మెడికల్ మాఫియాను అడ్డుకోవాలి
ప్రొద్దుటూరు : స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం మెడికల్ మాఫియాను అడ్డుకోవాలని సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బి.రామయ్య, పట్టణ కార్యదర్శి సుబ్బరాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ కంపెనీలు రోగులకు తాత్కాలిక ఉపశమనం పేరుతో నకిలీ మందులను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ షాపులకు ఒక షీట్‌పై 40 శాతం రాయితీ ఇచ్చి వీధి వ్యాపారానికి అడ్డదారులు తొక్కుతున్నానని అన్నారు. ప్రజల నుంచి మాత్రం వాటిపై ముద్రించిన ఎమ్మార్పీ రేట్లకు అమ్ముతున్నారన్నారు. ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని, వారి ఆరోగ్యాలతో ఆడుకుంటున్న మెడికల్ మాఫియాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. చాలా మంది మెడికల్ షాపుల యజమానులు ఫార్మసీలో గ్రాడ్యుయేషన్ లేకపోయినా వేరొకరి సర్టిఫికెట్లతో నడుపుతూ అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారన్నారు. వీటిని నివారించాల్సిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, ఆ పై అధికారులు నెలవారి మామూళ్ల మత్తులో జోగుతున్నారని ఆరోపించారు. ఫార్మా కంపెనీలు షాపుల వారికి, కొంత మంది డాక్టర్లకు గిఫ్ట్‌ల పేరుతో ఎరవేస్తూ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారన్నారు. వెంటనే మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు చంద్రశేఖర్, మచ్చా శ్రీను, మద్దిలేటి, హరి, ప్రమీల, సుజాత తదితరులు పాల్గొన్నారు.


