అరటి పంట దగ్ధం.. రూ. లక్షల్లో నష్టం
పులివెందుల రూరల్ : అరటి పంట దగ్ధం కావడంతో రైతుకు రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. మండలంలోని కొత్తపల్లె గ్రామానికి చెందిన ఓబయ్య అనే రైతు 4 ఎకరాల్లో అరటి పంట సాగు చేశాడు. అరటి పిలకలు నాటినప్పటి నుంచి గెలలు వేసే వరకు చెట్లను సొంత కన్న బిడ్డల్లాగా చూసుకొని సాగు చేస్తే.. పక్కనే ఉన్న కొండకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో నిప్పు రవ్వలు వచ్చి అరటి పంటకు అంటుకున్నాయి. దీంతో అరటి పంట అగ్నికి ఆహుతైందని బాధిత రైతు ఆవేదన వ్యక్త చేస్తున్నాడు. మార్కెట్‌లో అరటి ధరలు బాగా ఉన్న సమయంలో చేతికొచ్చిన అరటి పంట ఇలా బూడిద కావడంతో కన్నీరు మున్నీరవుతున్నాడు. నాలుగు ఎకరాల్లో అరటి పంటతోపాటు డ్రిప్ పరికరాలు కాలిపోవడంతో సుమారు రూ.15 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు వాపోయాడు. బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు రైతులు కోరారు.
స్పందించని అగ్నిమాపక శాఖ అధికారులు
అరటిపంటకు అగ్ని అంటుకుందని రైతు అగ్నిమాపక శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే వారు సకాలంలో స్పందించకపోవడంతో పంట పూర్తిగా కాలిపోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.


