బార్ బరి.. గెలుపెవరిదోమరి !
● ఏడేళ్ల తర్వాత
ఏపీ బార్ కౌన్సిల్‌కు ఎన్నికలు
● 13న పోలింగ్‌కు సన్నద్ధం
రాజంపేట : జిల్లాలోని న్యాయవాద వర్గాల్లో ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈనెల 13న ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ కోర్టులకు సంబంధించి బార్ అసోసియేషన్లు తమ తమ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు పోటీపడుతున్నారు. బార్ కౌన్సిల్ ఓటరు జాబితాను ఖరారు చేసింది. మొదటి ప్రాధాన్యత ఓటు కోసం న్యాయవాదులు మల్లగుల్లాలు పడుతున్నారు.ఏడేళ్ల తర్వాత స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతుండటం గమనార్హం.
సుప్రీంకోర్టు నియమించిన కమిటీ పర్యవేక్షణ
ఈ ఏడాది జనవరి 3న గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి విధితమే. జనవరి 5 నుంచి 13 మధ్య నామినేషన్లు స్వీకరించారు. ఈ ఎన్నికలు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయి. సుప్రీం కోర్టు నియమించిన కమిటీ పర్యవేక్షణలో ఈ ఎన్నికల ప్రక్రియ జరగనుంది.
బరిలో 143 మంది అభ్యర్ధులు
రాష్ట్ర వ్యాప్తంగా 109 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 23 స్ధానాల కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 150 బార్ అసోసియేషన్లు ఉన్నాయి. 143మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. 23మందిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వీరిలో నుంచి చైర్మన్ అభ్యర్ధిని ఎంపిక చేసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 39409 ఓట్లు ఉన్నాయని స్టేట్‌బార్ కౌన్సిల్ వెల్లడించింది.
జిల్లాలో ఏయే కోర్టు పరిధిలో..
జిల్లాలో కడప, బద్వేలు,జమ్మలమడుగు,నందలూరు, ప్రొద్దుటూరు,పులివెందుల,రాజంపేట, రాయచోటి , రైల్వేకోడూరు, మైదుకూరు, కమలాపురం,లక్కిరెడ్డిపల్లె కోర్టుల పరిధిలో బార్ అసోసియేషన్ కార్యవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఉన్న న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ బార్ అసోసియేషన్ల పరిధిలో ఏపీ బార్ స్టేట్ కౌన్సిల్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం పోలింగ్ అధికారులను కూడా త్వరలో నియమించి, ఉత్తర్వులు విడుదల చేయనున్నారు. ఇప్పటికే పోలింగ్ అధికారుల ఎంపిక కొనసాగిందని న్యాయవాదులు చెబుతున్నారు.
జిల్లా వారీగా ఓట్లు ఇలా..
న్యాయవాదుల సమాచారం మేరకు జిల్లా వారీగా ఓటర్లు వివరాలు ఇలా ఉన్నాయి. కడప(760), రాజంపేట (154), రైల్వేకోడూరు(35), నందలూరు (24), పులివెందుల (24), కమలాపురం (20), మైదుకూరు (16), జమ్మలమడుగు(30), రాయచోటి (113), ప్రొద్దుటూరు(316), బద్వేలు (69) , ఉన్నాయి. మాడల్‌బైలాస్ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఎన్నికల నిర్వహిస్తామని ప్రస్తుత కార్యవర్గం హైకోర్టుకు నివేదించింది. ఇప్పటికే ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని వివరించింది. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు..ఆ షెడ్యూల్ ప్రకారం ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతవరణంలో ఎన్నికలు నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే.


