నాడు– నేడు పనులు పూర్తి చేయాలి
ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి
కడప కార్పొరేషన్ : వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు–నేడు పథకం కింద పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి కోరారు. శుక్రవారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ నాడు–నేడు కింద పాఠశాలల భవనాలు 90 శాతం పూర్తయ్యాయని, కిటికీలు, ఎలక్ట్రిక్ ఫిట్టింగులు పూర్తి చేస్తే సరిపోతుందన్నారు. ఇందుకు సంబంధించిన నిధులు కూడా హెడ్‌మాస్టర్ అకౌంట్లలో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఆదేశాలిస్తే వారు ఆ పనులు పూర్తి చేస్తారని తెలిపారు. అలాగే మూడేళ్లలో 70 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు స్కూళ్లకు పోయారని తెలిపారు. విద్యాహక్కు చట్టం ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న వారిని ప్రైవేటు స్కూళ్లలో చేర్పిస్తున్నారని, వారికి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా ఇస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని గుర్తించి తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు దీన్ని పక్కన పెట్టాయని గుర్తు చేశారు. విద్యాహక్కు చట్టాన్ని పునఃపరిశీలన చేయాలని కోరారు.


