కడప: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మాట్లాడిన మాటలు అంతా మోసపూరితం, అసత్యాలేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రపంచంలో అత్యద్భుత రాజధాని అని నిన్నటి వరకు గ్రాఫిక్స్ కథలు చెప్పారని, రెండేళ్లలో రాజధాని పూర్తి చేస్తా అని చంద్రబాబే చెప్పారని, ఇప్పుడు అది నిరంతర ప్రక్రియ అంటూ మాట మారుస్తున్నారని మండిపడ్డారు.
‘రెండు రోజుల నుంచి రాష్ట్ర ప్రజల జీవితాలు మారిపోయాయి అని టీడీపీ హడావుడి చేస్తోంది. ఈ రోజు చంద్రబాబు మాట్లాడిన మాటలు మోసపూరితం, అసత్యాలే. మొన్న రెండేళ్లలో రాజధాని పూర్తి అని చెప్పారు.. ఈ రోజు ఇది నిరంతర ప్రక్రియ, కొంత భాగం మాత్రమే పూర్తి చేస్తా అంటున్నారు. లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో అప్పులు తీసుకుని నామమాత్రపు పనులు చేశారు. విభజన తర్వాత కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ, శివరామకృష్ణన్ కమిటీలు అమరావతి రాజధాని అని చెప్పాయని అబద్ధపు మాటలు చెప్పారు.
మేధావులు ఆ కమిటీల రిపోర్ట్ ఇప్పటికీ చూడవచ్చూ. ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కమిటీల పేర్లు చెప్తున్నారు. 44 శాతం మంది అమరావతికి ఒకే చెప్పారు అంటున్నారు...మరి మిగిలిన 56 శాతం గురించి మాట్లాడు. నువ్వు ఎప్పుడూ రైతు గురించి మాట్లాడటం లేదు...కేవలం అక్కడున్న రియల్ ఎస్టేట్ కోసమే మాట్లాడతావు. రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత కోరాం...తుంగలో తొక్కారు. పోలవరం ఈయనే చేసాడట...వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ ప్రాజెక్ట్ ప్రారంభమైంది ప్రజలకి తెలియదా..?
అదే 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఎంత మేలు జరిగేది?
విభజన సమయంలో 7 మండలాల విలీనం చేస్తామని కేంద్రం చెప్పింది. దాన్ని తీసుకుని ఆ మండలాలు ఇచ్చే వరకు నేను ప్రమాణం చేయను అని నాటకాలు ఆడాడు. జపాన్ సంస్థ మకీ బిహార్ కంటే ఇక్కడ దారుణ ప్రస్తుతులు ఉన్నాయని చెప్పింది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ నీ వల్ల నాశనమై పోయాడు. నువ్వు విట్, srm వంటి ప్రైవేటు సంస్థలు తెచ్చి ఏదో చేసినట్లు చెప్తున్నారు. వాళ్ళు పిల్లల వద్ద లక్షలకు లక్షలు పిండేస్తున్నారు. అదే 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఎంత మేలు జరిగేది..?
వైజాగ్ అంటే నానా యాగీ చేశారు..
మిగతా రాజధానుల్లాగానే మనకూ ఒక మంచి నగరం ఉండాలని వైజాగ్ అంటే నానా యాగీ చేశారు. అన్నీ బాగుండాలనే జగన్‌కి పిచ్చా...ఏమీ లేని చోట గ్రాఫిక్స్ చూపే నీకు పిచ్చా...?, జగన్ ఇప్పుడు చెప్తున్నట్లు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం చేస్తే ఎంత బాగుండేది..?, తక్కువ ఖర్చుతో వాటిని అభివృద్ధి చేస్తే ఎంత అభివృద్ధి జరిగేది..?, కొత్త నగరం నిరంతర ప్రక్రియ అంటూ నువ్వే చెప్తున్నావు. పార్లమెంట్ భవనం చదరపు అడుగు 4 వేలకు కడితే...నువ్వు అమరావతి 12వేలుతో కడతావా...?, ఆర్ధిక పరిస్థితి చూసుకుని వెళ్దాం అంటే నువ్వు దుర్మార్గుడివి అని ఎదురు దాడి చేస్తున్నారు..నువ్వు అక్కడ పెడుతున్న ఖర్చు ఉన్న నగరాల్లో పెట్టీ ఉంటే ఎంత సంపద సృష్టించే వాళ్ళం..?, ఇవన్నీ చెబితే ప్రతిపక్ష నేతను హేళన చేస్తూ మాట్లాడుతున్నారు
నేను చెప్పిందే వేదం అంటూ మేధావిలా ఫోజులు కొడుతున్నారు. చట్టబద్ధత పేరుతో అమరావతిని కేంద్రం చేతుల్లో పెట్టాడు. ఏ రాష్ట్ర రాజధానికి ఇలా చట్టబద్ధత తీసుకోలేదు.
రాయలసీమకు ఏం చేశావో ఒక్కటి చెప్పు..
నీ నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమకు ఏమీ చేశావో ఒక్కటన్నా చెప్పు. కర్నూలు హైకోర్టు మొదలుపెడితే దాన్ని నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లావు. మేము మనుషులం కాదా...మాకు సెంటిమెంట్లు ఉండవా...?, అమరావతి దేవతల రాజధాని అయితే..కర్నూలు పరమ శివుడి తిరుగాడిన ప్రాంతం. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని మాకు లేదు...నువ్వే వాటిని రాజేస్తున్నావు. ఆ రోజు పోతిరెడ్డిపాడు, నేడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తాకట్టు పెట్టావు. నీకు తెలంగాణపై ఉన్నంత ప్రేమ రాయలసీమపై లేదా..?, నీలా ఒక ప్రాంతాన్ని కాకుండా రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌తో సంబంధం లేదని మొన్న చట్టం చేశారు...మరి ఉమ్మడి ఆస్తులు సంగతి ఏమిటి..?, తెలంగాణలో నిన్ను తరిమేస్తే వచ్చి...కట్టుబట్టలతో వచ్చానని చెప్పడం దేనికీ..?
జగన్ చేపట్టిన పోర్ట్, మెడికల్ కాలేజీల ఏర్పాటు ప్రజల జీవితాలను మార్చేశారు. రాయచోటి జిల్లా కేంద్రం తీసేసిన నీకు అక్కడి ప్రజలకు సెంటిమెంట్లు ఉంటాయని తెలియదా...?, అమరావతిలో ఏదో జరిగితే మా రాయలసీమ ప్రాంతపు వాదులు అమాయకంగా కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు. అలా ఆదేశాలు ఇచ్చి మరీ పండగ అంటూ హడావుడి చేస్తున్నారు. ఏమీ చేయకపోయినా చంద్రబాబు పబ్లిసిటీ చేసుకోవడంలో దిట్ట.
రాజ్యసభలో అమరావతి అని మాట్లాడించి కులాల కుంపట్లు రాజేస్తూ ఇతరులను విమర్శిస్తున్నారు. రేణుకా చౌదరీ మాటలను మీలో ఎవరైనా ఖండించారా...?, ఆనాడు జలయజ్ఞం నుంచి నేటి రాయలసీమ లిఫ్ట్ వరకూ కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారు. రాష్ట్రాన్ని కులాల పరంగా చిచ్చులు పెట్టీ రాజకీయ లబ్ది పొందుతూ మమ్మల్ని అంటే ఎలా..?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


