breaking news
International Lefthanders Day
-
లెఫ్ట్..! రైటే
‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అన్నాడో కవి. ప్రపంచంలో కుడిచేతివాటం వాళ్ల జనాభాదే మెజారిటీ. మెజారిటీని ఆమోదించడమే ప్రజాస్వామ్యం కదా! కుడిచేతివాటం వాళ్లకు పెద్దగా సమస్యలు లేవు. విరివిగా దొరికే వస్తువులన్నీ వారు వాడటానికి అనువైనవే! అలాగని ఎడమచేతివాటం వాళ్లు నిరాశపడాల్సిందేమీ లేదు. ఇప్పుడిప్పుడే వాళ్ల కోసమూ ప్రత్యేకంగా వస్తువులు వస్తున్నాయి. ఎడమచేతివాటం వస్తువుల దుకాణాలు ప్రత్యేకంగా వెలుస్తున్నాయి. ఎడమచేతివాటం వాళ్లలో ఎందరెందరో ప్రముఖులు ఉన్నారు. సినీ, క్రీడా, రాజకీయ రంగాలలో తమదైన ముద్రవేసిన వారు ఉన్నారు. అలాంటి లెఫ్ట్ హ్యాండర్స్ ఎందరో ‘లెఫ్ట్’ రైటేనని నిరూపిస్తున్నారు.కుడిచేత్తో రాయడం... తినడం... ఆడటం... ఇవన్నీ మనకు సహజంగానే కనిపిస్తాయి... కానీ ప్రపంచంలో పదిమందిలో ఒకరు మాత్రం తొమ్మిది మందికి భిన్నంగా ఎడమ చేతిని ఈ పనులకు ఉపయోగిస్తారు. ఈ చిన్న తేడానే వారిని ప్రత్యేకంగా నిలుపుతోంది. ఎన్నో అపోహలకు, వివక్షకు, పరిశోధనలకు ఇదే కారణమైంది. కానీ కాలం మారింది... ‘ఎప్పుడొచ్చామని కాదు అన్నయ్య.. బుల్లెట్ దిగిందా?.. లేదా?’ అని పండుగాడి డైలాగ్‌లా... ఏ చేయి వాడామన్నది కాదు... పోటీప్రపంచంలో నిలదొక్కుకున్నామా? లేదా? అనేదే ప్రస్తుతం సమాజం చూస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఆగస్టు 13న ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే నిర్వహిస్తారు. డీన్ ఆర్. క్యాంప్‌బెల్ అనే వ్యక్తి 1992లో ఈ క్లబ్ అధికారికంగా లెఫ్ట్ హ్యాండర్స్ డేని నిర్వహించింది. ఆగస్టు 13నే ఎందుకు నిర్వహిస్తున్నారనే దానికి ప్రత్యేక కారణం ప్రకటించనప్పటికీ 1992లో ఆ రోజునే మొదటి అవగాహన కార్యక్రమం నిర్వహించడంతో అదే తేదీన ఏటా లెఫ్ట్ హ్యాండర్స్ డేని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఎడమచేతి వాటం వారిపై ఉన్న అపోహలను తొలగించడం, వారి అవసరాలను తయారీ సంస్థలకు తెలియజేయడం, వారికి అనుకూలంగా ఉండే వస్తువులు తయారు చేసేలా అవగాహన కల్పించడం ఈ క్లబ్ ముఖ్య ఉద్దేశాలు.ఎడమ చేతి వాటం ఉన్న వారికి కలిగే ప్రయోజనాలు, సవాళ్ల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ఈ దినోత్సవాన్ని ప్రపంచంలోని అనేక దేశాల్లో జరుపుకుంటున్నారు. ఆ రోజు వివిధ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, లెఫ్ట్ హ్యాండ్ వస్తువుల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఎడమ చేతి వాటం ఉన్నవారు ప్రత్యేకమైన వారు అని కాదు, అందరూ సమానమే అని చాటి చెబుతారు. ప్రతి వ్యక్తి తన సహజమైన చేతివాటంతో నేర్చుకునే, జీవించే, పనిచేసే హక్కు కలిగి ఉన్నాడనే సందేశాన్ని ఆ రోజు ప్రపంచానికి తెలియజేస్తారు.ఎడమచేతి వాటానికి కారణం?శాస్త్రవేత్తలు ఇప్పటికీ దీనికి ఒకే కారణాన్ని నిర్ధారించలేదు. ఎడమచేతి వాటానికి జన్యువులు కీలక పాత్ర పోషిస్తాయని ఎక్కువ మంది పరిశోధకుల అభిప్రాయం. మన శరీరంలో కుడి–ఎడమ వైపుల అభివృద్ధిని ప్రభావితం చేసే కొన్ని జన్యు మార్పులు ఎడమ చేతివాటంతో సంబంధం కలిగి ఉండవచ్చని పీఎల్ఓఎస్ జెనిటిక్స్ జర్నల్‌లో ఓ పరిశోధన ఫలితాల్ని ప్రచురించారు.సెంట్ అండ్రూస్ విశ్వవిద్యాలయం నిర్వహించిన మరో అధ్యయనంలో ఎడమ చేతి వాటం గల వారిలో కనిపించే కొన్ని జన్యు లక్షణాలు ‘సీటస్ ఇన్ వర్సస్’ అనే అరుదైన పరిస్థితితో పోలికలు కలిగి ఉండవచ్చని సూచించారు. ఈ పరిస్థితిలో గుండె, కాలేయం వంటి ప్రధాన అవయవాలు సాధారణ స్థానానికి వ్యతిరేక దిశలో ఉంటాయి. అయితే ఎడమచేతి వాటం ఉన్న వారందరికీ ఈ పరిస్థితి ఉంటుందన్న అర్థం కాదు. కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం జన్యువులు చేతివాటాన్ని నిర్ణయించే అంశాల్లో ఒకభాగం మాత్రమే. మిగిలిన భాగం గర్భంలో జరిగే అభివృద్ధి, జీవసంబంధ ప్రక్రియలు, ఇతర పర్యావరణ ప్రభావాలు కూడా ఉండొచ్చు.రాతి యుగంలోనూ...ఎడమ చేతి వాటం ఆధునిక కాలంలోనే ఏర్పడిన అలవాటు కాదు. ఇది ఏళ్ల తరబడి మానవ జన్యు, మెదడు అభివృద్ధికి సంబంధించిన సహజ లక్షణం. రాతి యుగంలో మనుషులు తయారు చేసిన పనిముట్లు కుడి, ఎడమ రెండు చేతులతోనూ ఉపయోగించేందుకు అనువుగా ఉండేవి. గుహల్లో కనిపించే వివిధ చిత్రాలను పరిశీలించిన ప్పుడు ఆదిమానవులు వాటిని చెక్కడానికి ఎడమ చేతిని ఎక్కువగా వినియోగించినట్టు కొంతమంది పరిశోధకులు గుర్తించారు. అయితే కాలక్రమేణా పనిముట్లు మరింత అభివృద్ధి చెందడంతో ఒకే చేతిని ఎక్కువగా ఉపయోగించే అలవాటు ఏర్పడింది. తరువాత సూర్యారాధన వంటి ఆధారాల ప్రభావంతో కుడిచేతి వినియోగం మరింత ప్రాచుర్యం పొందిందని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు.అపోహలుచాలాకాలం పాటు ఎడమచేతి వాటాన్ని సహజ లక్షణంగా కాకుండా ఒక లోపంగా భావించారు. ప్రసవ సమయంలో సమస్య వల్ల పిల్లలకు ఎడమ చేతివాటం వస్తుందని నమ్మేవారు. రోజువారీ పనులను ఎడమ చేతితో చేయడం అనాగరికం లేదా గౌరవం లేనిదిగా భావించే సంప్రదాయం సమాజంలో క్రమంగా ఏర్పడింది. మనదేశంలో చేతి వాడకంపై సేకరించిన వివిధ సర్వేల ఆధారంగా స్త్రీలతో పోలిస్తే పురుషులే ఎక్కువగా ఎడమచేతి వాటం కలిగి ఉన్నారు.దేశంలో ఎడమచేతితో పనులు చేయడాన్ని చాలామంది ఇప్పటికీ అసాధారణంగా భావిస్తుంటారు. ఎడమచేతివాటం కలిగిన వ్యక్తి సహజంగానే ఎడమచేతితోనే రాస్తాడు, మిగతా పనులకు ఎక్కువగా అదే చేతిని ఉపయోగిస్తాడు. ఎందుకంటే మెదడులోని కుడి భాగం (రైట్ హ్యామ్స్ఫియర్) ఎక్కువగా పనిచేసే వ్యక్తులు సహజంగానే ఎడమచేతిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ⇒ ఎడమ చేతివాటం వారు తక్కువ కాలం జీవిస్తారనే ప్రచారం ఉంది. దానికి బలమైన ఆధారాలు లేవని పరిశోధకులు నిరూపించారు. 1988లో అమెరికాకు చెందిన ఇద్దరు పరిశోధకులు స్టాన్లీ కోరెన్, డయాస్ హాల్పెర్న్లు– ఎడమ చేతివాటం ఉన్న వారు కుడిచేతి వాటం ఉన్న వారికంటే సగటున 8–9 సంవత్సరాలు తక్కువ జీవిస్తారని పేర్కొన్నారు. ఈ అధ్యయనం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ పరిశోధనలో లోపం ఉందని తర్వాత శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడించాయి. అయితే కుడిచేతి వారిని దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన పరికరాలు, యంత్రాలను వాడే సమయంలో వీరు ప్రమాదాల బారిన పడే అవకాశం ఎక్కువ అని పరిశోధకులు పేర్కొన్నారు.రోజువారీ సవాళ్లు⇒ ప్రపంచంలోని చాలా వస్తువులు, పరికరాలు, పని విధానాలు కుడి చేతివాటం వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఫలితంగా ఎడమ చేతివాటం ఉన్న వారు రోజువారీ జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది.⇒ మార్కెట్లో తయారు చేసే కత్తెరలు కుడిచేతి వారికోసం తయారు చేసినవే. ఫలితంగా ఎడమ చేతివారు వాటితో కత్తిరించేటప్పుడు. బ్లేడ్ సరిగా కనిపించకపోవడం, ఎక్కువ ఒత్తిడి పెట్టాల్సి రావడం, చేతికి అసౌకర్యం కలగడం వంటి సమస్యలు ఎదురవుతాయి.⇒ పాఠశాలలు, కళాశాలల్లో ఉండే అటాచ్డ్ రైటింగ్ డెస్కులు కుడిచేతివారిని దృష్టిలో పెట్టుకుని తయారవుతాయి. ఫలితంగా ఎడమచేతివాటం ఉన్న వారి చేయికి సరైన ఆధారం దొరకదు. ఎక్కువ సేపు రాయడం అసౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా పరీక్షల సమయంలో త్వరగా అలసిపోతారు.⇒ బాటిల్ మూత తెరిచే ఓపెనర్లు, స్పైరల్ నోట్‌బుక్స్, కిచెన్ సామగ్రి, గిటారు, కంప్యూటర్ మౌస్ వంటి పరికరాలు ప్రధానంగా కుడిచేతి వారిని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. వీటిని ఉపయోగించడం వీరికి కొంత అసౌకర్యంగా ఉంటుంది.ఇది సహజమే... మార్చొద్దు...కుడిచేతితో ఇవ్వడాన్ని, తీసుకోవడాన్ని శుభకరంగా భావించే సంప్రదాయం, అలవాటు మన సమాజంలో బలంగా ఉంది. ఎడమ చేతితో ఆ పనుల్ని చేయడాన్ని అశుభంగా భావిస్తారు. దీంతో అనేకమంది ఎడమచేతి వాటాన్ని బలవంతంగా మార్చేందుకు ప్రయత్నిస్తారు. గతంలో పాఠశాలల్లో ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల అలవాటు మార్చేందుకు ప్రయత్నించేవారు. కుడిచేతితో బలవంతంగా రాయించేవారు.దీనివల్ల ఆ పిల్లల సహజమైన ఎదుగుదల దెబ్బతింటుంది. అందరూ నిరుత్సాహం కలిగిస్తే వారి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టమవుతుంది. ఎడమ చేతి వాటం లోపం కాదు. అది మనిషి సహజమైన జీవ వైవిధ్యంలో ఒక భాగం. వారిని మార్చాలని ప్రయత్నించకుండా, వారి సహజ స్వభావాన్ని అర్థం చేసుకుని గౌరవించడం అవసరం. సమాజంలో వారికి సమాన అవకాశాలు, ప్రోత్సాహం, గౌరవం లభించినప్పుడే వారి ప్రతిభ పూర్తిగా వికసిస్తుంది.ఎందరో ప్రముఖులుకళలు, క్రీడలు, రాజకీయరంగం, వ్యాపారం వంటి అనేక రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు ఎడమచేతి వారే. ఎడమ చేతివాటం వారిలో అనేక మంది ప్రముఖ శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, సంగీత విద్వాంసులు, రచయితలు ఉండడం వల్ల సహజంగానే సృజనాత్మకత ఎక్కువ అనే అభిప్రాయం ఏర్పడింది. ఒక సమస్యకు అనేక ప్రత్యామ్నాయ పరిష్కారాలు సూచించే సామర్థ్యంలో ఎడమచేతివారు కొంతమెరుగ్గా ఉండొచ్చని కొన్ని పరిశోధనల్లో గుర్తించారు. అయితే ఎడమచేతి వాటం కలిగిన అందరికీ ఇవి తప్పనిసరిగా వర్తిస్తాయని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. విజయానికి కారణం కేవలం ఎడమచేతి వాటమే అని చెప్పలేం. ప్రతిభ, కృషి, అవకాశాలు, శిక్షణ వంటి అనేక అంశాలు కలిసి వారి విజయాన్ని నిర్ణయించాయి. పలు దేశాల అధ్యక్షులు ఎడమ చేతివాటం వారే... అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టల్ చర్చిల్, బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం. మన దేశంలో.. అమితాబ్‌బచ్చన్, రజనీకాంత్, రతన్ టాటా, సచిన్ టెండూల్కర్.నేను చిన్నప్పుడు ఎడమ చేత్తో రాయడం ప్రారంభించాను... నాకు నాలుగైదేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఇది గమనించిన నా తండ్రి నాపై కోప్పడ్డారు. కుడి చేత్తో రాయాలని సూచించారు. దీంతో నేను ఇప్పుడు రెండు చేతులతో రాయగలను. అయినా కొన్ని పనులకు ఎడమ చేతినే ఎక్కువగా ఉపయోగిస్తా. – అమితాబ్ బచ్చన్ఎడమ చేతితో రాసే వారికి రాస్తున్నప్పుడు చేయి కళ్లకు, ఇప్పటికే రాసిన అక్షరాలకు మధ్య అడ్డుగా వస్తుంది. దాంతో ఏం రాస్తున్నారో స్పష్టంగా కనిపించక చాలా మంది లెఫ్ట్‌హ్యాండర్స్ చేతిని పైకి ఎత్తి రాయడానికి ప్రయత్నిస్తారు. దీంతో కొంతమందిలో చేయి కొక్కెం మాదిరిగా వంగిపోతుంది. దీనినే హుక్డ్ పొజిషన్ అంటారు. ఇది కీళ్లపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా ఎక్కువ సేపు రాయలేరు.⇒ ఉపాధ్యాయులకు ఎన్సీఈఆర్టీ రూపొందించిన ఇన్క్లూడింగ్ చిల్ట్రన్ మార్గదర్శక పుస్తకంలో... పిల్లవాడు ఎడమ చేతితో రాస్తున్నాడు. కానీ తల్లిదండ్రులు కుడి చేతితోనే రాయాలని పిల్లాడిపై ఒత్తిడి తెస్తున్నారు. అప్పుడు ఉపాధ్యాయుడు ఏం చేయాలని ప్రశ్నించారు. దీనికి ఎన్సీఈఆర్టీ ఈ విధంగా పేర్కొంది: ‘భారతీయ సమాజంలో కుడిచేతికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం సామాజిక సంప్రదాయం. ఎడమచేతి వాటం పిల్లలను బలవంతంగా కుడిచేత్తో రాయించడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల మెదడు సహజంగా పనిచేసే విధానానికి ఆటంకం కలగవచ్చు. ఇలా చేయడం వల్ల పిల్లలు రాయడానికి ఎక్కువ సమయం పడుతుంది. త్వరగా అలసిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది’ అని హెచ్చరించింది.⇒ రెండేళ్ల వయస్సు వచ్చే వరకు చిన్న పిల్లలు రెండు చేతులూ ఉపయోగిస్తారు. తర్వాత ఒక చేతినే ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభిస్తారు. తల్లిదండ్రుల్లో ఒకరికి లేదా ఇద్దరికీ ఎడమ చేతి వాటం ఉంటే, పిల్లలకు కూడా ఎడమ చేతి వాటం వచ్చే అవకాశం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది కచ్చితంగా వస్తుందని చెప్పలేం.⇒ ఒకే గర్భంలో ఉన్న కవలలు ఒకే జన్యువులు పంచుకున్నా కొన్నిసార్లు ఒకరు ఎడమచేతి వాటం, మరొకరు కుడిచేతి వాటం కలిగి ఉండొచ్చు. జన్యువులతో పాటు గర్భంలో మెదడు అభివృద్ధి సమయంలో జరిగే ఇతర జీవ సంబంధ ప్రక్రియలు కూడా ప్రభావం చూపుతాయి.⇒ క్రికెట్, టెన్నిస్, బాక్సింగ్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో ఎడమ చేతివాటం వారికి కొంత ప్రయోజనం ఉండొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఎందుకంటే ఎక్కువమంది ఆటగాళ్ల కుడిచేతివారితో ఆడేందుకు అలవాటు పడతారు. ఎడమ చేతివాటం వారిని ఎదుర్కొన్నప్పుడు వారి బంతుల కోణం, షాట్లు, కదలికలు భిన్నంగా ఉండడంతో ప్రత్యర్థులు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది.⇒ కొన్ని జంతువులు కూడా ఎడమచేతి వాటాన్ని ప్రదర్శిస్తాయి. కాకపోతే మనుషుల్లా అంత స్పష్టత వీటిలో కనిపించదు. కంగారూలు తినడానికి, ముఖం నిమురుకోవడానికి ఎక్కువగా ఎడమ కాలిని వాడతాయని పరిశోధనల్లో తేలింది. మగ కుక్కలు ఎడమ పాదాన్ని ఎక్కువగా వాడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.చెట్టు నుంచి యాపిల్ కిందకే ఎందుకు పడిందనే దగ్గర మొదలైన ఆలోచన గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొనడానికి న్యూటన్‌కు ప్రేరణ అయింది. అలాగే తన కొడుకు స్కూల్లో మిగతా విద్యార్థులకంటే ఎందుకు ఆలస్యంగా రాస్తున్నాడనే ఓ తండ్రి ఆవేదన ఎడమచేతివాటం వాళ్ల కోసం కొత్త ఉత్పత్తుల తయారీకి పురిగొల్పింది.. ఒకప్పుడు బలవంతంగా కుడిచేత్తో రాయించే తల్లిదండ్రుల్లా కాకుండా, కొడుకు ఎడమచేతివాటానికి అనుగుణంగా ఉండేలా వస్తువుల తయారీకి ముందడుగు వేసేలా చేసింది. ఎందరో లెఫ్ట్ హ్యాండర్స్‌కు చేయూతను అందించేలా చేసింది. ప్రత్యేక స్టోర్లు ప్రపంచ జనాభాలో దాదాపు 10 శాతం మంది మాత్రమే ఎడమచేతివారు. మిగిలిన 90 శాతం మంది కుడి చేతివారు. వీరి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారైన వస్తువులనే ఇద్దరూ వాడాల్సి వస్తోంది. దాంతో ఏదైనా కత్తిరించడం, రాయడం, గిటార్ వాయించడం ఇలా చిన్న చిన్న పనులు కూడా ఎడమచేతి వాటం ఉన్న వారికి అసౌకర్యంగా మారుతున్నాయి. ఫలితంగా లెఫ్ట్ హ్యాండర్స్ కోసం ప్రత్యేకంగా షాపులు వెలుస్తున్నాయి. ఆన్లైన్ స్టోర్లు అందుబాటులోకి వచ్చాయి. ఫుణేలో ఓ తండ్రి తన కుమారుడు చదువులో రాణించలేకపోవడానికి కారణం కుడి చేతి వస్తువులను ఉపయోగించాల్సి రావడమే అని గుర్తించాడు. అలా మొదలైన ఆలోచన ‘ది లెఫ్ట్ హ్యాండ్ షాప్’కి అంకురార్పణ జరిగింది. హైదరాబాద్, పూణేల్లో పేరెంట్స్ చేసిన ఇలాంటి ప్రయత్నమే పలువురు లెఫ్ట్ హ్యాండర్స్‌కు ప్రయోజనకరంగా మారింది.ఏమిటి తేడాలెఫ్ట్హ్యాండ్ కత్తెరకు బ్లేడ్లు రివర్స్‌లో ఉంటాయి. పైన ఉండే బ్లేడ్ ఎప్పుడూ ఎడమ చేతి వైపు ఉంటుంది. దీని వల్ల కత్తిరించాలనుకున్న భాగాన్ని సులభంగా కట్ చేసే వీలవుతుంది. పెన్నును ప్రత్యేకంగా డిజైన్ చేశారు. పెన్కు ఉండే నిబ్ చివర రౌండ్‌గా ఉండి మధ్యలో కట్ అయి ఉంటుంది. దీని వల్ల ఇంక్ సులభంగా ఫ్లో అవుతూ రాయడానికి అనువుగా ఉంటుంది. అలాగే షార్ప్‌నర్‌లో పెన్సిల్‌ను ఉంచి అపసవ్య దిశలో తిప్పాలి. 15 సెం.మీ, ఆరు ఇంచులు ఉన్న స్కేలులో సంఖ్యలు కుడి నుంచి ఎడమకు ఉంటాయి. ఇలా ప్రతీ వస్తువు వారి ఎడమ చేతి వాటానికి అనుకూలంగా ఉండేలా తయారు చేశారు. మొదట్లో వీటిని వినియోగించే వారి సంఖ్య తక్కువగా ఉండడంతో ధరలు ఎక్కువగా ఉండేవి. అయితే ఇటీవల వీటిపై అవగాహన, వినియోగం పెరగడంతో ధరలు కొంత అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేక షాప్‌లతో పాటు ఆన్‌లైన్‌లోనూ అమ్ముతున్నారు. ఒకప్పుడు ఎడమచేతి వాటం వారి పట్ల వివక్ష ఉండేది. బలవంతంగా వారి అలవాట్లను మార్చేందుకు ప్రయత్నించేవారు. ఆ దశ నుంచి ఎడమ చేతివాటం సహజ వైవిధ్యంగా గుర్తింపు పొందుతోంది. ఈ నేపథ్యంలో లెఫ్ట్ హ్యాండర్స్ డే కేవలం ఎడమచేతి వారికి సంబంధించిన వేడుక మాత్రమే కాదు, ప్రతి మనిషిలోని భిన్నత్వాన్ని గౌరవించాలనే సందేశాన్ని గుర్తు చేసే రోజు.∙దిలీప్ మాదిరెడ్డి -
ఎడమ చేతి అలవాటుకు కారణం ఇదేనా?
International Lefthanders Day 2021: ఈ సమాజంలో అందరూ ఒకేలా ఉండరు. కొందరి ప్రత్యేకతను ఇట్టే గుర్తుపట్టొచ్చు. వందలో 90 మంది కుడి చేతి వాటం వాళ్లే ఉండగా, ఎడమ చేతి వాటం వాళ్లు(లెఫ్ట్ హ్యాండర్స్) చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అందుకే వీరెక్కడ కనపడినా మనం ప్రత్యేకంగా చూస్తాం. వాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటాం. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నడో సినీ కవి. కానీ, లెఫ్ట్ హ్యాండర్స్ గురించి ఇప్పటికీ కొన్ని అపోహలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ అపోహలు వాళ్లకే అనుకూలంగా ఉంటున్నాయి కూడా. ఈ తరహా లాభాన్ని సైంటిఫిక్‌గా ‘నెగటివ్ ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ సెలక్షన్’ అంటారు. లెఫ్ట్ హ్యాండర్స్ జెనెటిక్ డిజార్డర్ అని చాలా మంది పొరపడుతుంటారు. అంతేకాదు వీళ్లు రోగ నిరోధక శక్తి సంబంధిత వ్యాధులతో త్వరగా చనిపోతారనే ఒక ప్రచారం నడిచేది అప్పట్లో. మనుషుల్లో ఎడమ చేతి వాటం ఎందుకు వస్తుందో శాస్త్రీయమైన కారణాలను నేటికీ కనుగొనలేకపోవడం విశేషం. అది పుట్టుకతోగానీ, బలవంతంగాగానీ వచ్చే అలవాటు ఎంతమాత్రం కాదు. కానీ, శరీర అంతర్నిర్మాణ పనితీరుపై ఆధారపడుతుందన్న ఒక కారణం మాత్రం చెబుతుంటారు సైంటిస్టులు. మనిషి మెదడు కుడి, ఎడమ రెండు అర్థ భాగాలుగా ఉంటుంది. కుడివైపు శరీరాన్ని మెదడు ఎడమ అర్ధ భాగం నియంత్రిస్తుంది. అలాగే ఎడమవైపు ఉండే శరీర భాగాన్ని మెదడులోని కుడి అర్థభాగం నియంత్రిస్తుంది. అంటే మెదడులోని కుడి అర్ధ భాగం బలంగా ఉన్నవారిలో ఎడమ చేతివాటం రావొచ్చనే ఒక అభిప్రాయం మాత్రం చాలామంది సైంటిస్టుల్లో ఉండగా, జెనెటిక్ ఎఫీషియన్సీ మీద కూడా ఆధారపడి ఉండొచ్చని మరికొందరు సైంటిస్టులు భావిస్తున్నారు. వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే ఈ భూమ్మీద ఏడు నుంచి పది శాతం జనాభా.. ఎడమ చేతి వాటం వాళ్లే ఉన్నారు. అందుకే ఒక స్పెషల్ డే ఉంది. ‘‘ఆగస్టు 13’’న జరుపుతున్నారు. 1976 నుంచి ప్రతీ ఏటా జరుపుతున్నారు. అమెరికా సైన్యంలో పని చేసిన డీన్ ఆర్ క్యాంప్‌బెల్ ఈ దినోత్సవానికి మూలం. ఈయనే లెఫ్ట్హ్యాండర్స్ఇంటర్నేషనల్ కంపెనీని స్థాపించాడు. ఈ రోజున లెఫ్టీస్ ఎదుర్కొంటున్న అసౌకర్యాలపై అవగాహన కార్యక్రమాలు, వాటిని అధిగమించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంటారు. లెఫ్టీస్ క్లబ్‌లు ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తుంటాయి. మాన్పించడం మంచిదేనా? ఏడాదిన్నర నుంచి రెండేళ్ల మధ్య వయస్సులో పిల్లలు వస్తువులను పట్టుకోవడం మొదలుపెట్టినప్పుడు వాళ్లు ఎడమ? కుడి? చేతి వాటం వాళ్లు అన్నది గుర్తించవచ్చు. కానీ, కొందరు తల్లిదండ్రులు ఎడమ చేతి వాటాన్ని ఒక చెడు అలవాటుగా భావిస్తారు. బలవంతంగా ఆ అలవాటును మాన్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే అది పిల్లల మెదడుపై ప్రభావం చూపుతుందంటున్నారు మానసిక వైద్యులు. బ్రెయిన్ డిసీజ్లతోపాటు నత్తి, మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే దీనిని శరీర నిర్మాణ క్రమంలో భాగంగానే భావించాలి తప్పా... కీడుగా పరిగణించాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. ఎడమచేతి వాటం ఉన్నవారిని కొందరైతే పరిశుభ్రత లేనివారుగా, వింతమనుషులుగానూ చూస్తుంటారు. లెఫ్టీస్లో హోమో సెక్సువల్స్ ఎక్కువనే అపోహ కూడా వెస్ట్రన్ కంట్రీస్‌లో నడుస్తుంటుంది. ఈరోజుల్లో ఫర్వాలేదు కానీ.. ఒకప్పుడు మాత్రం లెఫ్టీస్ పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. వాళ్లను తప్పుడు మనుషులుగా పొరపడేవాళ్లు. మంత్రగాళ్లుగా, సైతానుకి ప్రతిరూపాలుగా భావించేవాళ్లట. అదే అనుమానంతో కొందరిని చంపిన సందర్భాలూ చరిత్రలో చాలానే ఉన్నాయి. ఐక్యూ లెవెల్ ఎడమ చేతివాటం వాళ్లను లెఫ్టీ, సినిస్ట్రాల్, సౌత్ పా, లెఫ్ట్ హ్యాండెడ్, లెఫ్ట్ హ్యాండర్ అని రకరకాలుగా పిలుస్తుంటారు. నటుడు చార్లీ చాప్లిన్, యాపిల్ కంపెనీ అధినేత స్టీవ్ జాబ్స్, మైక్రోస్టాఫ్ అధినేత బిల్ గేట్స్, అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా. మన దేశానికొస్తే.. మహాత్మా గాంధీ, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, నటుడు అమితాబ్ బచ్చాన్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, నిర్మాత కరణ్ జోహర్.. అబ్బో ఇలా చెప్పు కుంటూ పోతే లెఫ్ట్ హ్యాండ్ యూజర్ల లిస్ట్ పెద్దదే ఉంది. దీంతో ఎడమ చేతివాటం వాళ్లంతా తెలివిగలవాళ్లనే విషయం ప్రచారంలో ఉంది. అయితే కుడి చేతి వాటం వాళ్లతో పోలిస్తే లెఫ్టీస్లో ఐక్యూ లెవల్ నిజంగానే ఎక్కువగా ఉంటుంది. మాట్లాడే శక్తి, వేగం, సామర్ధ్యం, అర్థం చేసుకోగల శక్తిసామర్థ్యాలు, భావప్రకటనలో స్పష్టత వీరిలోనే బాగుంటాయని సైంటిస్టులు చెప్తున్నారు. మెదడులో కుడి, ఎడమ అర్ధభాగాలను అనుసంధానం చేసే ‘కార్పస్ కల్లోజమ్’ ఎడమ చేతివాళ్లలో ఎక్కువగా ఉంటుంది. వాళ్లలో బ్రెయిన్ చురుగ్గా, సమర్థవంతంగా పని చేయడానికి ఇదొక కారణమని వివరిస్తున్నారు. యాంబీడెక్సాట్రాస్ చేతి అలవాటును పెద్దయ్యాక కూడా కొందరు స్వచ్ఛందంగా మార్చుకుంటారు. ఆ అలవాటు చాలా మంచిదంటున్నారు వైద్యులు. దీని వల్ల ఎడమ బ్రెయిన్, కుడి బ్రెయిన్ల మధ్య సమన్వయం పెరుగుతుందని చెప్తున్నారు. మరింత చాకచక్యంగా తమ పనులను నిర్వహించుకోవడానికి వీలుంటుంది. రెండు చేతుల్ని సమానంగా, సునాయసంగా వినియోగించుకోగలుగుతారు. వీళ్లని ‘యాంబీడెక్సాట్రాస్’ అని పిలుస్తుంటారు. ప్రత్యేకంగా మార్కెట్ ‘లెఫ్టీస్’ కష్టాలు మాములుగా ఉండవు. నిత్యం ఉపయోగించే వస్తువులు అందుబాటులో ఉండవు. కొందరు ఆ సమస్యల్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నా.. అది పూర్తి స్థాయిలో ఉండడం లేదు. అందుకే లెఫ్టీస్ కోసం ప్రత్యేకంగా కొన్ని కంపెనీలు వెలిశాయి. అవి ప్రత్యేకంగా ఎడమ చేతి వాటం ఉన్న వాళ్లకి మాత్రమే వస్తువుల్ని అమ్ముతున్నాయి. కత్తెరలూ, కప్పులూ, పెన్నులూ, పెన్సిళ్లూ, నోటు పుస్తకాలూ... ఇంకా చాలా వస్తువుల్ని ఎడమ చేతివాటం వాళ్లకు అనుకూలంగా డిజైన్ చేస్తాయి ఆ కంపెనీలు. వంట గదిలో ఉపయోగించే కప్పులూ, గరిటెలూ, స్పూన్లు కూడా దొరుకుతాయి. పెన్నులు, వాచీలు, గిటార్లు ఇలా రకరకాల వస్తువులు అందుబాటులో ఉంటున్నాయి. ఇంకా కొన్ని.. చేతులకు ఉన్నట్లే.. కాళ్ల వాటం కూడా ఉంటుంది. కుడిచేతి వాటం ఉన్నవారిలో కుడికాలి వాడకం, ఎడమచేతి వాడకం ఉన్నవారిలో ఎడమ కాలి వాడకం ఎక్కువగా కనిపిస్తుంది. ఎడమ చేతి వాటం ఉన్నవాళ్లు ఏదైనా చూడాలంటే మొదట ఎడమ కన్నుతోనే చూస్తారు. అది అసంకల్పిత చర్య. జంతువులూ, పక్షులకు కూడా ఎడమ చేతివాటం ఉంటుంది. కాబట్టి కొన్ని పక్షులకు ఎడమవైపు రెక్కలు బలంగా ఉంటాయి. కుక్కలు, చింపాంజీలు, గుర్రాలు, తిమింగలాల్లో కూడా పిండదశలోనే జన్యుపరంగా ఎడమవాటం రూపుదిద్దుకుంటుంది. -సాక్షి, వెబ్‌డెస్క్ -
ఆ లక్షణమే వారిని అధ్యక్షులుగా నిలబెట్టిందా?
అదొక ప్రత్యేక లక్షణం.. విలక్షణ శైలి. కానీ, ఆ లక్షణం కలిగిన వారు ఏ రంగంలో ఉన్నా తమదైన ప్రత్యేకత చాటుకుంటున్నారు. బిట్రన్ రాజవంశీకులు మొదలుకొని అమెరికా అధ్యక్షుల వరకు చాలామందిలో ఈ ప్రత్యేక లక్షణం వారిని విలక్షణంగా నిలబెట్టింది. ఇంతకూ ఏమిటా ప్రత్యేక లక్షణం? అందరికన్నా వారు స్పెషల్ ఎందుకు? తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోని క్లిక్ చేయండి.


