పై అంతస్తులో నిద్రిస్తుండగా.. కింది ఇంటిలో చోరీ..
జమ్మలమడుగు రూరల్, మైలవరం : పై అంతస్తులో నిద్రిస్తుండగా.. కింది ఇంటిలో చోరీ జరిగింది. ఈ సంఘటన మైలవరం మండలంలోని చిన్నకొమెర్ల గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. జమ్మలమడుగు రూరల్ సీఐ భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నకొమెర్ల గ్రామానికి చెందిన జయరామకృష్ణారెడ్డి (దాల్మియా కర్మాగారంలో హెచ్‌ఆర్ విభాగంలో ఉద్యోగి) సోమవారం రాత్రి భార్య పిల్లలతో కలసి మిద్దె 2వ పోర్షన్‌లో నిద్రించాడు. తెల్లవారుజామున లేచి కిందికి వచ్చి చూడగా ఇంటి ద్వారం ప్రధాన తలుపులు తెరచి ఉన్నాయి. దీంతో ఇంటిలోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు తెరచి ఉన్నాయి. అందులో ఉన్న దుస్తులు చిందర వందరగా పడి ఉన్నాయి. దీంతో బీరువాలో దాచి ఉంచిన బంగారు, వెండి, నగదు చూడగా కనపడలేదు. వెంటనే బాధితుడు తలమంచిపట్నం పోలీసులకు సమాచారం అందించాడు.
40 తులాల బంగారు, కేజీ వెండి, నగదు అపహరణ
తన ఇంటిలో 40 తులాల బంగారు, ఒక కేజీ వెండి, రూ. 6 లక్షల నగదు చోరీకి గురైందని జయరామకృష్ణారెడ్డి తలమంచిపట్నం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో డీఎస్పీ వెంకటేశ్వరరావు, రూరల్ సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐ లక్ష్మీనారాయణ బాధితుడి ఇంటికి వెళ్లి పరిశీలించారు. జిల్లా కేంద్రం నుంచి క్లూస్ టీం అధికారులు వచ్చి డాగ్ స్క్వాడ్‌తో కలిసి పరిశీలించారు.
కడప అర్బన్ : కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్)లో ఈ నెల 16 నుంచి పారిశుద్ధ్య కార్మికులు 17వ తేదీ మధ్యాహ్నం వరకు ఆందోళన ఉధృతంగా చేపట్టారు. ఐపీ, ఓపీ విభాగాల్లో చెత్తాచెదారం తొలగించకుండా విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్ మాట్లాడుతూ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 15– 20 ఏళ్ల మధ్యకాలం నుంచి పని చేస్తున్న శానిటేషన్ కార్మికులందరినీ వయోపరిమితి, విద్యార్హత పేరుతో తొలగించడం అన్యాయమన్నారు. కాంట్రాక్టర్ జీజీహెచ్‌తో శానిటేషన్ కాంట్రాక్ట్ చేజిక్కించుకున్న కొన్ని రోజులకే విద్యార్హత, ఇతరనిబంధనల పేరుతో 15 మంది సూపర్‌వైజర్‌లను తొలగించారని పేర్కొన్నారు. 58 ఏళ్లు దాటాయని 40 మందిని, 50 ఏళ్లు దాటి, కనీస విద్యార్హత 8–10 లేదని 70 మందిని తొలగించడం భావ్యం కాదన్నారు. ‘పద్మావతి హాస్పిటాలిటీ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ సర్వీస్’ పేరుతో కాంట్రాక్ట్ పనులను చేపడుతున్న భాస్కర్ నాయుడు అనే కాంట్రాక్టర్‌తోపాటు, పని చేస్తున్న సూపర్‌వైజర్ల వేధింపులు తట్టుకోలేకపోతున్నామని కార్మికులు వాపోయారు. ఇదిలా ఉండగా.. మధ్యాహ్నం వరకు ఐపీ, ఓపీ విభాగాలలో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ఓపీ విభాగంలో సీఐటీయూ నాయకులు, శానిటేషన్ సూపర్‌వైజర్లు.. అధికారులతో చర్చలు జరిపారు. నెలరోజుల పాటు గడువును ఇచ్చి కోర్టు ద్వారా గానీ, ఇతరత్రా ప్రయత్నాలతో తమకు అనుగుణంగా ఉత్తర్వులను తీసుకుని రావాలని, పరస్పర ఒప్పందం చేసుకున్నాక ఆందోళన విరమించారు.


