పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజర్ రాజధాని నియామేలోని డియోరీ హమానీ అంతర్జాతీయ విమానాశ్రయంపై గురువారం తెల్లవారుజామున సాయుధ దుండగులు దాడికి పాల్పడ్డారు. ఐదు నెలల వ్యవధిలో ఇదే విమానాశ్రయంపై జరిగిన రెండో దాడి కావడం గమనార్హం.
ఉదయం ప్రార్థనలు ముగించుకుని వచ్చిన స్థానికులు భారీ పేలుళ్లు, కాల్పుల శబ్దాలు విన్నట్లు తెలిపారు. విమానాశ్రయం సమీపంలో ఉన్న సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు తెలుస్తోంది. కొద్ది గంటల్లో పరిస్థితి అదుపులోకి రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. భద్రతా బలగాలు దుండగుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టాయి.
స్థానిక భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, కాల్పుల్లో 35 మంది మరణించినట్లు సమాచారం. కొందరు దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దాడి అనంతరం కొంతమంది దుండగులు స్థానిక జనాల్లో కలిసిపోవడంతో వారిని గుర్తించడం కష్టంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థ బాధ్యత వహించలేదు. అయితే ఇదే విమానాశ్రయంపై జనవరిలో జరిగిన దాడికి ఇస్లామిక్ స్టేట్‌తో అనుబంధం ఉన్న ఓ సంస్థ బాధ్యత వహించింది.
నైజర్, మాలీ, బుర్కినా ఫాసో కలిసి ఏర్పరచుకున్న Alliance of Sahel States భద్రతా వ్యవస్థలకు ఈ విమానాశ్రయం కీలక కేంద్రంగా ఉంది. అందువల్ల ఈ దాడి ప్రాంతీయ భద్రతా పరిస్థితులపై మరోసారి ఆందోళనలు రేకెత్తిస్తోంది.


