అపురూప ఘట్టం.. మహానైవేద్యం
వైభవం..రథోత్సవం
● అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు
● వీరభద్రస్వామికి బంగారు కిరీటం, మూడో కన్ను ధరింపచేసినవేదపండితులు
రాయచోటిటౌన్: రాయచోటిలోని శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో అపురూప ఘట్టమైన మహానైవేద్యాన్ని వేదపండితులు శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర ప్రాంతాలనుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
మహానైవేద్య ప్రత్యేకత..
స్వామివారికి ప్రతి రోజు అర్చకులు ప్రసాదాన్ని నైవేద్యం సమర్పిస్తారు. సంవత్సరానికి ఒక రోజు స్వామి వారికి పెద్ద రాశిలో సమర్పించే ప్రసాదాన్ని మహానైవేద్యం అంటారు. దీనికోసం స్వామికి భత్యంలో భాగంగా రోజుకు ఒక సేరు బియ్యం చొప్పున 365 రోజులకు 365 సేర్లు బియ్యంతో భోజనం, నెలకు ఒక సేరు బియ్యం ప్రకారం 12 నెలలకు 12 సేర్లు బియ్యంతో వండిన నిప్పట్లు, వివిధ రకాల కూరగాయలతో వండిన వంటకాలతో పాటు పలు రకాల దుంపలు, గుమ్మడి కాయలు వండి రాశిగా పోస్తారు. ఈ వంటకాలను తెల్లవారు జామున మూడుగంటల నుంచే సుండుపల్లె మండలం శ్రీరామాపురానికి చెందిన వారు తడిబట్టలతో మడికట్టుతో భోజనం వండి సిద్ధం చేయడం పూర్వం నుంచి వస్తున్న ఆనవాయితీ. వేదపండితులు, అర్చకులు పూజలు నిర్వహించిన తర్వాత ఆలయం మధ్యలో అన్నాన్ని రాశిగా పోశారు. వీరశైవులు రాశిపై కత్తులు దూస్తూ హర హర మహదేవ్ అంటూ విన్యాసాలు చేస్తూ రాశిని కొల్లకొట్టారు. తర్వాత వడియరాజులు కూడా మహానైవేధ్యంలోకి దూకి అందినంత వారు తీసుకెళతారు. అనంతరం ప్రధాన అర్చకులు వేదపండితుల సహాయంతో స్వామివారికి బంగారు కిరీట ధారణ చేసి 11–45 నిమిషాలకు త్రినేత్రం(మూడోకన్ను) ధరింపచేశారు.స్వామివారి త్రినేత్రం అన్నం రాశిపై పడుతుందని, అప్పుడు ఒక్క క్షణంపాటు ప్రకంపనలు వస్తాయని భక్తుల నమ్మకం.
● మహానైవేద్యం కొల్లగొట్టాక మిగిలిన నైవేద్యాన్ని ( ప్రసాదాన్ని) కన్నడ భక్తులు తీసుకొచ్చి ఆలయం వెలుపల విస్తర్లలో ఎండపెట్టుకున్నారు. ఎండిన తర్వాత వడియాలుగా మార్చుకొని తీసుకెళతారు. శుక్రవారం తెల్లవారుజుమున అగ్నిగుండ ప్రవేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి అధ్యక్షుడు తిరుమల మనోజ్‌కుమార్, ఈవో డీవీ రమణారెడ్డి పాల్గొన్నారు.
శ్రీభద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై కొలువుదీర్చి పుర వీధులలో ఊరేగించారు. ఈ సందర్భంగా కళాకారుల విన్యాసాలు, నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.వీధులన్నీ స్వామి వారి నామస్మరణతో మారుమోగాయి. ఆలయ పాలక మండలి అధ్యక్షుడు తిరుమల మనోజ్‌కుమార్, ఈవో రమణారెడ్డి పాల్గొన్నారు.


