యుద్ధం.. విధ్వంసం.. ఆకలి కేకలు.. ప్రాణభయంతో బతుకీడుస్తున్న ప్రజలు.. రష్యా దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న ఉక్రెయిన్‌లోని ఒలేష్కీ నగరంలో బాధితులకు ఊరట కల్పించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. యుద్ధం మధ్య చిక్కుకున్న ప్రజలకు మానవతా సాయం అందించడంతోపాటు, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ చర్చలకు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మధ్యవర్తిత్వం వహించినట్లు వైట్‌హౌస్ ప్రకటించింది.
ఈ క్రమంలో కాల్పుల విరమణ ఈ నెల 29న ప్రారంభం కానుందని శుక్రవారం వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ఈ చర్చలకు శ్రీకారం చుట్టారని, కాల్పుల విరమణ నిబంధనలను ఖరారు చేసేందుకు ఆమెతోపాటు ఓ ప్రతినిధి రష్యా, ఉక్రెయిన్ నాయకత్వాలతో నేరుగా సంప్రదింపులు జరిపారని తెలిపింది. అయితే ఈ ప్రకటనపై ఇరు దేశాల ప్రభుత్వాలు ఇంకా స్పందించలేదు.
పిల్లల కోసం పుతిన్‌కు లేఖ..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న చిన్నారుల పరిస్థితిపై మెలానియా ట్రంప్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. యుద్ధం కారణంగా నిరాశ్రయులైన పిల్లలను తిరిగి వారి కుటుంబాలతో కలిపేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఆమె గతంలో వ్యక్తిగతంగా లేఖ రాశారు. ఇప్పుడు ఒలేష్కీ నగరంలో కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినట్లు వైట్‌హౌస్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
విధ్వంసమైన నగరానికి మానవతా సాయం
ఒకప్పుడు సుమారు 24 వేల మంది నివసించిన ఒలేష్కీ నగరం ప్రస్తుతం యుద్ధ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతింది. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైన తొలిరోజే మాస్కో దళాలు ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయి. అప్పటి నుంచి కొనసాగుతున్న సంఘర్షణలతో నగరంలో చాలా ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ఆహారం, వైద్య సామగ్రి, ఔషధాల కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ అమల్లోకి వస్తే బాధితులకు అత్యవసర సహాయం అందించడంతోపాటు, ప్రమాదకర ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఏర్పడనుంది. అయితే ఈ ప్రకటనకు రష్యా, ఉక్రెయిన్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాల్పుల విరమణ వాస్తవంగా అమల్లోకి వస్తుందా? యుద్ధ బాధితులకు ఎంతవరకు ఊరట లభిస్తుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కీలక చర్చలు..
మరోవైపు.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు మరోసారి దౌత్య ప్రయత్నాలు ఊపందుకున్నాయి. అమెరికా, రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య వచ్చే నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో త్రైపాక్షిక శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ విషయాన్ని క్రెమ్లిన్ ధ్రువీకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. నవంబర్‌లో అబుదాబిలో ఈ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో నిలిచిపోయిన అమెరికా మధ్యవర్తిత్వ చర్చలను తిరిగి ప్రారంభించేందుకు తాజా పరిణామాలు మార్గం సుగమం చేశాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ ఈ వారం రష్యాలో పుతిన్‌తో సమావేశమయ్యారు. అంతకుముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతోనూ చర్చలు జరిపారు. ఈ సంప్రదింపుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి.
ఇదీ చదవండి: మాల్దీవుల డబుల్ గేమ్.. భారత్‌కు వెన్నుపోటేనా?


