రెట్టింపు డబ్బులు ఇస్తామంటూ మోసం
ప్రొద్దుటూరు క్రైం : రూ.35 లక్షలు ఇస్తే ఆన్‌లైన్ ద్వారా బ్యాంక్ ఖాతాలో రూ. 50 లక్షలు జమ చేస్తామని మోసగాళ్లు నమ్మించారు. వారి ట్రాప్‌లో పడిన గంగాప్రసాద్ రూ.35 లక్షలు ఇచ్చాడు. డబ్బు చేతికి అందగానే కత్తితో బెదిరించి మోసగాళ్లు పరారయ్యారు. ఏడాది తర్వాత ప్రొద్దుటూరు పోలీసులు వారి ఆటకట్టించారు. ఈ కేసులోని ఐదుగురు అంతర్రాష్ట్ర మోసగాళ్లను ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 8.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ విభూకృష్ణ మంగళవారం రాత్రి అరెస్ట్ వివరాలను మీడియాకు వెళ్లడించారు. ప్రొద్దుటూరులోని గోకుల్‌నగర్‌కు చెందిన చెందిన ఆదిమూలం గంగాప్రసాద్ క్లర్క్‌గా పని చేస్తున్నాడు. గతేడాది జనవరి 7న కొందరు వ్యక్తులు అతని వద్దకు వచ్చి ఎంత డబ్బు నగదు రూపంలో ఇస్తే అంతకు రెట్టింపు డబ్బును ఆన్‌లైన్ ద్వారా బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేస్తామని నమ్మించారు. దీంతో ఆశపడిన గంగాప్రసాద్ అందుకు అంగీకరించి రూ. 33 లక్షల నగదును వారికి ఇచ్చాడు. అతను ఇచ్చిన డబ్బును బ్యాగ్‌లో నింపి ప్రసాద్ ఎదురుగానే వారు ఒక షూట్‌కేసులో పెట్టుకున్నారు. కొద్ది సేపటి తర్వాత ఆన్‌లైన్‌లో డబ్బు పంపడం ఆలస్యం అవుతోందని నీ డబ్బు వాపసు తీసుకో అని చెప్పి మరో బ్యాగ్‌ను ప్రసాద్‌కు ఇచ్చారు. అతను ఇంటికి వెళ్లి బ్యాగ్ తెరచి చూసుకోగా అందులో తెల్లకాగితాల బండిళ్లు ఉన్నాయి. దీంతో మోసపోయానని గ్రహించిన ప్రసాద్ టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఐదుగురు అంతర్రాష్ట్ర మోసగాళ్లు అరెస్ట్
ఈ క్రమంలో నిందితులను మంగళవారం ప్రొద్దుటూరులోని దానంబట్టి క్రాస్‌రోడ్డు సమీపంలో టూ టౌన్ సీఐ వంశీనాథ్, ఎస్‌ఐ రాఘవేంద్రారెడ్డిలు సిబ్బందితో కలసి అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో పులివెందుల మండలంలోని పెద్దరంగాపురం గ్రామానికి చెందిన కొమ్మడ్డి గంగులయ్య, బెంగళూరుకు చెందిన పఠాన్‌సత్తార్, శ్రీకాకుళం జిల్లా రాజాం గ్రామానికి చెందిన అంకం నాగేశ్, హైదరాబాద్‌లో ఉంటున్న మల్రెడ్డి గోపాల్‌రెడ్డి, నెల్లూరు జిల్లా ఆల్లూరు మండలానికి చెందిన తిరుపతి పెంచలయ్యలు ఉన్నారు. వారి వద్ద నుంచి రూ. 8.50 లక్షల నగదుతో పాటు కత్తి, షూట్ కేసును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ ముఠా సభ్యులు రైస్‌పుల్లింగ్, పవర్‌కాయిన్స్ లాంటి మోసపూరిత విధానాల ద్వారా అమాయకు ప్రజలను మోసగిస్తునట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆశకు పోయి మోసపోవద్దన్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ, ఎస్‌ఐ, సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు.
రూ. 33 లక్షలతో ఉడాయించిన మోసగాళ్లు
ఏడాది తర్వాత పోలీసులకు దొరికిన నిందితులు
ఐదుగురు అరెస్ట్, రూ.8.50 లక్షలు స్వాధీనం
అరెస్ట్ వివరాలను వెల్లడించిన ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ


