నిరవధిక సమ్మెలోకి సహకార ఉద్యోగులు
కడప అగ్రికల్చర్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగస్తుల యూనియన్‌ల ఐక్య వేదిక పిలుపు మేరకు.. రాష్ట్రమంతటా రెండు నెలలుగా విడతల వారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సహకార సంఘాల రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబు తెలిపారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఇందుకు నిరసనగా సోమవారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లడం జరిగిందని తెలిపారు. మంగళవారం కడప డీపీడీఎం ప్రసాద్‌కు సహకార సంఘాల సీఈఓలు వినతి పత్రం అందజేశారు. అనంతరం బాబు మాట్లాడుతూ సంఘాలకు తాళాలు వేసి ఈఆర్‌పీలు కూడా లాగిన్ చేయరాదని పిలుపు ఇచ్చామన్నారు. కడప డీసీసీబీకి సంబంధించి ఉమ్మడి జిల్లాలో 75 సంఘాలకు గాను 30 సంఘాలు లాగిన్ అయినట్టు రిపోర్ట్ చూపిస్తుందన్నారు. కానీ సంఘాలతో కానీ సీఈఓలకు కానీ సంబంధం లేకుండా ఈఆర్‌పీ లాగిన్ అయినట్లు తెలుస్తోందన్నారు. సంఘాల సిబ్బంది సమ్మెలో ఉన్నా కూడా ఈఆర్‌పీలు లాగిన్ అవ్వడం మీద అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. అంతే కాకుండా ఫైనాన్సియల్‌కు సంబంధించిన ట్రాన్సక్షన్స్ ఉన్న అన్ని సంఘాలలో ఇలాంటి చర్య తగనిదని అన్నారు. ఎవరు లాగిన్ అయ్యారో తెలియని సాఫ్ట్‌వేర్‌లో సహకార సంఘాలు కోట్ల రూపాయల ట్రాన్సక్షన్స్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సూపర్ వైజర్, డిపార్ట్‌మెంట్ వారికి కూడా వారి వారి లాగిన్ ఇచ్చారన్నారు. వారు కూడా సిబ్బంది నిరసనకు సంఘీభావం తెలిపారన్నారు. కడప డీపీడీఎం ప్రసాద్ దీనిపై సానుకూలంగా స్పందించి తగు వివరాలు పై అధికారులతో చర్చించి త్వరలో అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య, కడప జిల్లాల సంఘాల సీఈఓలు సాబ్జాన్, జాఫర్, లక్ష్మినారాయణ, ఆన్సర్, ఇందాద్, రవి, నరేష్, ఖాదరవలి, రెడ్డెప్పరెడ్డి, రవిశంకర్‌రెడ్డి, ధర్మారెడ్డి, రామచంద్ర, వీరాకుమార్, సుబ్బారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


