కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
పులివెందుల: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నశించిందని కడప ఎంపీ వైఎస్‌ఆర్ రెడ్డి విమర్శించారు. బుధవారం వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని తన స్వగృహం వద్ద ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసుల ఉద్యోగం పూర్తిగా కూటమి నేతల చెప్పు చేతల్లో నడుస్తోందన్నారు. చిన్నారులను చిదిమేస్తున్నా ఈ ప్రభుత్వానికి పట్టడంలేదన్నారు. హోం మంత్రి ఏమి చేయకున్నా గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా మారిందన్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లో 30వేల మంది మహిళలు కనిపించలేదని అబద్ధాలు చెప్పడం జరిగిందన్నారు.
అలాంటి మహిళలను ఈ ప్రభుత్వం ఎంతవరకు కాపాడిందని ఆయన ప్రశ్నించారు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చెప్పడం చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌లకు అలవాటుగా మారిందని తెలిపారు. మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న ఈ అఘాయిత్యాలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితలు ఏమి సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతిరోజు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మహిళల కోసం చట్టాలను రూపొందించినట్లు చెప్పారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో మహిళలు నిరాదరణకు గురవుతున్నారన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టాలను ఈ ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కిందన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు.


