బ్రహ్మంగారిమఠానికి ఉత్సవ శోభ
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠం ఉత్సవ శోభ సంతరించుకుంది. స్వామి, అమ్మవారి కల్యాణ వేడుకలకు సిద్ధమైంది.మహాశివరాత్రి సందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ కల్యాణ మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. శనివారం ప్రారంభమైన ఈ వేడుకలు మంగళవారం వరకు నాలుగు రోజుల పాటు జరుగుతాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం నామ సంకీర్తన, ఉపనిషత్ పారాయణం, అభిషేకం చేపట్టారు. మధ్యాహ్నం వీరబ్రహ్మేంద్రస్వామి మఠం మఠాధిపతుల మూలపురుషుడు పెద్ద గోవిందస్వామి ప్రథమ పుత్రుడు గోవిందస్వామి ధర్మపత్ని వీరపాపమాంబ ఆరాధన నిర్వహించారు. ఈ సందర్భంగా మఠాధిపతి శ్రీ వీరధర్మజ వెంకటాద్రిస్వామి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం హరికథ కాలక్షేపం, రాత్రి కలశోత్సవం, శేషవాహనోత్సవం ఉత్సాహ భరితంగా జరిగాయి.
నేటి కార్యక్రమాలు
ఉదయం సుప్రభాతం, మధ్యాహ్నం దీక్షాబంధనాలంకారోత్సవం, నామసంకీర్తన, భజనలు, సాయంత్రం కర్నూలు హరిప్రియ కళాకారుల సంగీత విభావరి, ఉత్సవం, స్థానిక ఆస్థాన పండితుల ఉపన్యాసం ఉంటాయి. రాత్రి 9 గంటలకు గోవిందమాంబ సమేత శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి దంపతుల కల్యాణం మఠాధిపతి శ్రీ వెంకటాద్రిస్వామి దంపతులు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కల్యాణానికి కందిమల్లాయ్యపల్లె పుర ప్రజలు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకురానున్నారు. ఆనవాయితీ ప్రకారం ఏటా జిల్లాలోని పెద్దపుత్తకు చెందిన తాడిగొట్ల నారాయణరెడ్డి, వీరారెడ్డి కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా కల్యాణ వేడుక నిర్వహించనున్నారు. అనంతరం నరనంది ఉత్సవం, జాగారణ, వివిధ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.
ఈశ్వరీదేవి మఠంలో..
స్థానిక శ్రీ ఈశ్వరీదేవి మఠంలోని శివాలయం సన్నిధిలో మహాశివరాత్రి మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఉదయం కలశస్థాపన, శ్రీ పార్వతీపరమేశ్వరుల విగ్రహ మూర్తులకు ప్రభాతసేవ, అభిషేకం, కుంకుమార్చన, మధ్యాహ్నం నైవేద్యం, మంత్రపుష్పం, నీరాజన తీర్థప్రసాద వితరణ, సాయంత్రం అభిషేకం, కుంకుమార్చన, రాత్రి నైవేద్య, మంత్రపుష్ప, నీరాజన తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను తిలకించి తరించారు. వారి సౌకర్యార్థం ఏర్పాట్లను మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామి ఆశీస్సులతో ఈఓ బీవీ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో చేస్తున్నారు.
నేడు స్వామి, అమ్మవారి కల్యాణం


