మృత్యువుతో పోరాడి.. హెడ్మాస్టర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

మృత్యువుతో పోరాడి.. హెడ్మాస్టర్‌ మృతి

Feb 14 2026 7:55 AM | Updated on Feb 14 2026 7:55 AM

మృత్యువుతో పోరాడి.. హెడ్మాస్టర్‌ మృతి

మృత్యువుతో పోరాడి.. హెడ్మాస్టర్‌ మృతి

వృత్తి పరమైన ఒత్తిళ్లా?

కుటుంబ సమస్యలా?

దర్యాప్తు చేస్తున్న పోలీసులు

కడప అర్బన్‌ : కడప నగరంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హెడ్మాస్టర్‌ జింకా జమీమా సుందరం(49) వారం రోజులుగా మృత్యువుతో పోరాడి.. చివరికి మృతి చెందింది. వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గాంధీనగర్‌ స్కూల్‌ సమీపంలో నివాసం ఉంటున్న జింకా జమీమా సుందరం ఈ నెల 6న ఉదయం ఇంటిలో ఎవరూ లేరు సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు హెడ్మాస్టర్‌ మృత్యువుతో పోరాడి కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. సంఘటన జరిగిన రోజున ఆమె తండ్రి జింకా సామెల్‌, భర్త పుష్పరాజ్‌ ఫిర్యాదు మేరకు అదే రోజున కడప వన్‌టౌన్‌ సీఐ వి.చిన్న పెద్దయ్య కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. ఈ క్రమంలో హెడ్మాస్టర్‌ జింకా జమీమా సుందరం ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఈ నెల 12వ తేదీ రాత్రి 11:50 సమయంలో కడప రిమ్స్‌ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. చికిత్స పొందుతూ 13వ తేదీన మధ్యాహ్నం మృతి చెందింది. మృతదేహాన్ని రిమ్స్‌ మార్చురీలో ఉంచారు. ప్రస్తుతం మృతురాలి భర్త, బంధువుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్‌ చేసి, మృతదేహానికి శనివారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. తర్వాత పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేపట్టి చట్టపరంగా చర్యలు తీసుకోనున్నారు. కాగా ప్రధానోపాధ్యాయురాలు మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె తమ వృత్తిలో ఇన్‌చార్జ్‌ హెడ్మాస్టర్‌గా బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి ఎదుర్కొన్న ఒత్తిళ్లకు మానసికంగా తీవ్ర ఆవేదన చెంది ఈ చర్యకు పాల్పడిందా? లేక కుటుంబ సమస్యల వల్ల ఈ అఘాయిత్యం చేసుకుందా? లేక ఈ రెండు సమస్యలను అధిగమించలేక ఇలా చేసుకుందా? అనే అంశాలపై పోలీసు అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement