వైభవం.. త్రేతేశ్వరస్వామి రథోత్సవం
భారీగా తరలివచ్చిన భక్తజనం
రాజంపేట రూరల్ : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు మంగళవారం శ్రీ కామాక్షి సమేత శ్రీత్రేతేశ్వరస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మహాశివరాత్రి అనంతరం ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమాల్లో ప్రధానమైనది రథోత్సవం. దేవదేవేరిలను రథంలో తిలకించడానికి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. రథంలో కొలువుదీరిన శ్రీకామాక్షి సమేత శ్రీత్రేతేశ్వర స్వామిని దర్శించుకొని భక్తులు తరించారు. ప్రత్యేక పుష్పాలతో రథాన్ని శోభాయమానంగా అలంకరించడంతో రథం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు రథోత్సవ కార్యక్రమంలో పాల్గొనడంతో.. అత్తిరాల గ్రామంతోపాటు పరిసర ప్రాంతాల్లో సైతం జనసందోహం కనిపించింది. అనేక మంది భక్తులు రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. దీంతో పోలీసులు సైతం భక్తులను అదుపు చేసేందుకు శ్రమించాల్సి వచ్చింది. స్వామి వారి రథం తేరు మాను వరకు వెళ్లి తిరిగి వచ్చే వరకు భక్తులు హరతులు పడుతూ టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఏది ఏమైనా ఉత్సవాల్లో ముఖ్య ఘట్టమైన రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నా.. పోలీసులు, నిర్వాహకులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్వాహకులు, దేవదాయ శాఖ అధికారులు, పోలీసులు, వివిధ శాఖల అధికారులు అవిశ్రాంతంగా కృషి చేశారు. ఈ వేడుకలలో ఈఓ సురేష్‌కుమార్‌రెడ్డి, దేవస్థాన కమిటీ చైర్మన్ పూల నాగమని, మాజీ చైర్మన్‌లు పూల నరసింహులు, కె వెంకటేశ్వర్లునాయుడు, కె.సుబ్రమణ్యంనాయుడు, మన్నూరు సీఐ లింగప్ప, ఎస్‌ఐ వేంకటేశ్వర్లు, రెవెన్యూ, పంచాయతీ, విధ్యుత్ శాఖల అధికారులు, భక్తులు, వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు.
వైభవం.. త్రేతేశ్వరస్వామి రథోత్సవం


