అంబటి రాంబాబు కుటుంబానికి పరామర్శ
కడప కార్పొరేషన్ : మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు పరామర్శించారు. బుధవారం ఆ పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ఎమ్మెల్సీ రుహుల్లా, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి నూరి ఫాతిమా లు గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు ఆపకపోతే ప్రజలే తగిన బుద్దిచెబుతారని హెచ్చరించారు. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేయడం నేరమని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, వైయస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. అంబటి రాంబాబు వంటి ప్రజాదరణ కలిగిన నాయకుడి ఇంటిపై దాడి చేయడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం, పోలీస్ వ్యవస్థ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించకపోతే ప్రజల్లో మరింత ఆగ్రహం వెల్లువెత్తుతుందని నాయకులు హెచ్చరించారు. రాజకీయ ప్రతీకార చర్యలను అరికట్టడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబు గారికి, ఆయన కుటుంబానికి పూర్తి సంఘీభావంగా నిలుస్తుందని, ఇలాంటి దాడులకు భయపడేది లేదని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చివరి వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.
అంబటి ఇంటిపై దాడి శాంతి భద్రతల
వైఫల్యానికి నిదర్శనం


