష్టాన్ని కలిగించాలని చూస్తున్న సైబర్‌ నేరగాళ్లకు ఇవి ఆకర్షణీయమైన లక్ష్యాలుగా మారాయి. మొత్తం ఐఓటీ మాల్‌వేర్‌ కార్యకలాపాల్లో 54% వాటాతో గ్లోబల్‌ హాట్‌స్పాట్‌గా అమెరికా నిలిచింది. 5 శాతం వాటాతో భారత్‌ నాల్గో స్థానంలో ఉంది.  

మొబైల్‌ చెల్లింపులపై..
మన దేశంలో బ్యాక్‌డోర్, బోట్‌నెట్‌–స్టైల్‌ మాల్‌వేర్‌ ఆధిపత్యం చెలాయిస్తోంది. 16 లక్షలపైచిలుకు ఆండ్రాయిడ్‌ టీవీ బాక్సుల్లోకి మాల్‌వేర్‌ చొచ్చుకుపోయిందని ఒకనివేదిక వెల్లడించింది. ఇందులో ప్రధాన బాధిత దేశంగా భారత్‌ ఉంది. చమురు, సహజవాయువు రంగంలో ఉద్యోగార్థులను లక్ష్యంగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు మాల్‌వేర్‌ దాడులు చేస్తున్నారని వివరించింది. అంతేగాక మొబైల్‌ చెల్లింపులపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement