అత్తను చంపిన అల్లుడికి యావజ్జీవ శిక్ష | - | Sakshi
Sakshi News home page

అత్తను చంపిన అల్లుడికి యావజ్జీవ శిక్ష

Feb 18 2026 7:16 AM | Updated on Feb 18 2026 7:16 AM

అత్తను చంపిన అల్లుడికి యావజ్జీవ శిక్ష

అత్తను చంపిన అల్లుడికి యావజ్జీవ శిక్ష

కూలి డబ్బు ఇవ్వలేదని హతమార్చిన వైనం

2021లో ప్రొద్దుటూరులో జరిగిన ఘటన

ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు శివారులోని కొర్రపాడు రోడ్డులో 2021లో జక్కం గ్రేసమ్మను హత్య చేసిన కేసులో.. ఆమె అల్లుడు కమతం సూరిబాబుకు ప్రొద్దుటూరు సెకండ్‌ ఏడీజే కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కోర్టు వర్గాలు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపల్లె పంచాయతీ పరిధిలో ఉన్న వివేకానందనగర్‌కు చెందిన గ్రేసమ్మ తన భర్తతో విభేదాల కారణంగా 8 ఏళ్ల నుంచి శంకరాపురం గ్రామంలోని తన పెద్ద కుమార్తె వద్ద ఉండేది. అక్కడే కూలి పనికి వెళ్తూ వచ్చిన డబ్బును కుమార్తెకు ఇచ్చేది. అయితే ప్రొద్దుటూరు మండలంలోని నక్కలదిన్నె గ్రామానికి చెందిన రెండవ కుమార్తె భర్త అయిన కమతం సూరిబాబు (ముద్దాయి) కూడా తనకు డబ్బులు ఇవ్వాలని తరచూ గ్రేసమ్మతో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో 2021 మర్చి 2న గ్రేసమ్మ నక్కలదిన్నెలో ఉంటున్న రెండవ కుమార్తె ఇంటికి వెళ్లింది. సాయంత్రం సమయంలో శంకరాపురం గ్రామానికి వెళ్లాలని చెప్పగా.. అల్లుడు సూరిబాబు తన టీవీఎస్‌ ఎక్సెల్‌లో వాహనంపై తీసుకెళ్తానని చెప్పాడు. ఈ క్రమంలో ఆమెను వాహనంలో తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో డబ్బుల విషయమై గొడవ పడ్డాడు. వారి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. దీంతో సూరిబాబు గ్రేసమ్మను టీవీఎస్‌ ఎక్సెల్‌పై నుంచి కిందికి తోసేశాడు. అక్కడితో ఆగక ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. కొర్రపాడు రోడ్డులోని టిడ్కో ఇళ్ల సముదాయం సమీపంలోని ముళ్ల పొదల్లో మృతదేహాన్ని పడేశాడు. గ్రేసమ్మను హత్య చేసినట్లు సూరిబాబు తన భార్య మరియమ్మకు చెప్పాడు. కుటుంబ సభ్యులందరూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి కుమారుడు జక్కం శాంతుడు ఫిర్యాదు మేరకు అప్పటి రూరల్‌ సీఐ విశ్వనాథ్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

యావజ్జీవ శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా

నాటి నుంచి ఈ కేసు ప్రొద్దుటూరు సెకండ్‌ ఏడీజే కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో నేరం రుజువు కావడంతో ముద్దాయి కమతం సూరిబాబుకు యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ. 10 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం ప్రొద్దుటూరు సెకండ్‌ ఏడీజే కోర్టు న్యాయమూర్తి కే సత్యకుమారి తీర్పు వెల్లడించారు. అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మార్తల సుధాకర్‌రెడ్డి బలమైన వాదనలు వినిపించి నేర నిరూపణలో కీలక పాత్ర పోషించారు. ఈ కేసులో శ్రమించి దోషికి శిక్ష పడేలా చేసిన రూరల్‌ సీఐ నాగభూషణం, ఎస్‌ఐలు శ్రీకాంత్‌, కేసీ రాజు, కోర్టు మానిటరింగ్‌ సిబ్బంది ఏ నాగరాజు, ప్రొద్దుటూరు రూరల్‌ కానిస్టేబుల్‌ వెంకటయ్యను జిల్లా ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌, ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement