17వ శతాబ్దంలో మొఘల్ రాణి నూర్జహాన్ వాడిన నగ అది. బ్రిటిష్ కాలంలో దేశం దాటిన ఆణిముత్యం 1972లో ఎలిజబెత్ టేలర్‌కు గిఫ్ట్ ఇచ్చిన రిచర్డ్ బర్టన్ ఇప్పుడు హాలీవుడ్ నటి మార్గోట్ రాబీ చేతిలో నూర్జహాన్ నగ హాలీవుడ్ నటి మార్గోట్ రాబీ తన చిత్రం వుథరింగ్ హైట్స్ ప్రమోషన్ లో బిజీబిజీగా గడిపారు.
ఈ క్రమంలో ఇటీవల ఆమె లాస్ ఏంజిల్స్‌లోని టీసీఎల్ చైనీస్ థియేటర్‌లో జరిగిన ప్రీమియమ్ షోలో తళుక్కున మెరిశారు. అందులో ఆమె ధరించిన 69.42 క్యారెట్ల నెక్లెస్ అందరినీ ఆకట్టుకుంది. 74 కోట్ల రూపాయల విలువైన ఆ నగ ఇప్పటిది కాదు. 17వ శతాబ్దం నాటిది. చెప్పాలంటే.. అది భారత్‌కు చెందిన అమూల్యమైన నగ. అప్పట్లో మొఘల్ రాణి నూర్జహాన్ వాడిన నగపై.. ప్రత్యేక కథనం..!
జహంగీర్ ఇచ్చిన బహుమతి...
17వ శతాబ్దం ఆరంభంలో మొఘల్ చక్రవర్తి జహంగీర్ అందాల భామ నూర్జహాన్ ను మనువాడిన విషయం తెలిసిందే..! 1611లో జరిగిన ఈ వివాహం సందర్భంగా ఆయన నూర్జహాన్ కు ఓ నెక్లెస్‌ను బహూకరించాడు. 69.42 క్యారెట్ల ఆ నగపై అప్పటి అధికారిక భాష పర్షియన్ లో ‘ప్రేమ ఎప్పటికీ శాశ్వతం’ అని చెక్కించారు. మొఘల్ సామ్రాజ్యంలో నూర్జహాన్ ను అందాల రాణి అని, ఫ్యాషన్ డిజైనర్ అని పిలిచేవారు.
అంతేకాదు. మొఘల్ బేగంలు ఎవరూ పరదా దాటి బయటకు వచ్చేవారు కాదు. కానీ, జహంగీర్‌కు 20వ భార్య అయిన నూర్జహాన్ మాత్రం రాచరిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆమె పేరిట నాణేలు కూడా ముద్రితమయ్యాయి. ఆమె ఎన్నెన్నో ఫత్వాలను జారీ చేశారు. న్యాయనిర్ణయంలో.. కోర్టు హాలులో ఆమె జహంగీర్‌తో కలిసి కూర్చుని, తీర్పులిచ్చేవారు. జహంగీర్ మరణం తర్వాత.. ఆమె క్రమంగా పరిపాలనకు దూరమయ్యారు. 1645లో లాహోర్‌లో మరణించారు. ఆ తర్వాత ఆ నెక్లెస్ షాజహాన్ భార్య ముంతాజ్ బేగంకు వారసత్వంగా అందింది.
నగకు నామకరణం...
ముంతాజ్ మరణం తర్వాత.. షాజహాన్ ఆమె పేరిట తాజ్‌మహల్‌ను నిర్మించాడని మనకు తెలుసు. ముంతాజ్ మరణానంతరం ఈ నగకు ‘తాజ్ మహల్ డైమండ్’ అని నామకరణం చేశారు. అప్పటినుంచి ఈ నెక్లెస్ అదేపేరుతో కొనసాగుతోంది. బ్రిటిషర్ల కాలం లో కొహినూర్ వజ్రం, నెమలి సింహాసనం మాదిరిగానే.. ‘తాజ్ మహల్ డైమండ్’ నెక్లెస్ కూడా దోపిడీకి గురైంది. ఆ తర్వాత 20వ శతాబ్దం వరకు ఆ నెక్లెస్ ఎన్నెన్నో చేతులు మారి.. 1971లో ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ కార్టియర్ చేతికి వెళ్లింది. కార్టియర్ దానికి మెరుగులు దిద్ది, కొన్ని చిన్నచిన్న వజ్రాలు, కెంపులను జోడించారు. విమానాశ్రయంలో అమ్మకానికి పెట్టారు.
ఎలిజబెత్ టేలర్‌కు గిఫ్ట్‌గా...
1972లో అప్పటి హాలీవుడ్ స్టార్ రిచర్డ్ బర్టన్ తన భార్య, నటి ఎలిజబెత్ టేలర్‌కు ఓ చక్కటి గిఫ్ట్ ఇవ్వాలని, అది ఎన్నటికీ గుర్తుండేలా.. చెరిగి పోని గుర్తుగా ఉండాలని భావించారు. ఆ సమయంలోనే.. విమానాశ్రయంలో కార్టియర్ ప్రదర్శనకు పెట్టిన నూర్జహాన్ నగపై ఎలిజబెత్ టేలర్‌కు మక్కువ కలిగింది. దాంతో రిచర్డ్... ఆమెకు తెలియకుండా ఆ నగను కొన్నారు. ఆ తర్వాత ఎలిజబెత్‌కు దాన్ని సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఇచ్చారు. దాంతో ఎలిజబెత్ ఉబ్బితబ్బిబ్బై పోయింది. తన ఆభరణాల కలెక్షన్ లో ఈ నగను ఆమె అత్యంత ప్రముఖంగా చూసుకునేది.
క్లియోపాత్రా సినిమా సెట్‌లో ఎలిజబెత్, రిచర్డ్ మధ్య ప్రేమ చిగురించగా..ఈ నగను ఆ ప్రేమకు ప్రతిరూపంగా ఆమె భావించేది. ఎలిజబెత్ తనకు ఆస్కార్ వచ్చినప్పుడు.. ఆ పురస్కారాన్ని అందుకునే సమయంలోనూ ఈ నగను ధరించారు. 2011లో ఆమె మరణం తర్వాత.. ఎలిజబెత్ టేలర్ ఎయిడ్స్ ఫౌండేషన్ కోసం ఈ నగను 8.8 మిలియన్ డాలర్లకు.. అంటే రూ.74 కోట్లకు విక్రయించారు. ఆ తర్వాత ఈ నగ గురించి ఎవరికీ పెద్దగా సమాచారం తెలియదు. నూర్జహాన్ నెక్లెస్‌ను అంతా మరచి పోతున్న తరుణంలో.. ఈ నెలలో మార్గోట్ రాబీ ఆ నగతో తళుక్కున మెరిసి.. ఆభరణాల ప్రియులను, తన అభిమానులను ఆశ్చర్యపరిచారు.
– హెచ్. కమలాపతి రావు, సాక్షి వెబ్ డెస్క్


