కళ్లకు కట్టినట్లు అబద్ధాలు, మోసాలు
● సంపద సృష్టిస్తానని,
అప్పులు సృష్టిస్తున్న బాబు
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఎద్దేవా
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు, చెబుతున్న అబద్ధాలు 2026–27 బడ్జెట్‌లో కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఊసే లేదని, 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్లు ఇస్తామని దానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేసి డీబీటీ ద్వారా ప్రజల ఖాతాలకు నగదు జమ చేస్తుంటే...వైఎస్ జగన్ ఆర్థిక విధ్వంసం చేస్తున్నారని విమర్శలు చేశారన్నారు. సూపర్ సిక్స్ పథకాలకు అరకొర కేటాయింపులే చేశారని, మిగిలిన 136 హామీలను గాలికొదిలేశారన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో సీ పోర్టులు, నాడు–నేడు ద్వారా స్కూళ్లు, ఆసుపత్రులు అభివృద్ధి చేసినా, రైతు భరోసాకేంద్రాలు, సచివాలయాలు, వెల్‌నెస్ సెంటర్లు నెలకొల్పినా రూ.3.18లక్షల కోట్లే అప్పులు అయ్యాయన్నారు. ఈ ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేయకపోయినా రెండేళ్లు కాకముందే రూ.3.27లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. సంపద సృష్టిస్తానని చెప్పిన పెద్దమనిషి, అప్పులు సృష్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. లంచాలకు కమిషన్‌ల కోసమే ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఉందన్నారు. విద్యారంగంలో సమూలమైన మార్పులు తెచ్చిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు. ధనవంతులు మాత్రమే ఉన్నత చదువులు చదువుకోవాలనే భావన చంద్రబాబుదన్నారు. అందుకే సీబీఎస్‌ఈ, టోఫెల్, ఐబీ సిలబస్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. దుర్భిక్షప్రాంతమైన రాయలసీమకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎంతో అవసరమని, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కుమ్మకై ్క ఆ ప్రాజెక్టును నిలిపేశారన్నారు. బడ్జెట్‌లో ఆరోగ్యశ్రీ ఊసే లేదని, చంద్రబాబు చేస్తున్న అప్పులకు భవిష్యత్‌లో వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ప్రజలను మోసం చేయకూడదనే వైఎస్ జగన్ ఎన్నికల్లో అబద్దాలు చెప్పలేదన్నారు. సమావేశంలో మేయర్ పాకా సురేష్ కుమార్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, కార్పొరేటర్లు బాలస్వామిరెడ్డి, షఫీ, వైఎస్సార్‌సీపీ నాయకులు సుబ్బరాయుడు, ఎన్. శివరామ్, ఎస్. వెంకటేశ్వర్లు, సీహెచ్ వినోద్, కె. శివయాదవ్, షఫీవుల్లా, రాయల్‌బాబు, ఫయాజ్, నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.


