నేడు మహా నైవేద్యం
రాయచోటి టౌన్: శ్రీభద్రకాళీ సమేత శ్రీవీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలలో అపురూప ఘట్టమైన ‘మహా నైవేద్యం’ శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ అపురూప ఘట్టాన్ని ప్రతక్ష్యంగా చూసేందుకు స్థానికంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఈ మహాౖనైవేద్యం నిర్వహించే క్రమంలో పూర్తిగా అన్నాన్ని (భోజనాన్ని) రాశిగా పోసి ఈ రాశిపై వండిన అత్తిరాసాలు, కూరగాయలు, దుంపలు కప్పి ఉంచి తరువాత శ్రీవీరభద్రుడికి త్రినేత్రం ధరింపజేస్తారు. ఆ క్షణం కోసం లోపల ఉన్న వేదపండితులు, అర్చకులు, ఆలయ అధికారులు, ఆలయపాలక మండలి సభ్యులు, భక్తులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. త్రినేత్రం ధరింపచేసిన తరువాత వేదపండితులు వల్లించే వేదమంత్రాల మధ్య వడ్డెర్లు ఒక్కసారిగా ఈ మహానైవేద్య ప్రసాదాన్ని అందినంత తీసుకెళ్తారు. తరువాత ఈ రాశిలోని అన్నప్రసాదాన్ని అధికారుల పర్యవేక్షణలో పోలీసులు, అర్చకులు భక్తులకు అందిస్తారు.
సర్వం సిద్ధం
మహా నైవద్యే ఘట్టాన్ని చూసేందుకు కర్నాటక రాష్ట్రం నుంచి వేలాదిగా తరలివస్తారు. ఒక రోజు ముందుగానే రాయచోటికి చేరుకొంటారు. వీరికి కర్నాటక రాష్ట్రం ట్రస్ట్ వాళ్లు ఉచిత భోజనం ఏర్పాటు చేస్తారు.
బస చేయడానికి ఏర్పాట్లు.......
కర్నాటక రాష్ట్రం నుంచి తరలి వచ్చే భక్తుల కోసం ఆలయానికి ఎదురుగా ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాలు, సమీపంలోని మరో ప్రైవేట్ పాఠశాల భవనాలు, ఆలయానికి చెందిన గదులు భక్తుల కోసం ఏర్పాటు చేస్తారు.
స్వామివారికి బంగారు కిరీట ధారణ
రాయచోటి టౌన్: బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి, అమ్మవార్లకు దాతల చేతుల మీదుగా బంగారు కిరీట ధారణ చేశారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన గురులింగప్ప కమరడిగి కుటుంబ సభ్యులు గతంలో స్వామివారికి, అమ్మవారికి బంగారు కిరీటాలను బహుకరించారు. వీటిని బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగంగా ప్రధాన ఉత్సవాల సమయంలో స్వామి వారికి, అమ్మవారికి అలంకరించడం.. ఆపై తిరిగి బ్యాంక్లో భద్రపరడచం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో దాతల కుటుంబ సభ్యులు గురువారం ఆలయానికి రావడంతో వారి ఎదుటనే కిరీటధారణ చేశారు.


