గండికోట నుంచి నీరు బంద్‌ | - | Sakshi
Sakshi News home page

గండికోట నుంచి నీరు బంద్‌

Apr 3 2026 7:50 AM | Updated on Apr 3 2026 7:50 AM

గండికోట నుంచి నీరు బంద్‌ ఐదుగురు తహసీల్దార్ల బదిలీ ముగిసిన పది పరీక్షలు

జమ్మలమడుగు: గండికోట జలాశయం నుంచి మైలవరానికి అధికారులు నీటి సరఫరా బంద్‌ చేశారు. గత నెల 27వతేదిన మైలవరం జలాశయానికి ఒక గేటు ద్వారా 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ తర్వాత వాటి స్థాయిని 5వేల క్యూసెక్కులకు పెంచారు. ప్రస్తుతం మైలవరం జలాశయంలో 2.7 టీఎంసీల నీరు చేరింది. గండికోట నుంచి మైలవరం జలాశయానికి రెండు టీఎంసీల నీటి విడుదల కోటా అయిపోవడంతో నీటిని నిలుపుదల చేసినట్లు అధికారులు ప్రకటించారు.

కడప సెవెన్‌రోడ్స్‌: జిల్లాలో ఐదుమంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. గతంలో మైలవరంలో పనిచేస్తూ బదిలీ అయి పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న ఎం.లక్ష్మినారాయణను కాశినాయన మండల తహసీల్దార్‌గా నియమించారు. అలాగే గతంలో కలసపాడులో పనిచేస్తూ బదిలీపై పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న జీవీ మధురవాణిని తొండూరు తహసీల్దార్‌గా నియమించారు. అడహక్‌ పదోన్నతి పొంది పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న బి.అనూరాధను సింహాద్రిపురం తహసీల్దార్‌గా, పోరుమామిళ్లలో పనిచేస్తున్న డి.ఉదయభాస్కర్‌రాజును ప్రొద్దుటూరుకు బదిలీ చేశారు. కలెక్టరేట్‌ పరిపాలన అధికారిగా పనిచేస్తున్న కె.విజయ్‌కుమార్‌ను పోరు మామిళ్ల తహసీల్దార్‌గా నియమించారు.

కడప ఎడ్యుకేషన్‌: జిల్లావ్యాప్తంగా గత నెల 16వ తేదీ నుంచి ప్రారంభమైన పదోతరగతి పరీక్షలు గురువారంతో ముగిశాయి. పరీక్ష ముగిసిన అనంతరం బయటికి రాగానే విద్యార్థులు ఆనందంతో ఎగిరి గంతులేశారు. జిల్లావ్యాప్తంగా గురువారం జరిగిన ఇంగ్లిష్‌ పరీక్షకు 176 మంది గైర్హాజరయ్యారు. 167 పరీక్షా కేంద్రాల్లో 27,826 మంది విద్యార్థులకుగాను 27,650 మంది హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన 7 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు 44 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా.. 68 పరీక్షా కేంద్రాల్లో సిట్టింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement