రాయలసీమకు కృతజ్ఞత చెప్పుకోవాలని రణబాలి చేశాను: హీరో విజయ్‌ దేవరకొండ | Vijay Deverakonda about Ranabaali movie | Sakshi
Sakshi News home page

రాయలసీమకు కృతజ్ఞత చెప్పుకోవాలని రణబాలి చేశాను: హీరో విజయ్‌ దేవరకొండ

Oct 24 2026 4:24 AM | Updated on Oct 24 2026 4:24 AM

Vijay Deverakonda about Ranabaali movie

రాహుల్, విజయ్‌ దేవరకొండ, ఈశ్వరీ రావు, నవీన్, అనురాగ్, వై. రవిశంకర్‌

‘‘నేను పుట్టింది హైదరాబాద్‌లో అయినా చదువుకున్నది పుట్టపర్తి. తిరిగింది అనంతపురం, ధర్మవరం. నేను చదువుకుంటున్నప్పుడు పుట్టపర్తి పక్కన కొత్తచెరువు అనే ఊరిలో ఉన్న థియేటర్లో బెంచీ మీద కూర్చుని మూడు సినిమాలు చూశాను. ఇప్పుడు అదే థియేటర్‌లో ‘రణబాలి’ ప్రతి షో హౌస్‌ఫుల్‌ అవుతుంటే ఆనందంగా అనిపిస్తోంది. కర్నూలు, అనంతపురం, కడపలో ‘రణబాలి’ షూటింగ్‌ చేస్తున్నప్పుడుపాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేవి. ఒక నటుడిగా ‘రణబాలి’ చేయాలనుకోలేదు. ఈ నేల కథ చెప్పాలనే బాధ్యతతో ఈ మూవీ చేశాను. 

నాకు ఇంత మంచి ప్రేమ, జనాలను ఇచ్చిన రాయలసీమకు కృతజ్ఞత చెప్పుకోవాలని ఈ సినిమాలో నటించాను’’ అని హీరో విజయ్‌ దేవరకొండ తెలిపారు. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘రణబాలి’. మైత్రీ మూవీ మేకర్స్‌పై  నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదలైంది. శుక్రవారం అనంతపురంలో నిర్వహించిన ‘రణబాలి రణభేరి’ కార్యక్రమంలో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ–‘‘మేము చేసిన ‘రణబాలి’పై ఇంత ప్రేమ, గుర్తింపు ఇచ్చి, నన్ను సీమ బిడ్డలా భావించి మా యూనిట్‌కి ఆశీర్వాదాలు ఇవ్వడం సంతృప్తినిస్తోంది. 

ఇంత ప్రేమ, మీ అరుపులు ఇచ్చిన సంతృప్తి ఏ డబ్బు, ఏ అవార్డు కూడా ఇవ్వలేవు. తెలుగు ప్రజలు మాకు ఇచ్చిన ప్రేమ నా జీవితానికి ఒక అర్థం ఇచ్చింది. రష్మికతో పని చేయడం ఏ యాక్టర్‌కైనా, డైరెక్టర్‌కైనా అదృష్టం’’ అని పేర్కొన్నారు. నవీన్‌ యెర్నేని మాట్లాడుతూ– ‘‘రణబాలి’ మూవీని బ్లాక్‌బస్టర్‌ చేసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ మూవీ చాలా అవార్డులు కూడా అందుకుంటుంది’’ అని తెలిపారు. వై. రవిశంకర్‌ మాట్లాడుతూ– ‘‘రణబాలి రణభేరి’ వేడుకని అనంతపురంలోనే చేయాలని పట్టుబట్టి మరీ చేయించారు విజయ్‌గారు. 

మా సినిమాని హ్యూజ్‌ సక్సెస్‌ చేసిన మీకు ధన్యవాదాలు’’ అని చెప్పారు. రాహుల్‌ సంకృత్యాన్‌ మాట్లాడుతూ– ‘‘నేను అనంతపురంలో పుట్టాను, పెరిగాను, చదువుకున్నాను. మంచి సినిమా ఇస్తే ఆదరించడానికి రాయలసీమ ప్రజలు ఎప్పుడూ ముందుంటారని నిరూపించినందుకు ధన్యవాదాలు. సీడెడ్, నైజాం బదులు రాయలసీమ, తెలంగాణ అనే పదాలు వాడాలని ట్రేడ్‌ వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ‘రణబాలి’ విజయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను’’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement