వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా వెనెజువెలాకు చుక్కలు చూపింది. అనంతరం.. వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా సైన్యం బంధీగా తీసుకెళ్లింది. మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్‌లను అమెరికా యుద్ధ నౌక ఐవో జిమాలో న్యూయార్క్‌కు తరలిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అక్కడే వారికి ప్రాసిక్యూట్ చేస్తామని వెల్లడించారు. అమెరికా చట్టాల ప్రకారం మదురో దంపతులను శిక్షిస్తామని తెలిపారు. ఇదే సమయంలో లాటిన్ అమెరికా దేశాలను ట్రంప్ హెచ్చరించారు.
మెక్సికో, క్యూబా, కొలంబియా సైతం మాదకద్రవ్యాలను తయారు చేస్తూ.. అక్రమంగా అమెరికాలోకి సరఫరా చేస్తున్నాయని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అనేక ముఠాలకు కూడా ఈ దేశాలు ఆశ్రయమిస్తున్నాయన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే తర్వాత వెనెజువెలా పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఆయా దేశాలలోని డ్రగ్స్ ఉత్పత్తి చేసే ప్రయోగశాలపై దాడులు చేయడానికి కూడా వెనుకాడనని ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తీరు మార్చుకోకపోవతే వారిపై తగిన చర్యలు, దాడులు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.
మెక్సికోపై ఆరోపణలు: దేశం కార్టెల్‌ల చేతిలో నడుస్తోందని, అమెరికా జోక్యం అవసరమని అన్నారు.
కొలంబియాపై ఇలా: కొకైన్ ఉత్పత్తి కేంద్రంగా ఉంది. మూడు ప్రధాని కొకైన్ ఫ్యాక్టరీలను నడుపుతున్నారు. కొకైన్‌ను అమెరికాలోకి సరఫరా చేస్తున్నారు. అమెరికా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
క్యూబాపై తీవ్ర విమర్శలు: విఫలమవుతున్న దేశం అని అన్నారు. క్యూబా ప్రజలను అమెరికా ఆదుకుంటుంది. అమెరికా సైనిక చర్యలు జరగవచ్చని అని సూచించారు.
ఇదిలా ఉండగా.. వెనెజువెలా బాధ్యతలను తామే చూసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దాడుల తర్వాత శనివారం మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ‘‘అధ్యక్షుడిని ఇప్పటికే బంధించాం. ఇక పరిపాలనా బాధ్యతలను మేమే చూసుకుంటాం. మా కనుసన్నల్లో ఎవరి చేతుల మీదుగా పరిపాలన జరగబోతోందనేది త్వరలోనే ప్రకటిస్తాం. నూతన ప్రభుత్వం ఏర్పడి భద్రంగా, సవ్యంగా, పారదర్శకంగా అధికార బదిలీ జరిగేదాకా పరిపాలన బాధ్యత మాదే. పరిపాలన సవ్యంగా సాగేలా చూసుకుంటాం’’ అని ట్రంప్ అన్నారు.
లాటిన్ అమెరికా దేశాలే టార్గెట్..
మరోవైపు.. బ్రిటిష్ పాలన నుంచి 1776లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న అమెరికా.. ఆ తర్వాత కాలంలో లాటిన్ అమెరికా దేశాలపై ఉక్కు పిడికిలి బిగించింది. 1798 మొదలు తాజాగా వెనెజువెలా ఉదంతం వరకు 700లకు పైగా సందర్భాల్లో సైనిక జోక్యం చేసుకుంది. మెక్సికో, పనామా దేశాల భూభాగాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు పలు దేశాల్లో ప్రభుత్వాధి నేతలను మార్చడం, తనకు అనుకూలమైన వ్యక్తులను అధికారంలోకి తీసుకురావడానికి అమెరికా బలప్రయోగానికి పాల్పడింది. ఈ క్రమంలో లాటిన్ అమెరికా, కరీబియన్ దీవుల్లో 65వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని చరిత్రకారులు చెబుతున్నారు. అదృశ్యమైన వ్యక్తులు, లెక్కల్లో చేరని మరణాలు మరింత ఎక్కువ సంఖ్యలోనే ఉంది.


