తమలపాకు తోటల పరిశీలన
కడప అగ్రికల్చర్ : వైఎస్సార్ జిల్లా సికెదిన్నె మండలంలోని కొలుములపల్లి గ్రామంలో మంగళవారం తమలపాకు తోటలను మండల ఉద్యాన, వ్యవసాయ అధికారులతో కలిసి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. ఎస్. మానస పరిశీలించారు. ఎండు తెగులు ప్రధాన సమస్యగా ఉందని గుర్తించారు. నివారణకు సమగ్రంగా యాజమాన్యం చేపడితే తప్ప నియంత్రించడం కష్టమని తెలిపారు. ఈ తెగులు నియంత్రణకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జొన్న లేదా మొక్కజొన్నతో పంటమార్పిడి చేయాలని తెలిపారు. ఎకరానికి ఒక టన్ను చొప్పున జిప్సమ్ వేసి అవిశ నాటటానికి ముందే కలియదున్నాలని చెప్పారు. తెగులు ఎక్కువగా ఆశించే తోటలలో నవంబరు నుండి ఫిబ్రవరి వరకు నెలకు ఒకసారి చొప్పున 4 సార్లు 1% బోర్డో మిశ్రమాన్ని పాదుల్లో పోసుకుంటూ 15 రోజుల కొకసారి చొప్పున 8 సార్లు ఆకులపై పిచికారి చేయాలని తెలిపారు. వీటిలోపాటు మరికొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉద్యాన అధికారి రెడ్డయ్య, వ్యవసాయ అధికారి ఈశ్వర్ , డీఆర్సీ పద్మజ, సెరికల్చర్ పాల్గొన్నారు.


