ఆల్మట్టి ఎత్తు పెంపును చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకోవాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు భిన్నంగా కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచి నీటిని నిలువ చేసి దిగువ రాష్ట్రాల నీటి వాటాను గండి కొట్టడాన్ని చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకోవాలని, లేకపోతే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సీపీఐ జిల్లా కార్యదర్శి జి. చంద్ర పేర్కొన్నారు. బుధవారం కడపలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 75 శాతం నీటి లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ప్రాజెక్టుల వారీగా 811 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు, మహారాష్ట్రకు 585 టీఎంసీలు కేటాయించగా, మిగులు జలాలను వాడుకునే వెసులుబాటును దిగువ ఆంధ్రప్రదేశ్‌కు కల్పించిందన్నారు. కర్ణాటక ప్రభుత్వం మొదటినుంచి తమ కేటాయించిన నీటిని వాడుకున్న తర్వాతే దిగువ ప్రాంతానికి విడుదల చేస్తామంటూ వితండవాదానికి దిగుతోందని, అయితే ఈ వాదన బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు భిన్నమైనదని ట్రిబ్యునల్ తోసి పుచ్చిందన్నారు.ఎగువ రాష్ట్రాలు ఇష్టారాజ్యంగా కేటాయింపులకు భిన్నంగా నీటిని తరలించుకుని పోతుంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే మరో మారు హక్కులు అవకాశాలు కోల్పోయిన రాయలసీమ శాశ్వత ఎడారి కావడం తథ్యమన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఏ విధమైన ప్రయోజనం చేకూర్చలేకపోతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్ నాగ సుబ్బారెడ్డి, కేసి బాదుల్లా, యు మద్దిలేటి జి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


