చెయ్యేరులో మా రీచ్‌లు | - | Sakshi
Sakshi News home page

చెయ్యేరులో మా రీచ్‌లు

Feb 20 2026 6:50 AM | Updated on Feb 20 2026 3:55 PM

-

అవుట్‌ ఆఫ్‌రీచ్‌లో ఇసుక దోపిడీ!

అడ్డుకుంటున్న బాలరాజపల్లె గ్రామస్తులు

గ్రామస్తులతో మంతనాలు చేసిన రీచ్‌ బాధ్యులు

ఒప్పుకోం..మీ రీచ్‌లోనే ఇసుక తీసుకోవాలని స్పష్టం చేసిన స్థానికులు

వేసవిలో భూగర్భజలాల అడుగంటే ప్రమాదం

రాజంపేట: చెయ్యేరు నదినీ ఇసుకాసురులు చెరబట్టారు. ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నారు. తమకు కేటాయించిన రీచ్‌లో కాకుండా అవుట్‌ ఆఫ్‌ రీచ్‌లోనూ ఇసుక దోపిడీకి సిద్ధమయ్యారు. ఎక్కడో దూరంలోనూ కాదు బాలరాజుపల్లె హైలెవెల్‌ వంతెనకు కిలోమీటర్‌ దూరంలోనే ఇసుకను తవ్వితరలించేందుకు నిర్వాహకులు సన్నద్ధులయ్యారు. కాగా ఆర్‌. బుడుగుంటపల్లె వద్ద ఇసుక క్వారీ ఉంది. అక్కడి నుంచే కొన్ని నెలలుగా ఇసుకను ఇష్టానుసారంగా తోడేసుకున్న సంగతి తెలిసిందే. ఇసుకాసురులకు అధికారపార్టీకి చెందిన ఓ మంత్రి అండ ఉందనే ఆరోపణలు అందరికి తెలిసిందే.

వందలాది టిప్పర్లతో..

చెయ్యేరులోని ఇసుక క్వారీ నుంచి వందలాది లారీలలో ఇసుకను ఇతర రాష్ట్రాలకు భారీగా తరలిస్తు న్న వ్యవహారం ఇంకా కొనసాగుతోంది. చెయ్యేరు లో నిబంధనలకు విరుద్ధంగా ఇటాచీ మిషన్లు పెట్టి టిప్పర్లకు లోడ్‌ చేయడం బహిరంగంగానే జరుగుతున్న జిల్లా యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితులో ఉన్నాయని చెయ్యేరు నదీపరీవాహక వాసులు వాపోతున్నారు.

బాలరాజుపల్లె వద్ద ఇసుక తోడితే ఒప్పుకోం..

ఆర్‌. బుడుగంటపల్లె వద్ద కాకుండా బాలరాజుపల్లె వద్ద ఇసుకను తోడితే ఒప్పుకోమని బాలరాజు పల్లె గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇసుక టిప్పర్లను రానివ్వకుండా గ్రామస్తులు అడ్డుకున్న సంఘటన మంగళవారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గ్రామస్తులు లేని సమయంలో టిప్పర్లను నిర్వహకులు మళ్లీ ఇసుక తోడివేతకు రంగంలోకి దింపడం గమనార్హం.

రీచ్‌ నిర్వాహకుల మంతనాలు..

రీచ్‌ నిర్వాహకులు కొంతమంది గ్రామస్తులతో మంతనాలు సాగించినట్లు తెలిసింది. బాలరాజపల్లె నుంచి ఇసుక తరలింపును తాము వ్యతిరేకిస్తున్నామని గ్రామస్తులు తేల్చిచెప్పారు.

అసలే అన్నమయ్య డ్యాం లేదు..

ముందుగానే అన్నమయ్య డ్యాం లేదు. అన్నమయ్య డ్యాం ఉండి ఉంటే బ్యాక్‌వాటర్‌ వల్ల భూగర్భజలాల సమస్య తమకు ఉండేది కాదని బాలరాజుపల్లె గ్రామస్తుడు ఒకరు‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు తాగునీటి సరఫరా జరుగుతోందని వివరించారు. బాలరాజుపల్లె దగ్గర ఇప్పటికే పెద్దపెద్దగుంతలు పడ్డాయన్నారు.

ఇసుకాసురుల ధనదాహానికి చెయ్యేరు నది చిక్కిపోతోంది. ఒంటినిండా గుంతల గాయాల తో నిలువెల్లా రోదిస్తోంది. అధికారం అండ చూసుకుని.. అధికారులను లంచాలతో కొని.. పచ్చ తోడేళ్లై .. మారీచులై రాత్రింబవళ్లు ఇసుకను తోడేస్తుంటే.. చేసేదీలేక ఇంకుతున్న క‘న్నీళ్ల’తో మౌనంగా చూస్తోంది. సాగునీరిచ్చి పంటకు.. తాగునీటితో ప్రజలకు ఆయుష్షు పోసే నదీమతల్లి నేడు దోపిడీదారుల గుప్పిట్లో చేరి బిక్కుబిక్కుమంటోంది.

బాలరాజుపల్లె వద్ద ఇసుక తోడేస్తే ఎలా? 

ఇసుకను ఇస్టానుసారంగా తోడేస్తే భూగర్భజలాలు అడుగంటి పోతాయని బాలరాజుపల్లె గ్రామీణులు ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే వేసవిలో తప్పనిసరిగా సాగునీరు, తాగునీరుకు ఇబ్బంది పడాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ జోక్యం చేసుకొని తమకు భవిష్యత్తులో నీటిగండం రాకుండా బాలరాజుపల్లెలో కాకుండా కేటాయించిన రీచ్‌లో ఇసుకను తోడుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Cheyyaru1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement