ధురంధర్, భగవంత్ కేసరి సినిమాలతో దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమైన హిందీ నటుడు అర్జున్ రాంపాల్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. గత ఎనిమిదేళ్లుగా దక్షిణాఫ్రికా మోడల్, ఫ్యాషన్ డిజైనర్ గాబ్రియెల్లా డెమెట్రియాడెస్‌తో సహజీవనం చేస్తున్నారు. వీళ్లకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. ఈ శుక్రవారం గోవాలోని బార్డెజ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో తమ వివాహాన్ని అర్జున్ అధికారికంగా నమోదు చేశాడు.
మధ్యప్రదేశ్‌కి చెందిన అర్జున్ రాంపాల్.. 2001 నుంచి సినిమాలు చేస్తున్నాడు. దాదాపుగా హిందీలోనే నటించాడు. బాలకృష్ణ 'భగవంత్ కేసరి'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. రీసెంట్ టైంలో అయితే 'ధురంధర్' రెండు భాగాల్లో విలన్‌గా నటించి మెప్పించాడు.
ఇక పెళ్లి విషయానికొస్తే.. 1998లో మోడల్, వ్యాపారవేత్త మెహర్ జెసియాని వివాహం చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు కూతుళ్లు కూడా పుట్టారు. కానీ 2019లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఇది జరగడానికి ఏడాది ముందు నుంచి మోడల్ గాబ్రియెల్లాతో డేటింగ్ మొదలుపెట్టాడు. గత ఎనిమిదేళ్లగా సహజీవనం చేస్తున్న వీళ్లు కొన్నాళ్ల క్రితం అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు 53 ఏళ్ల వయసులో అర్జున్ రాంపాల్ తమ పెళ్లిని రిజిస్టర్ చేయించాడు. దీంతో అధికారికంగా భార్యభర్తలయ్యారు.


