నేటి నుంచి కొత్త రూల్స్‌.. రాజధాని ప్రజలకు ఇక కష్టాలే! | Delhi NCRs New Pollution Rules Explained | Sakshi
Sakshi News home page

నేటి నుంచి కొత్త రూల్స్‌.. రాజధాని ప్రజలకు ఇక కష్టాలే!

Nov 1 2026 9:24 AM | Updated on Nov 1 2026 9:24 AM

Delhi NCRs New Pollution Rules Explained

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చింది. నేటి (నవంబర్‌ 1) నుంచి కొత్త నిబంధనలు అమలు చేయనున్నారు. చలికాలంలో పెరిగే వాయు కాలుష్యం, దట్టమైన పొగమంచును కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టింది. ఈ ఆంక్షలు 2027 జనవరి 31 వరకు కొనసాగనున్నాయి.

బీఎస్‌-6 ప్రమాణాలు లేని వాహనాలకు నో ఎంట్రీ
ఢిల్లీలోకి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బీఎస్‌-6 ప్రమాణాలు లేని పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల ప్రవేశంపై నిషేధం విధించారు. నోయిడా, గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌, ఘజియాబాద్‌ వంటి ప్రాంతాల నుంచి వచ్చే సుమారు 10 లక్షల పాత వాహనాలపై ఈ నిబంధన ప్రభావం పడనుంది. అయితే ఎలక్ట్రిక్‌, సీఎన్‌జీ వాహనాలతో పాటు అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలకు మినహాయింపు ఇచ్చారు.

నిర్మాణ పనులపై మూడు నెలల నిషేధం
ధూళి కాలుష్యాన్ని తగ్గించేందుకు నవంబర్‌ 1 నుంచి జనవరి 31 వరకు ధూళి వెలువడే కూల్చివేత పనులు, బహిరంగ నిర్మాణ కార్యకలాపాలను నిషేధించారు. అయితే కొన్ని అత్యవసర ప్రజా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిర్దేశిత నిబంధనల ప్రకారం మినహాయింపు ఉంటుంది. ధూళి నియంత్రణ ప్రమాణాలను పాటిస్తూ ఇండోర్‌ ఫినిషింగ్‌, ప్లంబింగ్‌, ఎలక్ట్రికల్‌ పనులు చేసుకోవచ్చు.

50 శాతం ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో సగం మంది ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు హాజరుకావాలని ఆదేశించారు. మిగిలిన 50 శాతం మంది ఇంటి నుంచే పనిచేయాల్సి ఉంటుంది. అత్యవసర సేవలకు మాత్రం ఈ నిబంధన వర్తించదు. రహదారులపై వాహనాల రద్దీని తగ్గించి కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు
ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు వివిధ ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను మార్చారు. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయాలు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు కొనసాగుతాయి. మరోవైపు ప్రైవేటు వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు పలు ప్రభుత్వ పార్కింగ్‌ స్థలాల్లో పార్కింగ్‌ ఫీజులను రెట్టింపు చేయనున్నారు. అయితే ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ నిర్వహించే పార్కింగ్‌ కేంద్రాలకు ఈ పెంపు నుంచి మినహాయింపు ఇచ్చారు.

పీయూసీ సర్టిఫికెట్‌ లేకుంటే పెట్రోల్‌, డీజిల్‌ బంద్‌!
నవంబర్‌ 1 నుంచి ఢిల్లీలోని పెట్రోల్‌ బంకుల్లో 'నో పీయూసీ.. నో ఫ్యూయల్‌' విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందుకోసం 500 పెట్రోల్‌ బంకుల్లో ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌ (ఏఎన్‌పీఆర్‌) కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవి వాహనాల నంబర్‌ ప్లేట్లను స్కాన్‌ చేసి పీయూసీ సర్టిఫికెట్‌ వివరాలను తనిఖీ చేస్తాయి. సర్టిఫికెట్‌ చెల్లుబాటు కాకపోతే పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జీ నింపేందుకు బంకు సిబ్బంది నిరాకరిస్తారు.

ఉల్లంఘిస్తే ఈ-చలాన్లు
కొత్త నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఏఎన్‌పీఆర్‌ కెమెరాలతో పాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ) ద్వారా నిబంధనలను ఉల్లంఘించే వాహనాలను గుర్తిస్తారు. నిబంధనలు పాటించని వాహనదారులకు ఈ-చలాన్లు జారీ చేయనున్నారు.

ప్రయాణికులకు సీఎం రేఖా గుప్తా విజ్ఞప్తి
ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ ప్రాంతాల మధ్య ప్రయాణించే వాహనదారులు తమ వాహనాల ఉద్గార ప్రమాణాలను ముందుగానే తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఇబ్బందులు, జరిమానాలు ఎదురుకాకుండా ప్రయాణాలను ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలని తెలిపారు. కొత్త ఆంక్షలకు సహకరించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాజా ట్రాఫిక్‌ సమాచారం కోసం ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసుల అధికారిక సోషల్‌ మీడియా ఖాతాలను పరిశీలిస్తుండాలని సూచించారు.

ఇదీ చదవండి: ర్యాలీ ఏర్పాట్లలో ప్రియాంక.. వ్యాపారులకు రాహుల్ కీలక పిలుపు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement