కడప సెవెన్‌రోడ్స్: బాబు జగ్జీవన్‌రామ్ 119వ జయంతి ఈనెల 5వ తేదీ వేడుకలను నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు కె.సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల నాయకులు, అధికారులు హాజరు కావాలని కోరారు.
బ్రహ్మంగారిమఠం: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం పరిధిలో 7 న ఉదయం 10గంటలకు టోల్ గేట్ రుసుం కోసం వేలం పాట నిర్వహించనున్నారు. ఇందుకోసం ధరావతు రూ 1లక్ష చెల్లించాలి. అలాగే 9న భక్తుల తలనీలాల కోసం వేలం పాట జరుగుతుంది. ఇందుకు వేలం పాట రుసుం రూ 25లక్షలు చెల్లించి బహిరంగ వేలంలో పాల్గొనాలని మేనేజర్ ఈశ్వరాచారి ఒక ప్రకటనలో తెలిపారు.
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలకు ప్రతి ఏటా బీఎంఆర్‌జీఎఫ్ పౌండేషన్ తరఫున ఒంటిమిట్ట రామయ్యకు రెడ్ల రైతులు పండించిన పదార్థాలను సమర్పిస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం బీఎంఆర్‌జీఎఫ్ పౌండేషన్ చైర్మన్ సుమతి రెడ్డి ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు, రైతులు పండించిన తినుబాండారాలతో కూడిన సారెను ఒంటిమిట్ట రామయ్యకు సమర్పించారు. కార్యక్రమంలో సీబీఐటీ జై చంద్రారెడ్డి, కడపకు చెందిన వీరారెడ్డి, తిరుపతికి చెందిన యుగంధర్ రెడ్డి, దిలీప్ రెడ్డి, చిత్తూరుకు చెందిన శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
కడప కార్పొరేషన్: ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి వచ్చిందని ఏపీఎస్‌పీడీసీఎల్ ఛైర్మెన్, సీఎండీ శివశంకర్ లోతేటి ఒక ప్రకటనలో తెలిపారు. మగ్గంపై వస్త్రాలు నేసే నేతన్నలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ మగ్గాల నేతన్నలకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేయడం జరుగుతుందన్నారు. అల్పాదాయంతో జీవితాలను నెట్టుకొస్తున్న నేతన్నలకు ఇది ఉపయోగపడనుందన్నారు. మగ్గాలు, పవర్ లూమ్స్ ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ లోడ్ కు అనుగుణంగా ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడం, విద్యుత్ సర్వీసులకు కెపాసిటర్ల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామన్నారు.


