మహా శివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
కడప కోటిరెడ్డిసర్కిల్: మహా శివరాత్రిని పురస్కరించుకుని ఈనెల 14, 15 తేదీల్లో కడప జోన్‌లోని ఎనిమిది జిల్లాల నుంచి 1454 ప్రత్యేక బస్సులను నడపనున్నామని కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్‌టీపీ రాఘవకుమార్ తెలిపారు. మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జోన్ వ్యాప్తంగా ఎనిమిది జిల్లాల్లో 51 డిపోలు, 4249 బస్సులు ఉన్నాయన్నారు. వీటిలో మహా శివరాత్రిని పురస్కరించుకుని 1454 ప్రత్యేక సర్వీసులను నడపుతున్నామన్నారు. వీటిలో అత్యధికంగా శ్రీశైలంకు 460 బస్సులు, వైఎస్సార్ జిల్లాలోని పొలతలకు 130, నిత్యపూజకోన 40, లంకమల 34 బస్సులను నడుపుతున్నామన్నారు. వీటిలో వైఎస్సార్ జిల్లా నుంచి 318బస్సులు, కర్నూలు 276, నంద్యాల 275, చిత్తూరు 71, సత్యసాయి 30, తిరుపతి 182, అన్నమయ్య 245, అనంతపురం నుంచి 57 బస్సులు చొప్పున శివరాత్రికి నడుపుతున్నామన్నారు. భక్తులు సురక్షితంగా ప్రయాణించేందుకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీటీఎం ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
● శ్రీశైలానికి 460 బస్సులు
● జిల్లాలోని పొలతలకు 130 సర్వీసులు
● కడపజోన్ ఈడీ ఎస్‌టీపీ రాఘవకుమార్


