తెలుసుకుందాం
ఒలింపిక్స్ లేదా పెద్ద పెద్ద ఆటల పోటీలు జరిగినప్పుడు విజేతలుగా నిలిచిన ఆటగాళ్లు తమకు వచ్చిన బంగారు పతకాన్ని (Gold Medal) నోట్లో పెట్టుకుని, పంటితో కొరుకుతున్నట్లు కెమెరాలకు పోజులిస్తారు. మెడల్‌ను తినే వస్తువులా అలా ఎందుకు కొరుకుతారో తెలుసా?
వందల ఏళ్ల క్రితం నాణేలు, వస్తువులు నిజమైన బంగారంతో చేశారా లేదా అని తెలుసుకోవడానికి ఒక వింత పద్ధతి వాడేవారు. బంగారం మెత్తటి లోహం (Soft Metal). పంటితో గట్టిగా కొరికితే దాని మీద పంటి ముద్ర పడుతుంది. ఒకవేళ అది నకిలీ బంగారం అయితే పంటి ముద్ర పడదు, పైగా పళ్లు విరిగిపోతాయి! అలా పూర్వం నాణేల నాణ్యతను పరీక్షించేవారు. నిజానికి ఇప్పుడు ఇచ్చే గోల్డ్ మెడల్స్‌లో 93 శాతానికి పైగా వెండి ఉంటుంది. దాని పైన కేవలం 6 గ్రాముల బంగారు పూత మాత్రమే పూస్తారు. కాబట్టి ఇప్పుడు ఆటగాళ్లు దాన్ని నిజమో కాదో పరీక్షించడానికి కొరకడం లేదు. కేవలం ఆనవాయితీగా కొరుకుతూ పోజు ఇస్తున్నారు.


