సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాజధాని పేరుతో లక్షల కోట్లు దోచుకొంటున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. దేవతల రాజధాని నిర్మిస్తున్నానంటూ 2014లో మొదలు పెట్టారు. చంద్రబాబు భూ దోపీడీకి పాల్పడుతున్నారు. 50 వేల ఎకరాలు భూమి కావాలని బంగారు పండించే భూములను రైతుల వద్దనుండి దుర్మార్గంగా లాక్కున్నారని రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘లక్ష ఎకరాలు భూమిలో దేవతల రాజధానిని నిర్మిస్తానని రైతుల వద్దనుండి లాక్కునేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. రెండు లక్షల కోట్లతో లక్ష ఎకరాల భూమిలో రాజధాని నిర్మిస్తానని అంటున్నారు. 7 సంవత్సరాలలో రెండు లక్షల కోట్ల ఖర్చు పెట్టాల్సిన బాబు.. ఇప్పటికి 80 కోట్లు ఖర్చు చేశారు. రాజధాని పూర్తి కావాలంటే 200 సంవత్సరాలు అయినా పడుతుంది. రాజధాని నిర్మాణం సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని చెప్పిన చంద్రబాబు.. 47 వేల కోట్లు రాజధానికి అప్పు చేశారు.. ఇప్పటికి 13 వేల కోట్లు అప్పుచేశారు.
భవన నిర్మాణం చదరపు అడుగు 4 వేలు ఉంటే 14 వేలు ఖర్చు చేస్తూన్నారు.. 22 నెలల్లో 3 లక్షల 41 వేల కోట్లు ఇప్పటివరకు ప్రజల పేరుతో అప్పు చేశారు. అమరావతి రాజధాని బేతాళ కథలతో సమానం. చంద్రబాబు ఉన్నన్నిరోజులు రాజధాని నిర్మాణం పూర్తి చేయలేరు’’ అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు.


