● నేడు శుభ శుక్రవారం
● చర్చిల్లో ప్రత్యేక ప్రార్దనలు
రాజంపేట టౌన్: క్రీస్తు అనగానే క్షమ, కరుణ గుణాలు గుర్తుకు వస్తాయి. లోకంలోని పాపులను పరిశుద్ధులు చేసేందుకు, వారికి క్షమను అందించేందుకు కరుణామయుడైన ఏసుక్రీస్తు శిలువపై తన ప్రాణాలను బలిపెట్టిన రోజే గుడ్‌ఫ్రైడే. దీనినే శుభ శుక్రవారం అని కూడా అంటారు. తన ఆత్మబలిదానంతో పాపులకు దేవుని పరిశుద్ధసన్నిధిలో స్థానం కల్పించిన ఈ శుక్రవారాన్ని ప్రపంచంలోని క్రైస్తవులందరూ శుభ శుక్రవారంగా భావిస్తారు. దయామయుడైన క్రీస్తు శిలువపై చిందించిన రక్తం మానవాళికి శుభాలను చేకూర్చింది. అందువల్ల క్రైస్తవులు, విశ్వాసులు గుడ్‌ఫ్రైడేని భక్తిశ్రద్దలతో నిర్వహించుకుంటారు. గుడ్‌ఫ్రైడే నాడే కల్వగిరిపై క్రీస్తును శిలువపై శిక్షించారు.
ఘనంగా ఏర్పాట్లు
జిల్లాలో గుడ్‌ఫ్రైడే వేడుకలను నిర్వహించుకునేందుకు క్రైస్తవులు, విశ్వాసులు అన్ని ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా పాస్టర్లతో పాటు క్రైస్తవులు, విశ్వాసులు చర్చిల్లో ఉపవాస ప్రార్థనలు చేయనున్నారు. ఏసు ప్రభువు చూపిన మార్గాన్ని అనుసరించి ఆరాధించే వారికి పరలోకపు ద్వారాలు తెరుచుకొని ఉంటాయని విశ్వాసుల ప్రగాఢ నమ్మకం. ఏసు మరణం సృష్టిలో ఓ అద్భుతమైన త్యాగపూరిత మరణం. దేవునితో మానవునికి శాశ్విత బంధాన్ని ఏర్పరిచిన గొప్ప మరణం అని పాస్టర్లు చెబుతున్నారు.
రేపటితో ముగియనున్న లెంట్ డేస్
గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని క్రైస్తవులు, విశ్వాసులు 40 రోజుల పాటు లెంట్‌డేస్ (శోకదినాలు) నిర్వహిస్తారు. ఇవి శనివారంతో ముగియనున్నాయి. లెంట్‌డేస్‌ను పురస్కరించుకొని అనేక మంది క్రైస్తవులు గత నలబై రోజులుగా శుభకార్యాలకు దూరంగా ఉన్నారు. అలాగే దైవధ్యానంలోనే గడుపుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక ప్రార్దనలు చేస్తున్నారు. కాగా శుక్రవారం గుడ్‌ఫ్రైడేని, ఆదివారం ఈస్టర్ వేడుకలను క్రైస్తవులు, విశ్వాసులు ఘనంగా నిర్వహించుకోనున్నారు.
పునరుత్తానమే ఈస్టర్
కల్వరి కొండమీద శిలువపై మరణించిన క్రీస్తును....అక్కడి కొండ గుహలో సమాధి చేస్తారు. మూడోరోజు ఏసుక్రీస్తు పునరుత్తానం పొంది తిరిగి తన శిష్యులకు దర్శనమిచ్చినట్లు పాస్టర్లు చెబుతున్నారు. ‘నేను జీవమును’ అన్న మాటకు నిదర్శనంగా నిలిచి లోకానికి తన దివ్య మహిమను చాటారు. ప్రభువు పునరుత్తానం చెందిన ఆదివారాన్ని ఈస్టర్ సండేగా పిలుచుకుంటారు. అశాంతితో తల్లడిల్లుతున్న నేటి ప్రపంచానికి క్రీస్తు ప్రబోధించిన ప్రేమ, దయ, కరుణ, క్షమ గుణాలు ఆదర్శం కావాలని పాస్టర్లు చెబుతున్నారు. కాగా జిల్లాలో పలు చర్చిల్లో క్రీస్తు ఆత్మబలిదానం, శిలువయాగం తదితర ఘట్టాలను ప్రదర్శించనున్నారు. గుడ్‌ఫ్రైడే సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్దనలు చేయనున్నారు. ఈసందర్భంగా పాస్టర్లు ఏసు ప్రభువు కల్వరి కొండపై బలిదానం చేసిన ఘట్టాలను క్రైస్తవులు, విశ్వాసులకు తెలియచేయనున్నారు.


